చవితి వేడుకలకు కాణిపాకం సిద్ధం
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:34 AM
స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం చవితి వేడుకలకు సిద్ధమైంది.ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి.గురువారం ఉదయం ధ్వజారోహణం జరుగుతుంది. రాత్రి హంస వాహన సేవతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. 21 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
ఐరాల(కాణిపాకం), ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం చవితి వేడుకలకు సిద్ధమైంది.ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి.గురువారం ఉదయం ధ్వజారోహణం జరుగుతుంది. రాత్రి హంస వాహన సేవతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. 21 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. లడ్డూ ప్రసాదాలను భక్తులు కొనుగోలు చేయడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.ఆలయానికి విచ్చేసే ప్రతి భక్తుడికీ స్వామి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.ఇందుకు అవసరమైన క్యూలైన్లను బస్టాండ్ నుంచి ఆలయం దాకా ఏర్పాటు చేశారు. వేకువజాము 3గంటలనుంచే భక్తులకు స్వామి దర్శనం కల్పింనున్నారు. అలాగే భక్తులందరికీ అన్నప్రసాదాల వితరణకు,లడ్డు ప్రసాదం, వడలు అందేలా అవసరమైన ఏర్పాట్లు చేశారు. లడ్డూ ప్రసాదాలను భక్తులు కొనుగోలు చేయడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలైన వరదరాజస్వామి, మణికంఠేశ్వర స్వామి ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. వీటితో పాటు ఈవో కార్యాలయం, గణేష్ సదన్, వినాయక సదన్, అన్నదాన కేంద్రం, బస్టాండ్ సర్కిల్, అగరంపల్లె ఆర్చి వరకు విద్యుత్ దీపాలతో ఆలంకరించారు.ప్రత్యేక రోజుల్లో అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల వాహనాలు నిలపడానికి ప్రత్యేక పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేసినట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు.