Share News

31లోపు కుప్పానికి కృష్ణా జలాలు

ABN , Publish Date - Aug 05 , 2025 | 02:31 AM

ఈనెల 31వ తేదీ లోపు కుప్పానికి కృష్ణా జలాలు వస్తాయని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ చెప్పారు.రామకుప్పం సింగిల్‌విండో చైర్మన్‌గా మహ్మద్‌రఫీ, డైరెక్టర్లుగా సురేష్‌, ఆంజప్ప సోమవారం ప్రమాణస్వీకారం చేశారు.

31లోపు కుప్పానికి కృష్ణా జలాలు
రామకుప్పం సింగిల్‌ విండో త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో మాట్లాడుతున్న కంచర్ల శ్రీకాంత్‌

ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌

రామకుప్పం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఈనెల 31వ తేదీ లోపు కుప్పానికి కృష్ణా జలాలు వస్తాయని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ చెప్పారు.రామకుప్పం సింగిల్‌విండో చైర్మన్‌గా మహ్మద్‌రఫీ, డైరెక్టర్లుగా సురేష్‌, ఆంజప్ప సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీకాంత్‌ మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందే సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో హంద్రీ-నీవా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు 87శాతం మేర పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన 13శాతం పనులు కూడా అప్పుడే పూర్తయ్యేవని, వైసీపీ నేతలు కుటిలబుద్ధితో కొంతమంది రైతులతో కోర్టులో కేసులు వేయించడం వల్ల జాప్యం జరిగిందన్నారు. అధికారంలో ఐదేళ్ళు కొనసాగిన వైసీపీ నేతలు కక్షపూరిత వైఖరితో మిగిలిన 13శాతం హంద్రీ-నీవా కుప్పం కెనాల్‌ పనులు పూర్తి చేయలేదన్నారు.తీరా ఎన్నికలకు ముందు సీఎం జగన్‌ ఎన్నికల్లో లబ్ధి కోసం ట్యాంకర్ల ద్వారా హంద్రీ-నీవా కాలువలో నీరు పారించి, బటన్‌ నొక్కి అభాసు పాలయ్యారన్నారు.గత ఏడాది చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే హంద్రీ-నీవా కుప్పం కెనాల్‌ పనులు వేగవంతమయ్యేలా అధికారులను పరుగులు తీయించారన్నారు. కొద్ది రోజుల్లోనే ఆ పనులు పూర్తయి, ఈనెల 31లోపు కుప్పానికి జలాలు వస్తాయన్నారు.చంద్రబాబు నేతృత్వంలో కుప్పం నియోజకవర్గం రానున్న నాలుగేళ్ళలో ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. రైతులు, ప్రజల సౌకర్యం కోసం విమానాశ్రయం ఏర్పాటవుతోందన్నారు. విమానాశ్రయం కోసం భూములిచ్చి సహకరిస్తున్న రైతుల పట్ల టీడీపీ ఎంతో కృతజ్ఞతతో వ్యవహరిస్తోందన్నారు. 2018లో భూములిచ్చిన రైతులకు ఇటీవల వడ్డీతో సహా నష్టపరిహారం చెల్లించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విమానాశ్రయంతో బాటు 500 ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ రెండు పనులు ప్తూరయితే ఈ ప్రాంత ప్రజలు అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తారన్నారు. అభివృద్ధి విషయంలో కుప్పం ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ మునిరత్నం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సురే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 02:31 AM