Share News

జగన్నాటకం

ABN , Publish Date - Jul 10 , 2025 | 02:18 AM

చిత్తూరు ఎస్పీ మణికంఠ ఆధ్వర్యంలో పోలీసులు ముందుగానే జగన్‌ పర్యటనకు ఆంక్షలు విధించినా అమలు చేయడంలో దారుణంగా విఫలమయ్యారు. చెక్‌పోస్టులు పెట్టి ఆపారు గానీ, పొలాల్లోంచి వచ్చేవారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయారు. చెక్‌పోస్టుల వద్ద కూడా దబాయించి మాట్లాడితే వదిలేశారు. మామిడికాయలు రోడ్లమీద పోస్తారని ముందే తెలిసినా అడ్డుకోలేకపోవడం ఆశ్చర్యం. ఇదే జగన్‌ ప్రభుత్వంలో అయితే ఇలాగే వ్యవహరించి ఉండేవారా అని జనం మాట్లాడుకున్నారు. లోకేశ్‌ పాదయాత్ర కుప్పం నుంచి మొదలు పెట్టినపుడూ, చంద్రబాబు పర్యటనల్లోనూ పోలీసులు వ్యవహరించిన తీరు గుర్తు చేసుకుంటున్నారు.

జగన్నాటకం

  • మామిడి రైతుల పరామర్శ పేరుతో డ్రామాలు

చిత్తూరు, జూలై 9 (ఆంధ్రజ్యోతి):

రైతు కష్టాల్లో ఉంటే నాయకుడు ఏం చేయాలి?

కష్టాల్లో ఉన్నపుడే వచ్చి పలకరించాలి. కన్నీరు తుడవాలి. కారణాలు కనుక్కోవాలి. ధైర్యం చెప్పాలి. భరోసా ఇవ్వాలి.

అధికారంలో ఉంటే - రైతును గట్టెక్కించే చర్యలు తీసుకోవాలి.

విపక్షంలోఉంటే- ఏం చేస్తే రైతులకు మేలు జరుగుతుందో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. ప్రభుత్వం కదలకపోతే.. కదిలేదాకా రైతులతో కలిసి పోరాడాలి.

మరి జగన్‌రెడ్డి ఏం చేశారు?

చిత్తూరుజిల్లాలో మామిడిసీజన్‌ ముగిసే వేళకి మండీకి వచ్చారు. రైతుల కష్టాలు వినకుండా తన సహజ ధోరణిలో ఉపన్యాసం ఇచ్చారు.

మందీ బార్బలంతో రెండు గంటలకు పైగా రోడ్డుమీద షో చేసి, అసలు కార్యక్రమంలో అరగంట కూడా ఉండకుండానే హెలికాప్టర్‌ ఎక్కి ఎగిరి వెళ్లిపోయారు.

జగనన్న పర్యటనలో తమ్ముళ్లు రెచ్చిపోయారు. రోడ్లమీదా, మార్కెట్‌ యార్డు వద్దా నానా బీభత్సం సృష్టించారు. జనాన్ని భయభ్రాంతుల్ని చేసి, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ని చుట్టుముట్టి పిడిగుద్దులు కురిపించి అధికారంలో ఉన్నా లేకున్నా.. మేం మారం ఇంతే అని ప్రకటించుకున్నారు.

బంగారుపాళ్యంలో బుధవారం జగన్‌రెడ్డి పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాల పరంపర ఇది...

తెల్లవారి 5.00: హైవే, గ్రామీణ ప్రాంతాల నుంచి బంగారుపాళ్యం వచ్చే దారుల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. ఒరిగిపల్లె, మహాసముద్రం టోల్‌ప్లాజా వద్ద నుంచే తనిఖీలు మొదలు పెట్టారు.

ఉదయం 9.00: వైసీపీ కార్యకర్తలు చెక్‌పోస్టుల గుండా కాకుండా రకరకాల దారుల్లో హెలీప్యాడ్‌ వద్దకు, మార్కెట్‌ యార్డు దగ్గరకు చేరుకున్నారు. రోడ్ల మీద బైకుల్లో దూసుకుపోతూ, రప్పా రప్పా నరుకుతామని అరుస్తూ హంగామా చేశారు.

10:30: వైసీపీ శ్రేణులు బంగారుపాళ్యం మార్కెట్‌యార్డు గేట్లను తోసుకుని లోపలికి వెళ్లారు. పోలీసులు చేతులెత్తేశారు.

