నిజాయితీకి ఇదా ఫలితం?
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:17 AM
సతీష్ కుమార్ మృతితో టీటీడీ అధికారులు, సిబ్బందిలో ఆందోళన
తిరుమల, నవంబరు15 (ఆంధ్రజ్యోతి): పరకామణిలో చోరీని గుర్తించి ఫిర్యాదు చేసిన మాజీ ఏవీఎస్వో సతీ్‌షకుమార్ విచారణకు హాజరయ్యేందుకు రైల్లో వస్తూ అనుమానస్పదంగా మృతి చెందడంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఆయనది ఆత్మహత్యా, హత్యా అన్నది తేలాల్సి ఉండగా.. అసలు సౌమ్యుడిగా, నిజాయితీపరుడిగా, సేవాగుణమున్న అధికారిగా గుర్తింపున్న సతీ్‌షకుమార్‌కి ఇటువంటి పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. చోరీ కేసులో బాధ్యతగా ఆయన ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత లోక్‌అదాలత్‌లో రాజీ అన్నది ఆయన స్థాయిలో తీసుకోగలిగిన నిర్ణయం కాదని అందరికీ తెలుసు. అప్పటి ముఖ్య అధికారులు ఎందరో ఉండగా సతీ్‌షకుమార్‌ను ఎందుకు గురిపెట్టారో అంతుపట్టడం లేదు. రాజీ చేసుకోమని ఒత్తిడి చేసిన పైవాళ్లు ఎవరో చెప్పమంటూ సీఐడీ విచారణలో ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆయన ఎవరి పేర్లు చెబుతారో అనే ఆందోళనతో అప్పటి నాయకులు, అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఒత్తిడికి గురవడం సహజం. ఇటువంటి ఒత్తిడి ఉంటే టీటీడీ విజిలెన్స్ విభాగంలో విధులు నిర్వహించడం కష్టం అవుతుంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమలలో మోసాలూ, నేరాలూ జరుగుతూనే ఉంటాయి. వీటిని గుర్తించి కేసులు పెట్టేపని విజిలెన్స్ విభాగంది. భక్తుల ఫిర్యాదుల ఆధారంగానూ విచారించి కేసులు పెడుతుంటారు. దర్శనాల దళారీలకు సహజంగానే రాజకీయ నాయకులతో ఎంతో కొంత సంబంధాలుంటాయి. ఇందువల్ల ఎవరిమీద కేసు పెడితే ఏమవుతుందో అనే సంకోచం వీరిలో ఉంటుంది. కేసులు పెడితే ఓ సమస్య, పెట్టకుంటే మరో సమస్య. ఎటు కాలు కదిపినా కత్తిమీద సామే. అయినప్పటికీ స్వామిపై భక్తితో డెప్యుటేషన్‌పై టీటీడీలోకి వచ్చిన అధికారులు ధైర్యం చేసి కేసులు పెడుతుంటారు. ప్రభుత్వాలు మారిన తర్వాత అవే కేసులు వారికి తలనొప్పులు తీసుకురావడం సాధారణమైపోయింది. సతీ్‌షకుమార్ మరణంతో ఇవన్నీ ఇప్పుడు చర్చగా మారాయి. కోట్లాది భక్తుల విశ్వాసాలకు కేంద్రమైన తిరుమలలో జరిగే నేరాలపట్ల తరతమ భేదం లేకుండా వ్యవహరించేలా విజిలెన్స్ విభాగానికి భరోసా ఇస్తే తప్ప ధైర్యంగా ముందడుగు వేయలేరు. అధికారంలో ఉన్నపుడు ఒకలా, దిగిపోయాక మరోలా వ్యవహరిస్తే తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకతప్పదు.