Share News

కుప్పం ఆర్‌అండ్‌బీ రోడ్లకు మహర్దశ

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:32 AM

రూ.53.27 కోట్లతో అభివృద్ధి

కుప్పం ఆర్‌అండ్‌బీ రోడ్లకు మహర్దశ
అభివృద్ధి పనులు మంజూరైన కుప్పం-గుడుపల్లె రోడ్డునుంచి అగరం క్రాస్‌ దాకా ఉన్న రోడ్డుపై ఇటీవలే గుంతలు పూడ్చి వేసిన ప్యాచ్‌లు

కుప్పం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఒక తట్టమట్టికి కూడా నోచుకోని కుప్పం ఆర్‌అండ్‌బీ రహదారులు శాశ్వతమైన అభివృద్ధికి అనవాళ్లుగా మారనున్నాయి. కుప్పం నియోజకవర్గ పరిధిలో మొత్తంగా రూ.53.27 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో పంచాయతీలను కలిపే 19 రోడ్ల మరమ్మతు పనులకు రూ.34.27 కోట్ల నాబార్డు నిధులను, నియోజకవర్గ పరిధిలోని 4 స్టేట్‌ హైవే రోడ్లకు రూ.19.08 కోట్లను కేటాయించారు.

వైసీపీ ఐదేళ్ల పాలనలో కంకర తేలి, గుంతలు పడి, మట్టిగా మారిన రహదారులు.. వాహన చోదకులకు, పాదచారులకు నరకాన్ని చూపించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో రూ.22 కోట్లతో చేపట్టిన సిమెంటు రోడ్ల నిర్మాణం దాదాపు పూర్తయ్యింది.వైసీపీ హయాంలో తారు రోడ్లపైపడ్డ గుంతల పూడ్చివేతకు మరో రూ.1.28 కోట్లను వ్యయం చేశారు. సుమారు 51 కిలోమీటర్ల మేర రోడ్లపై పడ్డ గుంతలను పూడ్చే పనులు కొనసాగుతున్నాయి. ఇంత చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తృప్తి కలగలేదు.రవాణా వ్యవస్థ బాగుంటేనే ఏ ప్రాంతమైనా నిరంతరాయంగా అభివృద్ధి జరుగుతుందని ఆయన నమ్మిక. అందుకోసమే రోడ్లను అభివృద్ధి చేసేందుకు నియోజకవర్గ పరిధిలోని ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధికి ఏకంగా రూ.53.27 కోట్లను మంజూరు చేశారు. ఈ నిధులతో చేపట్టబోయే మొత్తం 23 రోడ్లలో 19 రోడ్లు గ్రామాలను అనుసంధానించే రోడ్లు కాగా, మిగిలిన 4 రోడ్లు స్టేట్‌ హైవేకు సంబంధించిన రోడ్లు. ఈ రెండు విఽధాలైన రోడ్లకు వేర్వేరుగా రూ.34.27, రూ.19.08 కోట్లతో పరిపాలనా అనుమతులు, సాంకేతిక అనుమతులు ఇస్తూ గత నెల 5వ తేదీన జీవో జారీ అయింది. కుప్పం- పలమనేరు రోడ్డునుంచి రాళ్లబూదుగూరు మీదుగా కర్ణాటక రాష్ట్రం కేజీఎ్‌ఫకు (రూ.405 లక్షలు), కుప్పం-గుడుపల్లె రోడ్డునుంచి గుండ్లసాగరం, పొగురుపల్లెల మీదుగా కర్ణాటక సరిహద్దుకు (రూ.602 లక్షలు), కుప్పం నుంచి పెద్దపర్తికుంటకు (రూ.516లక్షలు), రామకుప్పంనుంచి విలాపురానికి (రూ.385 లక్షలు) మొదలైన 4 రోడ్లు స్టేట్‌ హైవేలు ఉన్నాయి. మిగిలిన 19 రోడ్లు గ్రామాలను కలుపుతూ ఉన్నవే. అధ్వానంగా ఉన్న ఈ రోడ్ల మరమ్మతు పనులకు నిధులను కేటాయించారు. త్వరలోనే టెండర్లను ఆహ్వానించి ఆయా పనులను చేపట్టనున్నారు.

