వికలాంగ పింఛనుకు ఈయన అర్హుడు కారా?
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:12 AM
రెండు కాళ్లూ లేవు. నడవలేరు. ఆరేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. అయినా, ఆయనకు వికలాంగ పింఛను రాలేదు. ఈ విషయంలో వైసీపీ ఐదేళ్ల వైసీపీ పాలనలో ‘రాజకీయం’ చోటుచేసుకుంది. ఇప్పుడేమో అధికారులు వృద్ధాప్య పింఛనుతో సరిపెట్టారు.
ఆరేళ్లుగా ఎదురు చూపు
రెండు నెలల కిందట వృద్ధాప్య పెన్షన్ మంజూరు
ఏర్పేడు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): రెండు కాళ్లూ లేవు. నడవలేరు. ఆరేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. అయినా, ఆయనకు వికలాంగ పింఛను రాలేదు. ఈ విషయంలో వైసీపీ ఐదేళ్ల వైసీపీ పాలనలో ‘రాజకీయం’ చోటుచేసుకుంది. ఇప్పుడేమో అధికారులు వృద్ధాప్య పింఛనుతో సరిపెట్టారు. ఈయన పేరు నాగరాజు. ఉండేది ఏర్పేడు మండలం రావిళ్లవారికండ్రిగ అరుంధతివాడ. ఆరేళ్ల క్రితం ఇన్ఫెక్షన్ సోకడంతో శస్త్రచికిత్స ద్వారా రెండు కాళ్లను తొలగించారు. అప్పట్నుంచి నెలకు రూ.10వేలు మందులకు ఖర్చవుతోంది. రెండు కాళ్లులేక ఏ పనీ చేయలేదక కుటుంబ సభ్యులపై ఆధారపడ్డారు. అప్పటి నుంచి వికలాంగ పింఛను కోసం కుటుంబ సభ్యుల సహకారంతో అధికారుల చుట్టూ తిరిగారు. టీడీపీ సానుభూతిపరుడని గత వైసీపీ పాలనలో ఆయనకు పింఛను రాకుండా అడ్డుకున్నారని సమాచారం. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ దరఖాస్తు చేశారు. మే నెలలో ఆయనకు వెంకటగిరిలోని సదరం క్యాంపులో వైద్య పరీక్షలు నిర్వహించగా.. రెండు కాళ్లు లేవని 99 శాతం వికలత్వం ఉన్నట్లు అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. అయినా ఆయనకు వికలాంగ పింఛను రాలేదు. కానీ, రెండు నెలల కిందట వృద్ధాప్య పింఛను మంజూరైంది. దీనిపై ఆవేదనతో ఆయన తొలి నెల పింఛను తీసుకోలేదు. కానీ, మందుల ఖర్చు భరించలేని పరిస్థితుల్లో రెండో నెల పింఛను తీసుకున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వికలాంగ పింఛను అందిస్తే.. మందులకు ఊరటగా ఉంటుందని ఆయన అన్నారు.