Share News

కుప్పం ప్రజలకు రుణపడి ఉంటా!

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:47 AM

చంద్రబాబు నాయకత్వం మీద మీకున్న గురి ఎప్పుడూ నన్ను అబ్బురపరుస్తుంది.

కుప్పం ప్రజలకు రుణపడి ఉంటా!
ఆర్టీసీ బస్సులో టికెట్టు తీసుకుంటున్న భువనేశ్వరి - తుమ్మిశి చెరువు వద్ద జలహారతి

కుప్పం/శాంతిపురం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబు నాయకత్వం మీద మీకున్న గురి ఎప్పుడూ నన్ను అబ్బురపరుస్తుంది. 8 సార్లు ఆయనను మీరు ఇక్కడినుంచి గెలిపించారు.ఇందుకు జీవితాంతం కుప్పం ప్రజలకు రుణపడి ఉంటా’ ......ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ ప్రజలనుద్దేశించి అన్న మాటలివి. కుప్పం నియోజకవర్గ పర్యటనలో మూడవ రోజైన శుక్రవారం ఆమె శాంతిపురం, రామకుప్పం మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా శాంతిపురం మండలం నడింపల్లెలో మహిళలతో జరిగిన ముఖాముఖిలో భువనేశ్వరి సంభాషిస్తూ చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ పథకాలు అందరికీ అందాయా అంటూ ఆరా తీశారు.హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను కుప్పం తీసుకురావడంతో కరువు సమస్య శాశ్వతంగా పరిష్కారమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడంవల్లే తాను ఆయన బదులుగా తరచూ కుప్పం వచ్చి ఇక్కడి ప్రజల సాదకబాధకాలు తెలుసుకుంటున్నానన్నారు. ఎటువంటి సమస్యనైనా చంద్రబాబుతో చెప్పి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు ద్వారా కూడా మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే ఎన్నో రకాల వృత్తులు, పనుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నామని, ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అలీప్‌ సంస్థను తీసుకు వచ్చారన్నారు. మహిళలందరూ ఈ ప్రాజెక్టులో చేరి వారిచ్చే శిక్షణలో పాల్గొని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌలభ్యాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో పైకి ఎదగడానికి వినియోగించుకోవాలని సూచించారు.కాగా శాంతిపురం మండలంలో తుమ్మిశి పెద్ద చెరువు, రామకుప్పం మండలం విజలాపురం చెరువుల వద్ద కృష్ణా జలాలకు భువనేశ్వరి హారతి ఇచ్చారు. అంతకుముందు శాంతిపురం మండలం కడపల్లెనుంచి తుమ్మిశి పెద్ద చెరువు దాకా ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించి స్త్రీ శక్తి పథకం ద్వారా వారు పొందిన లబ్ధిని గురించి వారినే అడిగి తెలుసుకున్నారు. శాంతిపురం నుంచి కనమనపల్లె దాకా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్‌ డాక్టర్‌ సురేశ్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 12:47 AM