11:20: జగన్‌ హెలికాప్టర్‌ వచ్చి వాలింది. అక్కడ 30 మందికి అనుమతిచ్చినా, 500 మంది లోపలికి చొచ్చుకుని వెళ్లిపోయారు. హెలిప్యాడ్‌ ప్రాంగణంలో 3 వేల మంది పోగయ్యారు. పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి అదుపు చేశారు.

11:30: ముందుగా వైసీపీ అనుమతి పొందిన మార్గంలో కాకుండా జగన్‌ కాన్వాయ్‌ దారి మళ్ళుతోందని తెలిసి చరణ్‌ దాబా వద్ద ఎస్పీ మణికంఠ జగన్‌ కాన్వాయ్‌ను అడ్డగించారు. ముందుగా అనుకున్నట్లు హైవే- నలగాంపల్లె ఫ్లైఓవర్‌ మీదుగా యార్డుకు రావాలని సూచించారు. జగన్‌ అంగీకరించలేదు. బంగారుపాళ్యం పట్టణంలో నుంచే వస్తానని జగన్‌ పట్టుపట్టారు. కొంత వాదన జరిగింది. ఎస్పీ ఉన్నా.. కారు ముందుకు పోనివ్వమంటూ జగన్‌ డ్రైవర్‌కు సూచించారు.

12.00: మరింత మంది పోలీసులతో, వాహనాలతో జగన్‌ కాన్వాయ్‌కు అడ్డుగా ఎస్పీ నిల్చున్నారు. దీంతో ముందుగా అనుకున్న రూట్‌ ప్రకారమే హైవే, నలగాంపల్లె ఫ్లైఓవర్‌ మీదుగా కాన్వాయ్‌ ప్రయాణం మొదలైంది.

12:30: జనం లేని రోడ్లపై అనుమతి లేకున్నా రోడ్‌షో చేశారు.

12:45: జగన్‌ రోడ్‌షో ముందుకు రాగానే వైసీపీ మాజీ సర్పంచి ప్రకా్‌షరెడ్డి తన తోటలో దాచి పెట్టుకున్న మామిడి కాయలున్న 5 ట్రాక్టర్‌ లను రోడ్డుమీదకు నడిపించారు. వాటిని రోడ్డుమీద పారబోసుకుంటూ వెళ్లారు. జగన్‌ కాన్వాయ్‌, శ్రేణులు అరుపులు.. కేకలు.. ఈలలతో ఆ కాయల్ని తొక్కుకుంటూ ముందుకు సాగాయి.

1:20: బంగారుపాళ్యం పట్టణం పాలూరు క్రాస్‌ వద్ద కుప్పం వైసీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదం చేశారు. లోపలికి అనుమతించాలని దబాయించడంతో, పోలీసులు కూడా వారిని వదిలేశారు.

1:40: యార్డు గేటు నుంచి మండీలోకి వెళ్లే వరకు రోడ్‌షో చేసుకుంటూ జగన్‌ మార్కెట్‌యార్డులోకి వచ్చారు.

1:50: ముందుగా ఎంపిక చేసిన మండీలోకి వెళ్లి, ముందుగా అనుకున్న రైతులతో కాసేపు మాట్లాడారు.

2:25: మండీ నుంచి హెలిప్యాడ్‌ వద్దకు జగన్‌ బయల్దేరారు.

2:45: హెలికాప్టర్‌ దుమ్ము మిగిల్చి.. బెంగుళూరుకు ఎగిరి వెళ్లిపోయింది.

సీన్‌ 1: హెలికాప్టర్‌ దిగి మార్కెట్‌ యార్డుకు బయలు దేరిన జగన్‌ దారి మళ్లించారు. కారణం హైవే మీద జనం జాడ పెద్దగా లేకపోవడం. బంగారుపాళ్యం పట్టణంలో అయితే ట్రాఫిక్‌ స్తంభించి జనం ఉన్నట్టుగా కనిపిస్తారు. పోలీసు అధికారులు అనుమతించకపోవడంతో అరగంట వాదించారు. ఎస్పీ పై ఆగ్రహం ప్రకటించారు.

సీన్‌ 2:జగన్‌ కాన్వాయ్‌ దగ్గరకు వస్తుండగా వైసీపీ మాజీ సర్పంచి ప్రకా్‌షరెడ్డి తోటలోంచి హఠాత్తుగా ఐదు ట్రాక్టర్లు బయటకు వచ్చాయి. ముందే వాటిని తోతాపురి మామిడి కాయలతో నింపి అక్కడ దాచి ఉంచారు. కాన్వియ్‌కి ముందు రోడ్డంతా కాయలు పోసుకుంటూ ట్రాక్టర్లు వెళ్లాయి. రైతు కష్టంతో పండిన కాయల్ని తొక్కుకుంటూ జగన్‌ కాన్వాయ్‌ ముందుకు దూసుకుపోయింది.

