కృష్ణాజలాల పరవళ్లు
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:59 PM
జిల్లాకు చేరుతున్న కృష్ణా జలాలతో తాగు,సాగు నీటి కష్టాలు తీరనున్నాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.
పుంగనూరు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు చేరుతున్న కృష్ణా జలాలతో తాగు,సాగు నీటి కష్టాలు తీరనున్నాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.పుంగనూరు సమీపంలోని ప్రసన్నయ్యగారిపల్లె వద్ద టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డితో కలిసి హంద్రీనీవా కాల్వలో కృష్ణా జలాలకు పూజలు చేసి హారతి ఇచ్చారు.సీఎం చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు మీదుగా కుప్పానికి కృష్ణాజలాలు తీసుకొస్తున్నారని చెప్పారు. వైసీపీ నేతలు ఉనికి కోసం సూపర్‌సిక్స్ అమలు చేయలేదని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, నిజానికి అంతకు మూడింతల అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. పుంగనూరు టీడీపీ మాజీ ఇన్‌చార్జి వెంకటరమణరాజు,హంద్రీనీవా ప్రాజెక్టు ఎస్‌ఈ విఠల్‌ప్రసాద్, ఈఈ నీలకంఠారెడ్డి, డీఈ రాయల్‌బాబు రాజేంద్రప్రసాద్, రవికుమార్, టీడీపీ నాయకులు శమీపతి, శ్రీకాంత్, సీవీరెడ్డి, గువ్వల రమేశ్‌రెడ్డి, దినేశ్, వెంకటమునియాదవ్, పోలీ్‌సగిరి, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవాహం
హంద్రీనీవా కాలువ ద్వారా పరవళ్లు తొక్కుతూ కృష్ణాజలాలు శుక్రవారం పుంగనూరు మండలం నుంచి పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలంలోకి పారాయి. ఉదయం 7గంటల ప్రాంతంలో పుంగనూరు మండలంలోని ఈడిగపల్లె , చిలకవారిపల్లె మీదుగా నేతిగుట్లపల్లె లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్‌కు కృష్ణాజలాలు చేరాయి. హెచ్‌ఎన్‌ఎ్‌సఎస్ ఎస్‌ఈ విఠల్‌కుమార్ ఆదేశాలతో లిప్ట్ ద్వారా నాలుగుపైపులకు గానూ రెండుపైపుల్లో నీటిని విడుదల చేశారు. శుక్రవారం పుంగనూరులో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పర్యటన ఉండడంతో జలహారతి ఇప్పించారు. పుంగనూరు మండలం ప్రసన్నయ్యగారిపల్లె, మార్లపల్లె, మాదనపల్లె మీదుగా నీరు పరవళ్లు తొక్కుతూ పెద్దపంజాణి మండలంలోకి ప్రవేశించాయి.కాగా ఉదయం నుంచి హంద్రీనీవా కాల్వల ప్రాంతానికి ప్రజలు వెళ్లి కృష్ణాజలాలకు పూజలు చేశారు.తాగు,సాగు నీటి కష్టాలు తీర్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు.