నేటి పాలకులకు రాజ్యాంగమంటే గౌరవమేదీ?
ABN , Publish Date - May 17 , 2025 | 01:59 AM
రాజ్యాంగమంటే ఏమాత్రం గౌరవంలేని శక్తులే నేడు దేశాన్ని పాలిస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి, ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభల ఆహ్వానసంఘం అధ్యక్షుడు కె.నారాయణ విమర్శించారు.
తిరుపతి(విద్య), మే 16(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగమంటే ఏమాత్రం గౌరవంలేని శక్తులే నేడు దేశాన్ని పాలిస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి, ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభల ఆహ్వానసంఘం అధ్యక్షుడు కె.నారాయణ విమర్శించారు. తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన రెండోరోజు ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభల్లో ఆయన మాట్లాడారు. గవర్నర్ల అధికారాల విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను రాష్ట్రపతి ఖండించిన తీరు చూస్తుంటే రాజ్యాంగానికి ముప్పు పతాకస్థాయికి చేరిందని అర్థమౌతోందన్నారు. ఈ పరిణామాలపట్ల యువత అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ఇచ్చిన విద్య, వైద్యం, ప్రాథమిక హక్కుల పరిరక్షణ, అమలుకు అవిశ్రాంతంగా పోరాడుతున్న సంస్థ ఏఐవైఎఫ్ అని చెప్పారు. మతతత్వానికి వ్యతిరేకంగా లౌకికవాదం, ప్రజాస్వామ్యంకోసం పోరాడుతోందన్నారు. ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని విస్మరించడంపై యువ రైతులు పోరాటాలకు సిద్ధం కావాలని అఖిలభారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య పిలుపునిచ్చారు. ఇటీవల 13 నెలలపాటు జరిగిన చారిత్రాత్మక రైతు ఆందోళనలో పెద్దసంఖ్యలో యువ రైతులు పాల్గొనడంవల్లనే ఆందోళన ఉద్యమ రూపందాల్చి కేంద్రప్రభుత్వ మెడలు వంచిందని గుర్తు చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టుపెట్టి తనకు అనుకూల పెట్టుబడిదారులైన అదానీ, అంబానీల లాభంకోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్‌వైఏ అఖిల భారత ఉపాఽధ్యక్షుడు సుందర్‌రాజన్ విమర్శించారు. సుఖ్‌జిందర్ మహేసరి, వలీ ఉల్లాఖాద్రి, అరుణ్, లెనిన్, ఆర్తి అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన రెండోరోజు సభలో ఏఐవైఎఫ్ జాతీయ నాయకులు జగదీ్‌షకుమార్, ఏఐటీయూసీ జాతీయ కార్యవర్గ సభ్యులు బీవీవీ కొండలరావు,డీవైఎ్‌ఫఐ జాతీయ అధ్యక్షులు రహీం, ఎన్‌ఎ్‌ఫడబ్ల్యు ప్రధాన కార్యదర్శి నిషాసిద్దూ, బీఎంకేయూ జాతీయ అధ్యక్షులు పెరియార్‌స్వామి తదితరులు పాల్గొని ప్రసగించారు. ‘ఎన్నికల సంస్కరణలు, రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్యం’పై హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ప్రసగించారు.