నేడు పుంగనూరుకు కృష్ణాజలాలు
ABN , Publish Date - Aug 22 , 2025 | 02:59 AM
చిత్తూరు జిల్లా పడమటి ప్రాంత రైతులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న కృష్ణాజలాలు శుక్రవారం నుంచి పరవళ్లు తొక్కనున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన హంద్రీనీవా ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరుగులు తీశాయి.
మదనపల్లెలో హారతిచ్చి స్వాగతం పలికిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా
పుంగనూరు, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పడమటి ప్రాంత రైతులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న కృష్ణాజలాలు శుక్రవారం నుంచి పరవళ్లు తొక్కనున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన హంద్రీనీవా ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరుగులు తీశాయి.సీఎం, జలవనరుల శాఖమంత్రి పనులను పర్యవేక్షించడంతో అధికారులు పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేశారు. రూ.530 కోట్లతో 265 కిలోమీటర్ల కాల్వ విస్తరణ, అభివృద్ధి పనులు చేసినట్లు హంద్రీనీవా ప్రాజెక్టు ఎస్‌ఈ విఠల్‌ప్రసాద్ వివరించారు.కాల్వల హెచ్చుతగ్గులను సమం చేయడం, సిమెంట్ లైనింగ్, బెడ్ వర్క్, లిఫ్ట్ పనులు, కాల్వ విస్తరణ పనులు చేపట్టామన్నారు. కాల్వ గట్టుపై వాహనం వెళ్లేలా దారి ఏర్పాటు చేశామన్నారు. నంద్యాల జిల్లా మాల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద కృష్ణా జలాలను గత నెల 17వ తేదిన సీఎం చంద్రబాబు హంద్రీనీవా కాల్వలకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ నీళ్లు ఇటీవల అనంతపురం జిల్లా చెర్లోపల్లె రిజర్వాయర్‌కు,అక్కడినుంచి గురువారం మదనపల్లె మండలం చిప్పిలి వద్దకు చేరుకున్నాయి.ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు.మదనపల్లె పట్టణ ప్రజలకు తాగునీరు అందించే రెండు సమ్మర్ స్టోరేజి ట్యాంకుల మొరవల నిర్మాణానికి రూ.14కోట్లతో ప్రతిపాదనలు పంపారని, నిధులు మంజూరు కాగానే దాహార్తి తీరుస్తామన్నారు. కాగా రాత్రి 9-30 గంటలకు మదనపల్లె నవోదయ పాఠశాల వద్దకు కృష్ణాజలాలు చేరాయి. శుక్రవారం ఉదయం పుంగనూరు మండలం ఈడిగపల్లె, నేతిగుట్లపల్లెకు చేరుకుంటాయని ఎస్‌ఈ విఠల్‌ప్రసాద్ తెలిపారు. చెర్లోపల్లె రిజర్వాయర్ నుంచి 300 క్యూసెక్కులు నీరు విడుదల కాగా కాల్వల్లో 250 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నాయన్నారు.350 క్యూసెక్కుల సామర్థ్యం వున్న హంద్రీనీవా కాలువలో గంటకు రెండు కిలోమీటర్ల వేగంతో నీరు ప్రవహిస్తోందన్నారు. ఈనెల 26వ తేదీలోపు కుప్పం సమీపంలోని పరమసముద్రం చెరువుకు నీరు చేరుకుంటాయన్నారు.పుంగనూరు నియోజకవర్గంలోకి హంద్రీనీవా కాల్వల ద్వారా కృష్ణాజలాలు ప్రవేశించడం సంతోషకరమని టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.ఎన్నికల హామీని చంద్రబాబు నెరవేర్చడంతో ప్రజలకు ఇక తాగు, సాగునీటి కష్టాలు తీరినట్టేనన్నారు.