సీన్‌ 3: బంగారుపాళ్యం మార్కెట్‌యార్డులో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పోలీసుల ఆదేశాల్ని ఖాతరు చేయకుండా మూసి ఉన్న ప్రధాన గేటును తోసుకుంటూ యార్డులోకి ప్రవేశించారు. మండీల్లోని మామిడి కాయల్ని తొక్కి ధ్వంసం చేశారు. మార్కెట్‌లో షెడ్లపైకి ఎక్కి హల్‌చల్‌ చేశారు. బంగారుపాళ్యం మార్కెట్‌యార్డులో రైతులు ఎవ్వరూ కనిపించలేదు. మొత్తం వైసీపీ నాయకులు, కార్యకర్తలే తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.

సీన్‌ 4: ముందే ఎంపిక చేసి రిహార్సల్‌ చేసుకున్న మండీలోకి జగన్‌ వెళ్లారు. ఎంపిక చేసుకున్న రైతులతో కాసేపు ముచ్చటించారు. అరగంటకే అక్కడి నుంచి వెనుతిరిగారు.

పోలీసు వైఫల్యం

చిత్తూరు ఎస్పీ మణికంఠ ఆధ్వర్యంలో పోలీసులు ముందుగానే జగన్‌ పర్యటనకు ఆంక్షలు విధించినా అమలు చేయడంలో దారుణంగా విఫలమయ్యారు. చెక్‌పోస్టులు పెట్టి ఆపారు గానీ, పొలాల్లోంచి వచ్చేవారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయారు. చెక్‌పోస్టుల వద్ద కూడా దబాయించి మాట్లాడితే వదిలేశారు. మామిడికాయలు రోడ్లమీద పోస్తారని ముందే తెలిసినా అడ్డుకోలేకపోవడం ఆశ్చర్యం. ఇదే జగన్‌ ప్రభుత్వంలో అయితే ఇలాగే వ్యవహరించి ఉండేవారా అని జనం మాట్లాడుకున్నారు. లోకేశ్‌ పాదయాత్ర కుప్పం నుంచి మొదలు పెట్టినపుడూ, చంద్రబాబు పర్యటనల్లోనూ పోలీసులు వ్యవహరించిన తీరు గుర్తు చేసుకుంటున్నారు.

బతుకుతానని అనుకోలేదు

‘‘ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కార్యక్రమం కవర్‌ చేయడానికి మార్కెట్‌ యార్డులోని 22 వ మండీ వద్దకు వెళ్లాను. ఫోటోలు తీస్తున్నాను. అంతలో అక్కడున్న కొందరు వీడు ఏబీఎన్‌ వాడు అంటూ అరిచారు. అంతే నామీద ఒక గుంపు పడిపోయారు. దాదాపు 15 మంది పైనే ఉంటారు. కెమెరా లాక్కుని పగలకొట్టేందుకు ప్రయత్నించారు. అక్కడే మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, విజయానందరెడ్డి ఉన్నారు. నేను వాళ్లకు తెలుసు. కాపాడుతారని అటు పరుగు తీశాను. అయినా గుంపు నన్ను విడిచిపెట్టలేదు. మరోసారి దాడి చేశారు. ఊపిరి ఆడలేదు. తలమీదా, వీపు మీదా పిడిగుద్దులు కురిపిస్తున్నారు. బట్టలు చింపి చిందరవందర చేశారు. ఇక అయిపోయింది అనుకున్నాను. బతకను అనుకున్నాను. ఎక్కడి లేనీ శక్తి తెచ్చుకుని నెట్టుకుంటూ ఆ మూకలోంచి బయట పడ్డాను. ’’

-- శివకుమార్‌, ఆంధ్రజ్యోతి చిత్తూరు స్టాఫ్‌ ఫోటోగ్రాఫర్‌

ఫోటోలు తీస్తే చంపేస్తారా?

రక్తం రుచిమరిగిన క్రూరమృగం ఎలా ప్రవర్తిస్తుందో వైసీపీ కార్యకర్తలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. వైసీపీ మూకలు దాడి చేస్తుంటే పక్కనే ఉన్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, విజయానందరెడ్డి దగ్గరకు ఆ ఫోటోగ్రాఫర్‌ వెళ్తే.. మనవాడు కాదని సైగ చేసి మానవత్వం లేకుండా వెళ్లిపోతారా? ఇదేమి దుర్మార్గం?

మురళీ మోహన్‌, పూతలపట్టు ఎమ్మెల్యే

Updated Date - Jul 10 , 2025 | 02:18 AM