Share News

తులాభారంలో అక్రమాలు నిజమేనా!

ABN , Publish Date - Jul 05 , 2025 | 01:42 AM

గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి ఆలయంలోని తులాభారంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదులపై టీటీడీ విజిలెన్స్‌ అధికారులు విచారణలో నిమగ్నమయ్యారు.

తులాభారంలో అక్రమాలు నిజమేనా!

విచారణలో నిమగ్నమైన టీటీడీ విజిలెన్స్‌

తిరుమల, జూలై 4 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి ఆలయంలోని తులాభారంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదులపై టీటీడీ విజిలెన్స్‌ అధికారులు విచారణలో నిమగ్నమయ్యారు. అక్రమాలు జరిగాయా.. ఏ స్థాయిలో జరిగాయి.. అందులో ఎంతమంది ఉన్నారు.. తులాభారం ఆరోపణల్లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో పాటు టీటీడీ అధికారులు, సిబ్బంది ప్రమేయముందా.. అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ పిల్లల బరువుకు తగినట్టు బియ్యం, బెల్లం, పంచదార, కలకండ, నాణేల వంటి వాటితో తులాభారం వేసి స్వామికి మొక్కులు చెల్లించడమనేది పురాతన సంప్రదాయం. నేటికీ తులాభారం వేసే భక్తుల సంఖ్య అధికంగానే ఉంటోంది. పూర్వం భక్తులే తాము ముడుపు కట్టిన ఈ వస్తువులను మోసుకొచ్చి తులాభారం మొక్కులు చెల్లించేవారు. ఆ తర్వాత భక్తులకు సులభతరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో టీటీడీ.. భక్తులు కోరుకున్న వస్తువులతో తులాభారం వేసి వాటికి సరిపడా నగదు తీసుకుంటోంది. ఈ తులాభారం వ్యవహారాన్ని పగటి వేళ ఒక బ్యాంకు.. రాత్రి మరో బ్యాంకు నిర్వహిస్తోంది. ప్రస్తుతం రోజుకు రూ.10 లక్షల నుంచి 12 లక్షల వరకు నగదు అందుతోంది.

చేతివాటం చూపిన అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది?

‘వైసీపీ ప్రభుత్వంలో భక్తులు ముడుపులు కట్టిన డబ్బునూ వాటాలేసుకున్నారు. తులాభారం ద్వారా వచ్చిన సొమ్ము బ్యాంకుల ద్వారా స్వామి ఖజానాకు వెళ్లాల్సిందిపోయి కొంతమంది చేతులు మారడం దురదృష్టకరం’ అంటూ రెండునెలల కిందట టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ఇప్పుడు విజిలెన్స్‌ అధికారులు విచారణ ప్రారంభించారు. గత ప్రభుత్వంలో తులాభారంలో అక్రమాలకు పాల్పడిన కొందరు అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని తొలగించారే తప్ప కేసులు పెట్టలేదని గుర్తించారు. దీంతో ఆ సమయంలో ఎవరు విధులు నిర్వహించారు? తులాభారం ద్వారా వచ్చిన సొమ్ములు ఎలా బ్యాంకులకు తరలించేవారు? నగదు ఎలా అపహరించి బ్యాంకుల్లో మేనేజ్‌ చేశారు? వీరికి టీటీడీ అధికారులు లేదా సిబ్బంది సహకారం ఏమైనా ఉందా? మొత్తం ఎంత సొమ్ము పక్కదారి పట్టి ఉండొచ్చనే అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తులాభారంలో అక్రమాలకు పాల్పడి విధుల నుంచి తొలగించిన ఓ వ్యక్తికి దాదాపు రూ.10 కోట్ల ఆస్తి ఉండటాన్ని చూసి అధికారులు షాక్‌కు గురవుతున్నట్టు తెలిసింది. కేవలం రూ.14 వేల జీతం కలిగిన ఆ ఉద్యోగి ఇంతస్థాయిలో ఎలా ఆస్తులు కూడబెట్టాడనే అంశంపైనా దర్యాప్తు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా, కొందరు ఉద్యోగులు ఈ విచారణకు సహకరించడం లేదని తెలిసింది. అయినప్పటికీ ఇందులోని అక్రమాలను పూర్తిస్థాయిలో వెలుపలకు తీసేలా విజిలెన్స్‌ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Updated Date - Jul 05 , 2025 | 09:23 AM