కుప్పం రెస్కోకు సొంత కన్స్యూమర్ యాప్
ABN , Publish Date - Dec 15 , 2025 | 01:17 AM
కుప్పం గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థ (రెస్కో) ఎట్టకేలకు సొంత కన్స్యూమర్ మొబైల్ యాప్ తయారు చేసుకుంది. వినియోగదారులకు సంబంధించిన సమస్త సమాచారమూ, బిల్లుల చెల్లింపుతో సహా నిక్షిప్తం చేసిన ఈ యాప్‌తో వినియోగదారుల కష్టాలు తొలిగే అవకాశం ఏర్పడింది.
కుప్పం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కుప్పం గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థ (రెస్కో) ఎట్టకేలకు సొంత కన్స్యూమర్ మొబైల్ యాప్ తయారు చేసుకుంది. వినియోగదారులకు సంబంధించిన సమస్త సమాచారమూ, బిల్లుల చెల్లింపుతో సహా నిక్షిప్తం చేసిన ఈ యాప్‌తో వినియోగదారుల కష్టాలు తొలిగే అవకాశం ఏర్పడింది. నిన్నమొన్నటిదాకా వినియోగదారులు విద్యుత్తు బిల్లులు చెల్లించాలంటే రెస్కో కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. అక్కడ ఉండేది రెండు కౌంటర్లు అయినా తరచూ పనిచేసేది కేవలం ఒక కౌంటరే. ఈ కౌంటర్ వద్ద గంటల తరబడి క్యూలో నిలబడి బిల్లులు చెల్లించాల్సిందే. ఆఫీసులకు వెళ్లేవాళ్లు, ఇతర పనులకు వెళ్లేవాళ్లు సైతం చచ్చినట్లు క్యూలో వేచి ఉండాల్సిందే. తీరా తమవంతు వచ్చాక బిల్లు మొత్తం చెల్లించడానికి కనీసం యూపీఐ స్కాన్ సౌకర్యం కూడా ఉండేది కాదు. పైగా చిల్లర సమస్యతో ఇబ్బందిపడాల్సి వచ్చేది. మధ్యలో కొందరు రెస్కో సిబ్బంది సూచించిన వెబ్‌సైట్‌లో విద్యుత్తు బిల్లులు చెల్లించారు. అయితే ఆ మొత్తం ఏమయ్యేదో కానీ, తర్వాతి నెల ముందటి నెల బకాయితో కలిపి రెండు నెలల బకాయి మోత మోగేది. కట్టామని చెప్పినా వినిపించుకోకుండా మళ్లీ ముక్కుపిండి వసూలు చేసేవారు. ఇప్పుడటువంటి కష్టాలన్నింటికీ యాప్ చెక్ పెట్టింది.
ఫ యాప్ వినియోగం ఇలా: రెస్కో తీసుకువచ్చిన కన్స్యూమర్ మొబైల్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి యాప్‌ల విభాగంలో కుప్పం రెస్కో అని శోధించాలి. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి అడిగిన వివరాలను భర్తీ చేసి సైన్ అప్ చెయ్యాలి. ఈ యాప్‌లో బిల్లు తనిఖీ, బిల్లు చెల్లింపులు, ఖాతా కాపీ, ఫిర్యాదు నమోదు, సిబ్బంది సంప్రదింపు వివరాలు అనే విభాగాలుంటాయి. ఈ యాప్ నుంచి బిల్లులను ఇంటివద్ద నుంచే చెల్లించవచ్చు. చెల్లించిన బిల్లు రశీదును కూడా దీనినుంచే పొందవచ్చు. బిల్లుల వివరాలు చూసుకోవచ్చు. ఫిర్యాదులుంటే చేయవచ్చు. ఏవైనా సేవలు అవసరమైతే యాప్‌లో సూచించిన సిబ్బందిని సంప్రదించే సౌకర్యం కూడా ఈ యాప్‌లో ఉంది.