కాణిపాక ఆలయ కోనేరు ఈశాన్యంలోకి మార్పు
ABN , Publish Date - Dec 09 , 2025 | 12:08 AM
వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రంలో వేద పాఠశాల ఏర్పాటు చేయాలని ఆలయ బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఐరాల(కాణిపాకం), డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రంలో వేద పాఠశాల ఏర్పాటు చేయాలని ఆలయ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆలయ సమావేశ మందిరంలో సోమవారం ధర్మకర్తల మండలి తొలి సమావేశాన్ని ఈవో పెంచలకిషోర్ అధ్యక్షతన నిర్వహించగా ఎమ్మెల్యే మురళీమోహన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.టీటీడీ అందజేసిన రూ.25 కోట్లతో అతిధి గృహం,రెండు కల్యాణ మండపాల నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి లభించిందని ఛైర్మన్ మణినాయుడు తెలిపారు.వీటి నిర్మాణ,నిర్వహణ బాధ్యతలు పూర్తిగా వరసిద్ధుడి ఆలయానికే అప్పగించారన్నారు. త్వరలో ఆలయం వద్ద మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయనున్నట్లు ఈవో వివరించారు.ఇందులో తొలి అడుగుగా పుష్కరిణిని రూ.2.80 కోట్లతో ఆలయ ఈశాన్యంలోకి మార్పు చేయనున్నట్లు తెలిపారు. పాత లడ్డూ భవనాన్ని కూల్చివేయాలని తీర్మానించారు. ఆలయంలో నిర్వహించే ఆర్జిత,ఉచిత సేవలపై ఉభయదారులతో చర్చించి నిర్ణయాన్ని వచ్చే సమావేశంలో తీసుకోనున్నట్లు ఛైర్మన్ తెలిపారు.ఆలయ ప్రచార రథానికి రూ.13 లక్షల వ్యయంతో మరమ్మత్తు చేసి గతంలోలాగా గ్రామాల్లో తిప్పనున్నట్లు తెలిపారు.అలాగే కార్యాలయంలో పనులు వేగవంతం చేయడానికి కొన్ని కంప్యూటర్లు కొనుగోలు చేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయించిందన్నారు.ఆలయానికి సమీపంలో ఉన్న వినాయక సదన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఎవరైనా దాతలు రూ.10 లక్షలు చెల్లిస్తే వారికి వినాయక సదన్‌లో ఒక గదిని వారి పేరుపై కేటాయిస్తామన్నారు.బోర్డు సభ్యులు ఊట్ల నాగరాజ నాయుడు,చంద్రశేఖర రెడ్డి, డాక్టర్ బీవీ.నరే్‌ష,పరిమి చంద్రకళ, కేఎస్ అనసూయమ్మ, సుధాకర రెడ్డి,సునీత, కొత్తపల్లె శివప్రసాద్, శ్రీపతి సతీష్, పెరుమాళ్ల సుబ్బారెడ్డి,చల్లా కృష్ణవేణి,పి.పద్మలత,వసంత,శ్రీవాణి,ఈఈ వెంకటనారాయణ, ఏఈవోలు ప్రసాద్,ధనంజయ, హరిమాధవరెడ్డి, ధనపాల్ తదితరులు పాల్గొన్నారు.