Share News

మళ్లీ తెరపైకి వచ్చిన జనసేన మాజీ ఇన్‌ఛార్జి వినుత డ్రైవర్‌ హత్యోదంతం

ABN , Publish Date - Oct 14 , 2025 | 02:14 AM

సరిగ్గా మూడు నెలల కిందట జూలై 12వ తేది.. తమిళనాడు సెవెన్‌వెల్స్‌ ప్రాంతంలో రాయుడు మృతదేహం వెలుగు చూసింది. కూవం నది నుంచి మృతదేహాన్ని వెలికి తీసిన చెన్నై పోలీసులు శ్రీనివాస్‌ అలియాస్‌ రాయుడిగా గుర్తించి అప్పటి శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబు సహా ముగ్గురు అనుచరులను అరెస్టు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అనూహ్యంగా ఆదివారం రాయుడి సెల్ఫీ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. అందులో అతడి వ్యాఖ్యలు మళ్లీ సర్వత్రా దుమారం రేపాయి. ఈ వీడియో నేపథ్యంలో వినుతతో పాటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ రెడ్డి సోమవారం స్పందించారు.

 మళ్లీ తెరపైకి వచ్చిన జనసేన మాజీ ఇన్‌ఛార్జి వినుత డ్రైవర్‌ హత్యోదంతం

శ్రీకాళహస్తి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): సరిగ్గా మూడు నెలల కిందట జూలై 12వ తేది.. తమిళనాడు సెవెన్‌వెల్స్‌ ప్రాంతంలో రాయుడు మృతదేహం వెలుగు చూసింది. కూవం నది నుంచి మృతదేహాన్ని వెలికి తీసిన చెన్నై పోలీసులు శ్రీనివాస్‌ అలియాస్‌ రాయుడిగా గుర్తించి అప్పటి శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబు సహా ముగ్గురు అనుచరులను అరెస్టు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అనూహ్యంగా ఆదివారం రాయుడి సెల్ఫీ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. అందులో అతడి వ్యాఖ్యలు మళ్లీ సర్వత్రా దుమారం రేపాయి. ఈ వీడియో నేపథ్యంలో వినుతతో పాటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ రెడ్డి సోమవారం స్పందించారు.

వినుత దంపతులను హతం చేసేందుకు పన్నాగం

‘నాపేరు శ్రీనివాసులు అలియాస్‌ రాయుడు. నేను వినుత దగ్గర డ్రైవర్‌గా పనిచేశా. గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన నేత పేట చంద్రశేఖర్‌ ద్వారా టీడీపీ కార్యకర్త సుజిత్‌తో పరిచయం ఏర్పడింది. వినుత దంపతుల కదలికలు, వారి విషయాలను ఎప్పటికపుడు చేరవేస్తే రూ.30లక్షలు ఇస్తామని నన్ను ప్రలోభపెట్టారు. ఆ మేరకు రూ.2లక్షలు కూడా వారి నుంచి అందుకున్నా. ఎన్నికల తర్వాత నాకు రూ.20లక్షలు మాత్రమే ఇచ్చారు. మళ్లీ పలుమార్లు పేట చంద్రశేఖర్‌, సుజిత్‌ నాతో సంప్రందించి వినుత దంపతులను చంపాలని, మరో రూ.30లక్షలు స్థానిక కూటమిలోని బొజ్జల సుధీర్‌రెడ్డి ద్వారా ఇస్తామని చెప్పారు. నేను కారు నడిపే సమయంలో అతివేగంగా వెళుతూ రోడ్డు ప్రమాదం జరిగేలా రెండుసార్లు ప్రయత్నించే సమయంలో వినుత దంపతులు అప్రమత్తమయ్యారు. అప్పట్నుంచి నన్ను డ్రైవింగ్‌కు దూరంగా పెట్టారు. ఎలాగైనా చంపాలని జనసేన నేత కొట్టే సాయి ద్వారా మళ్లీ నన్ను సంప్రదించారు. తిరుపతిలోని హోటల్‌లో కూటమి ముఖ్యనేత వద్దకు తీసుకెళ్లి మాట్లాడించారు. ఆ తర్వాత వ్యక్తిగత వీడియోలు సేకరించి పంపాలని ఒత్తిడి చేశారు. ఒకరోజు నేను వీడియో చిత్రీకరించే సమయంలో నా ఫోన్‌కు మెసేజ్‌ రావడంతో పట్టుబడ్డా. ఈ విషయాన్ని ఆ ముఖ్యనేత, కొట్టేసాయి, చంద్రశేఖర్‌, సుజిత్‌కు ఫోను ద్వారా సందేశం పంపా. వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మళ్లీ నన్ను నేరుగా కలిసిన చంద్రశేఖర్‌, సుజిత్‌ ఎవరి పేర్లు బయట రాకూడదని, అలా వస్తే ఇబ్బందులో పడుతావని హెచ్చరించారు’ అంటూ ఆ వీడియోలో రాయుడి మాటలు సాగాయి.

