Share News

ఖాతా ఇచ్చారో ఖతమైనట్టే..!

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:30 AM

అమాయకుల బ్యాంకు అకౌంట్లకు సైబర్‌ వల రూ.కోట్ల మేర క్రైం మనీతో లావాదేవీలు కేసుల్లో చిక్కుకుంటున్న సామాన్యులు తాజాగా చిత్తూరులో బయటపడ్డ వైనం

ఖాతా ఇచ్చారో ఖతమైనట్టే..!

చిత్తూరు, ఆంధ్రజ్యోతి: మారుతున్న కాలానికి అనుగుణంగా మోసగాళ్లూ ఆరితేరుతున్నారు. సైబర్‌ నేరగాళ్లయితే మరో అడుగు ముందుకేస్తున్నారు. అమాయకులకు వల వేసి డబ్బు ఎర చూపుతున్నారు. తమ వ్యూహంలో చిక్కాక వారి పేర్లతో ఉన్న బ్యాంకు అకౌంట్లను తీసుకుంటున్నారు. రూ.కోట్లలో క్రైం మనీ జమ చేస్తున్నారు. విషయం తెలియని సామాన్యులు మాత్రం కేసుల్లో చిక్కుకుంటున్నారు.

1ఎక్స్‌బెట్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో నిధుల మళ్లింపుపై ట్రాక్‌ చేస్తున్న క్రమంలో ఓ యువకుడి బ్యాంకు అకౌంట్‌లో 2024 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు రూ.331 కోట్లు జమైనట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇంతకీ ఎవరా యువకుడు అని ఈడీ అధికారులు ఆరా తీస్తే ఓ మురికివాడలో రెండు గదుల ఇంట్లో నివాసం ఉంటూ.. ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తేలింది. ఈ ఖాతాను మ్యూల్‌ అకౌంట్‌గా వినియోగించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇటువంటి ఘటనే తాజాగా చిత్తూరు నగరం తోటపాళ్యంలోనూ వెలుగుచూసింది.

కూరగాయలమ్మే వ్యక్తికి రూ.12.32కోట్ల నోటీసు

చిత్తూరు తోటపాళ్యానికి చెందిన ఓ వ్యక్తి తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. ఏడాది కిందట ఇతనికి కొంతమంది రూ.10వేలను ఇచ్చి అతడి పేరుతో ఉన్న బ్యాంకు అకౌంట్‌ను, సిమ్‌కార్డును తీసుకున్నారు. 2024 అక్టోబరు నుంచి ఈ ఏడాది జూలై వరకు అకౌంట్‌లో జరిగిన ఆర్థిక లావాదేవీలకు రూ.12.32 కోట్లను చెల్లించాలని తిరుపతి జీఎస్టీ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఇటీవల అతనికి నోటీసులు అందాయి. దీనిపై విచారిస్తే.. బ్యాంకు అకౌంట్‌, సిమ్‌ తీసుకెళ్లినవారు.. ఇతడి పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేసి, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ తీసుకున్నట్లు, తప్పుడు బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని తేలింది.

బ్యాంకు అకౌంట్‌కు నెల అద్దె

బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై అవగాహన లేనివారిని ఎంచుకుని బ్యాంకు అకౌంట్‌ను తమకు ఇచ్చినందుకు ప్రాంతాలను బట్టి నెలకు రూ.20వేల నుంచి రూ.లక్ష వరకు సైబర్‌ నేరగాళ్లు అద్దె కూడా చెల్లిస్తున్నారు. ఆ తర్వాత ఈ అకౌంట్‌కు సైబర్‌ మోసాల ద్వారా వచ్చిన నగదును జమ చేయిస్తున్నారు. ఆ తర్వాత దర్జాగా సైబర్‌ నేరగాళ్లు వేరే ఖాతాలకు బదిలీ చేసి వాడేసుకుంటారు. ఈ మోసాలపై కేసులు పెట్టినప్పుడు సామాన్యులు బలవుతున్నారు.

మ్యూల్‌ అకౌంట్‌ అంటే..?

దొంగతనాలు, మోసాలు చేసి సంపాదించిన సొమ్ము ను (క్రైమ్‌ మనీని) వేరొకరి బ్యాంకు అకౌంట్‌ ద్వారా అధికారిక సొమ్ముగా మార్చేందుకు ప్రయత్నించడాన్నే ‘మనీ మ్యూల్‌’గా వ్యవహరిస్తున్నారు. ఎంతో కొంత నగదు తీసుకుని, తమ బ్యాంకు అకౌంట్‌ను ఇచ్చేవారిని మ్యూల్‌గా పేర్కొంటున్నారు. అలాంటి అకౌంట్లను మ్యూల్‌ అకౌంట్‌ అంటారు.

కఠిన శిక్షలు

ఆర్బీఐ నిబంధనల మేరకు ఓ వ్యక్తి తన అకౌంట్‌ ద్వారా అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిపితే, మనీలాండరింగ్‌ చట్టం-2002, బీఎన్‌ఎ్‌స (ఐసీసీ), ఐటీ చట్టం కింద క్రిమినల్‌ కేసుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నమ్మకద్రోహం నేరం, మోసం, మనీలాండరింగ్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. మూడు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు.

8.50 లక్షల మ్యూల్‌ అకౌంట్లు

2025లో సీబీఐ 8.50 లక్షల మ్యూల్‌ అకౌంట్లను గుర్తించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆపరేషన్‌ చక్ర-వీ కింద సీబీఐ జాతీయ స్థాయిలో ఆపరేషన్‌ ప్రారంభించింది. డిజిటల్‌ అరెస్టులు, నకిలీ ప్రకటనలు, యూపీఐ ఆధారిత మోసం, మ్యూల్‌ అకౌంట్ల నెట్‌వర్క్‌ ఆరోపణల నేపథ్యంలో 42 ప్రాంతాల్లో దాడులు చేశారు. మ్యూల్‌ అకౌంట్లను తెరిచే క్రమంలో కమీషన్‌ కోసం కొంతమంది బ్యాంకు ఉద్యోగులు, ఏజెంట్లు కూడా భాగమయ్యారని గుర్తించారు.

డబ్బుకు ఆశపడితే నిందితులవుతారు

డబ్బు ఆశపడి.. మీ బ్యాంకు అకౌంట్లను ఇతరులకు ఇస్తే మీరు కూడా నిందితులుగా మారుతారు. మీ మీదా కేసులు నమోదు చేస్తాం. నేరగాళ్లు మీ అకౌంట్లను ఇంటర్నేషనల్‌ మోసాలకూ వాడుకుంటున్నారు. కేవైసీ, ఓటీపీ, పాస్‌వర్డ్‌ వంటి వివరాలను దగ్గరి వ్యక్తులు, స్నేహితులతో కూడా పంచుకోవద్దు. డిజిటల్‌ అరెస్టు పేరుతో కాల్స్‌ వచ్చినా, తెలియని ఆన్‌లైన్‌ సైట్లతో ఇన్వెస్ట్‌ చేయమని, లోన్‌ మంజూరైందని కాల్స్‌ వచ్చినా పట్టించుకోకండి. అవన్నీ ఆన్‌లైన్‌ మోసాలే. అవసరమైతే స్థానిక పోలీ్‌సస్టేషనులో ఫిర్యాదు చేయండి.

- తుషార్‌, చిత్తూరు ఎస్పీ

Updated Date - Dec 08 , 2025 | 12:30 AM