Share News

ఒకటొకటిగా నిండుతున్న కుప్పం చెరువులు

ABN , Publish Date - Sep 08 , 2025 | 01:09 AM

కుప్పం నియోజకవర్గం ఆకుపచ్చగా మురిసిపోవడం ఇక ఎంతో దూరంలో లేదు. భూగర్భ జలాలు పన్నెండు వందల అడుగుల లోతు నుంచి పైపైకి ఎగసి రావడానికి అట్టే సమయం పట్టదు. 733 కిలోమీటర్ల దూరం నుంచి తరలివస్తున్న కృష్ణమ్మ.. ఇక్కడి చెరువులను ఒకటొకటిగా నింపుకుంటూ వెళుతుండటం వల్లే ఇవి సాధ్యం కాబోతున్నాయి.

ఒకటొకటిగా నిండుతున్న కుప్పం చెరువులు
నిండుతున్న వీరప్పనాయని చెరువు

కుప్పం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కుప్పం నియోజకవర్గం ఆకుపచ్చగా మురిసిపోవడం ఇక ఎంతో దూరంలో లేదు. భూగర్భ జలాలు పన్నెండు వందల అడుగుల లోతు నుంచి పైపైకి ఎగసి రావడానికి అట్టే సమయం పట్టదు. 733 కిలోమీటర్ల దూరం నుంచి తరలివస్తున్న కృష్ణమ్మ.. ఇక్కడి చెరువులను ఒకటొకటిగా నింపుకుంటూ వెళుతుండటం వల్లే ఇవి సాధ్యం కాబోతున్నాయి.

హంద్రీ-నీవా కాలువ ద్వారా నిండేలా నిర్దేశించిన చెరువుల్లో రెండోదైన వీరప్పనాయని చెరువుకు రెండ్రోజులుగా కృష్ణా జలాలు రావడం, నిండటం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతనెల 30వ తేదీన కుప్పం పురపాలక సంఘం పరసముద్రం చెరువు వద్ద హంద్రీ-నీవా కాలువలో కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చి, ఇక్కడే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఆయనలా అమరావతి బయల్దేరగానే విపక్ష వర్గాలు కాలువ ఎండిపోయిందంటూ అసత్య ప్రచారానికి తెరలేపాయి. వి.కోట సమీపంలో తాత్కాలిక సాంకేతిక పరమైన సమస్యతో ఆగిన పంపింగ్‌, అప్పటికప్పుడే తిరిగి ప్రారంభమై కృష్ణా జలాలు హంద్రీ-నీవా కాలువలో రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లె మండలాల మీదుగా ఆఖరి మజిలీ అయిన పరసముద్రం చెరువులోకి దుమికాయి. ఈ చెరువు పూర్తిగా నిండి, ఈనెల 4న మొరవ కూడా పారింది. ఈ మొరవ ద్వారా పారుతున్న నీళ్లు, సప్లయ్‌ చానల్‌లో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ప్రయాణించి కుప్పం పురపాలక సంఘం టూరిజం హోటల్‌ను ఆనుకుని ఉన్న వీరప్పనాయని చెరువుకు చేరుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి సగానికిపైగా చెరువు నిండింది. ఇదే వేగంతో కృష్ణా జలాలు ప్రవహిస్తే మరో రెండు, మూడ్రోజుల్లో ఈ చెరువు పూర్తిగా నిండి, మొరవ పారి దిగువనున్న కుప్పం మండలం పెద్దబంగారునత్తం చెరువులోకి కృష్ణా జలాలు చేరే అవకాశం ఉంది. ఇలా.. దిగువున నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధిలోని చెరువులను నింపేదాకా ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నమాట.

పటిష్ఠమవుతున్న చెరువు కట్టలు

దాదాపు ముప్పయ్యేళ్లుగా కుప్పం నియోజకవర్గంలో కరువు విలయతాండవం చేస్తోంది. భారీ వర్షాలొస్తే తప్ప మిగిలిన రోజుల్లో నియోజకవర్గంలోని చెరువులు దాదాపు ఖాళీగానే ఉంటాయి. అందువల్ల ప్రభుత్వం కూడా చెరువుల పటిష్ఠత కోసం, కట్టల బలోపేతం కోసం తీసుకున్న చర్యలు అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చాయి. ప్రస్తుతం కృష్ణా జలాలు తరలివస్తుండడంతో చెరువు కట్టలను పటిష్ఠం చేసే పనులు సూక్ష్మ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. తొలుత పరసముద్రం చెరువు విషయంలో ఈ పనులు శరవేగంగా సాగాయి. ఇప్పుడిప్పుడే నిండుతున్న వీరప్పనాయని చెరువు కట్టను బలోపేతం చేసే పనులూ చురుగ్గా సాగుతున్నాయి. గతంలో ఈ చెరువు కట్టమీదుగానే పలమనేరు-కృష్ణగిరి బైపాస్‌ రోడ్డు సాగేది. పక్కనే ఫ్లైవోవర్‌ నిర్మించడంతో ఈ మార్గం మూసుకుపోయి, కోళ్ల వ్యర్థాలతోపాటు నానారకాల చెత్తాచెదారాలను వదిలించుకునే అనధికారిక డంపింగ్‌ యార్డుగా మారిపోయింది. ఇప్పుడు ఈ వ్యర్థాలను తొలగించడంతోపాటు చెరువు కట్టను చదును చేసే పనులు జరుగుతున్నాయి. ఇదేరీతిలో నియోజకవర్గంలోని అన్ని చెరువుల పటిష్ఠతకు చర్యలు తీసుకోవడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

Updated Date - Sep 08 , 2025 | 01:09 AM