గుంతలు పూడ్చిన రోడ్లకు కూడా

కుప్పం నియోజకవర్గంలోని గ్రామాలను కలిపే రోడ్లు, స్టేట్‌ హైవేల అభివృద్ధికి నిధులు మంజూరవడం, త్వరలోనే టెండర్లు జరిగి ఆయా రోడ్ల పనులు ప్రారంభం కావడం బాగానేవుంది. అయితే ఈ 23 రోడ్లలో కొన్నింటికి ఇటీవలే తాత్కాలిక మరమ్మతులు జరిగాయి. రోడ్లపై గుంతలుపడి దారుణంగా ఉన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులకోసం కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే రూ.1.28 కోట్లు మంజూరు చేసింది. ఆయా రోడ్లపైపడ్డ గుంతలు కూడా ఈ నిధులతో పూడుస్తున్నారు. ఈ పనులు దాదాపు ముప్పావువంతు పూర్తయ్యాయి. అయితే ఈ గుంతలు పూడ్చిన రోడ్లలోనే కొన్నిరోడ్ల అభివృద్ధికి ఇప్పుడు నిధులు మంజూరు కావడం విశేషం. ఉదాహరణకు కుప్పం-గుడుపల్లె రోడ్డునుంచి అగరం క్రాస్‌ దాకా ఉన్న రోడ్డును రూ.80 లక్షలతో అభివృద్ధి చేయనున్నారు. అయితే ఈ రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి ఇటీవలే మరమ్మతు చేశారు. అలాగే రూ.1.85 కోట్లతో అభివృద్ధి పనులు మంజూరైన గడ్డూరు నుంచి కెనమాకులపల్లె, పెద్దూరుల మీదుగా కర్ణాటక సరిహద్దు దాకా మంజూరైన రోడ్డుపై ఉన్న గుంతలను కూడా ఇటీవలే పూడ్చారు. ఈ రెండు పనులే కాక, కొత్తగా అభివృద్ది పనులు మంజూరైన మరికొన్ని రోడ్లపైపడ్డ గుంతల పూడ్చివేత పనులు రెండుమూడు నెలల క్రితం మంజూరైన రూ.1.28 నిధులతో పూర్తి చేశారు.అధికారులు ఇటువంటివన్నీ ఆలోచించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తే బావుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.

అడిగిన రోడ్లు ఇవ్వలేదని టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి

కుప్పం నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు మంజూరైనా, త్వరలోనే ఆయా పనులు ప్రారంభం కానున్నా సరే, టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. తారు రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారని, ఏయే రోడ్లు కావాలో జాబితాలు ఇవ్వాలని సుమారు రెండు నెలల క్రితం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ మండల పార్టీ నాయకులనుంచి జాబితాలు తీసుకున్నారు. తీరా జీవోలో వచ్చిన జాబితాలో వారు సూచించిన రోడ్లు లేకపోవడంతో హతాశులయ్యారు. ఫలానా రోడ్డు జాబితాలో పెట్టామని, ఆ రోడ్డు తప్పకుండా అభివృద్ధి అవుతుందని ప్రజలకు, పార్టీ శ్రేణులకు చెప్పిన తర్వాత, వేరే జాబితా రావడం తమకు జరిగిన అవమానంగా నాయకులు భావిస్తున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ డీఈఈ దస్తగిరిని ‘ఆంరఽధజ్యోతి’ వివరణ కోరగా.. బాగా పాడైన రోడ్లనే అభివృద్ధి పనులకు ప్రతిపాదించామని చెప్పారు. అయినా ఇప్పుడు మంజూరైన రోడ్ల జాబితా ఇప్పటిది కాదన్నారు. జూన్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన పర్యటన సందర్భంగా తయారైందని వివరించారు.

Updated Date - Mar 11 , 2025 | 01:32 AM