ఇదేనా ‘చాళుక్య’ నీతి?
ABN , Publish Date - Jun 18 , 2025 | 01:39 AM
కార్పొరేషన్ స్థలంపై కూటమి స్కాం అంటూ వైసీపీ దుష్ప్రచారం నేడు కౌన్సిల్ సమావేశంలో చర్చ
తిరుపతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరపాలక సంస్థ బుధవారం నిర్వహించనున్న కౌన్సిల్ సమావేశంలో 84 అంశాలతో అజెండా రూపొందించింది. అందులో ఒకటైన చాళుక్య హోటల్ స్థలం అమ్మకాన్ని తీసకుని, కాకిలెక్కలతో వైసీపీ సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారం మొదలుపెట్టింది. ‘తిరుపతిలో కూటమి స్కాం.. నడిరోడ్డుపై దోపిడీ’ అంటూ ఓ పోస్ట్‌ను వైరల్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థలాన్ని అమ్మనీయబోమని ప్రెస్‌మీట్ పెట్టింది. దీంతో రాజకీయ రగడ మొదలైంది. వైసీపీ కార్పొరేటర్ల ద్వారా నేటి కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించేందుకు సమాయత్తమవుతున్నట్టు తెలిసింది. అంతే దీటుగా కూటమి కార్పొరేటర్లు కూడా సమాధానమిచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పక్కన నగరపాలక సంస్థకు చెందిన ఓ భవనాన్ని 1991 ఏప్రిల్ 1న శివానంద రెడ్డికి లీజు పద్ధతిన 25 ఏళ్ల కాలపరిమితికి అప్పగించారు. ఆ భవనానికి ‘చాళుక్య’ హోటల్‌గా పేరుపెట్టి వ్యాపారం నిర్వహించుకున్నారు. 2016 మార్చి 31న లీజు గడువు ముగియడంతో కార్పొరేషన్ స్వాధీనపరుచుకునే క్రమంలో లీజుదారుడికి పలుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేదు. దీంతో పోలీసుల సమక్షంలో హోటల్‌కు కార్పొరేషన్ సీలు వేసింది. తనకు జీవనాధారమైన హోటల్‌ను తిరిగి ఇప్పించాలని లీజుదారుడు కోర్టును ఆశ్రయించారు. చాలాకాలంపాటు సదరు భవనం వినయోగంలో లేకుండా శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల ఇరువర్గాలు రాజీపడి, కేసు విత్ డ్రా చేసుకోవడంతో సదరు స్థలాన్ని కార్పొరేషన్ సొంతం చేసుకుంది.
మేయర్ ఆమోదంతో అజెండాలో
ఏపీ మున్సిపాలిటీస్ (అక్విజేషన్ అండ్ ట్రాన్సఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ) 1967 నిబంధనలు, 1955 సెక్షన్ 148 మేరకు ప్రభుత్వ అనుమతితో కార్పొరేషన్ ఆస్తులను టెండరు ద్వారా విక్రయించుకోవచ్చు. ఆమేరకే 77 సెంట్లు కలిగిన చాళుక్య హోటల్ స్థలాన్ని నిబంధనలమేరకు బహిరంగ వేలం ద్వారా విక్రయించి వచ్చిన నిధులతో తిరుపతి నగరపాలక సంస్థ పరిపాలన భవన (సిటీ ఆపరేషన్ సెంటర్ బిల్డింగ్) నిర్మాణాన్ని పూర్తిచేయాలని కార్పొరేషన్ యంత్రాంగం భావించింది. ఆ మేరకు వైసీపీకి చెందిన మేయర్ ఆమోదంతో కౌన్సిల్ అనుమతి కోసం అజెండాలో సదరు అంశాన్ని చేర్చింది. అందులో ఎక్కడా కూడా అంకణం ఎంతకు విక్రయిస్తారన్న విషయం లేదు. కానీ వైసీపీ సోషల్ మీడియాలో కాకిలెక్కలు వేసి నడిరోడ్డుపై దోపిడీ అంటూ అబద్దపు ప్రచారం మొదలుపెట్టింది. అంకణం రూ.15లక్షలుంటే రూ.60వేలకు అమ్మేస్తున్నారంటూ ఊదరగొట్టింది.
వైసీపీ అప్పులు, తప్పుల వల్లే అమ్మకానికి..
నగరపాలక సంస్థ పరిపాలన భవనాన్ని సిటీ ఆపరేషన్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణం కోసం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధులతో వైసీపీ హయాంలో రూ.71 కోట్లతో టెండరు పిలిచారు. తమిళనాడుకు చెందిన ఆర్‌ఆర్ తులసి బిల్డర్స్ టెండరు దక్కించుకుంది. 2022 ఆగస్టు 21న అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. ఆ తర్వాత బడ్జెట్ రూ94.50 కోట్లకు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధులకు మ్యాచింగ్ గ్రాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు పైసా కూడా ఇవ్వలేదు. ఇంతలో స్మార్ట్ సిటీ గడువు పూర్తవడంతో కేంద్ర నిధులు నిలిచిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు చొరవ చూపకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ308కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ98కోట్లు కలిపి మొత్తం సుమారు రూ406కోట్లు స్మార్ట్ సిటీకి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. దీంతో తిరుపతిలో స్మార్ట్ సిటీ నిధులతో మొదలైన భారీ ప్రాజెక్టులకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి.
ఆగిన భవన పనులు
సీవోసీ బిల్డింగ్ 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ కాంట్రాక్టర్‌కు ఇప్పటివరకు రూ16.60 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన సుమారు రూ78కోట్లను మున్సిపల్ సాధారణ నిధులనుంచి మంజూరు చేసేందుకు ప్రభుత్వానికి పంపే ప్రతిపాదనను కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటివరకు చేసిన పనులకు కాంట్రాక్టర్‌కు రూ40కోట్లు చెల్లించాలి. బకాయిలిస్తేనే పనులు మొదలుపెడతామని కాంట్రాక్టర్ పేచీ పెట్టారు. దీంతో కార్పొరేషన్ యంత్రాంగానికి ఎటూ పాలుపోక సదరు స్థలాన్ని విక్రయించాలన్న ఆలోచన కలిగింది.
వైసీపీ హయంలో కార్పొరేషన్ బడ్జెట్‌ను జీరో చేయడమేకాకుండా రూ150కోట్లకు పైగా కాంట్రాక్టర్లకు అప్పులు పెట్టారు. తమ ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ80 కోట్ల పాత అప్పులను తీర్చాల్సి వచ్చిందని కూటమి నేతలు మండిపడుతున్నారు.
మెరిడియన్ మాయాజాలం మరిచారా?
కపిలతీర్థం సర్కిల్లో 10వేల చదరపు అడుగుల్లో రూ2 కోట్ల స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మించిన భవనాన్ని కారుచౌకగా కొట్టేసిన వైసీపీ నాయకులకు అందరూ అలాగే కనిపిస్తుంటారని కూటమి వర్గాలు చర్చించుకుంటున్నాయి. మెరిడియన్ హోటల్ పేరిట వెలిసిన భవనానికి ఏడాదికి కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చేది. అలాంటిది నెలకు 1.5లక్షకే అద్దెకు ఇస్తూ వైసీపీ ప్రభుత్వంలో వారి అనుచరులకు కట్టబెట్టేసిన విషయం మరిచారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. చాళుక్య హోటల్ స్థలం విక్రయానికి కౌన్సిల్ ఆమోదం పొందితే నిబంధనల మేరకు బహిరంగ వేలం జరుగుతుందని కార్పొరేషన్ యంత్రాంగం చెబుతోంది.