అతడి చావులో మా ప్రమేయం లేదు

‘రాయుడి చావులో మా ప్రమేయం లేదు. మేమే హత్య చేశామంటూ ప్రచారం చేయడం.. జైలుకు వెళ్లడంకన్నా బాధ కలిగించింది. మాపై రాజకీయ కుట్ర జరిగింది. అన్ని ఆధారాలతో బాధ్యులైన వారి పాత్రలను బహిర్గతం చేస్తాం. విదేశాల్లో రూ.లక్షల జీతాలు వచ్చే ఉద్యోగాలను వదులుకుని ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాం. అంతేకానీ హత్యలు చేయడానికి కాదు. చావులో మా ప్రమేయం లేదు కాబట్టే నాకు 19 రోజులకు, మిగిలిన నలుగురికి నెల రోజుల వ్యవధిలోనే బెయిల్‌ మంజూరైంది. కేసు విచారణలో ఉండటంతో న్యాయనిపుణుల సలహామేరకు మేము అంతకుమించి వివరాలను వెల్లడించ లేం. న్యాయస్థానం ద్వారా నిర్దోషిగా బయటపడతాం’ అంటూ కోట వినుత సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

ఏ విచారణకైనా సిద్ధం

‘చనిపోయిన రాయుడు నాపై ఆరోపణలుచేస్తూ వైరల్‌ అవుతున్న వీడియోపై అఽధికారులు లోతుగా విచారణ జరపాలి. అది ఏఐ టెక్నాలజీ, మార్ఫింగ్‌ తరహాలో ఉంది. ఎక్కడి నుంచి ఈ వీడియో విడుదలైంది అనే దానిపై అధికారులు త్వరలోనే నిగ్గు తేలుస్తారు. మార్ఫింగ్‌ వీడియో అయినా ఉండాలి.. లేకపోతే శ్రీకాళహస్తిలో అభివృద్ధి పనులతో ప్రజల్లో నాకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బురదజల్లేందుకు కుట్ర అయినా చేసుండాలి. ఉద్దేశపూర్వకంగా నాకు సంబంధంలేని విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారు. చంపే ముందు రాయుడిని బలవంతంగా రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేయించి ఉండాలి. 2019 ఎన్నికల్లో 5వేల ఓట్లు కూడా పొందలేక వినుత డిపాజిట్‌ కోల్పోయింది. అలాంటి వారితో రాజకీయంగా నాకు పోటీ ఏముంటుంది? హత్య జరిగిన మూడు నెలల తర్వాత ఇపుడు ఎందుకు వీడియోను బయటపెట్టాల్సి వచ్చింది. కావాలనే నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు’ అంటూ ఢిల్లీలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

Updated Date - Oct 14 , 2025 | 02:14 AM