Share News

పిల్లల చికిత్స కేంద్రానికి ప్రచారమేదీ?

ABN , Publish Date - Nov 16 , 2025 | 12:20 AM

అత్యాధునిక పరికరాలున్నా పనిలేక ఖాళీగా సిబ్బంది

పిల్లల చికిత్స కేంద్రానికి ప్రచారమేదీ?
చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి అవరణలోని డీఈఐసీ భవనం

చిత్తూరు రూరల్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పిల్లలు ఆరోగ్యంగా పెరగాలనే లక్ష్యంతో జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆధ్వర్యంలో రాష్ర్టీయ బాలల స్వస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎ్‌సకే) కింద చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి అవరణలో సత్వర చికిత్స కేంద్రం(డీఈఐసీ)నడుస్తోంది.18 ఏళ్లలోపు పిల్లల ఆరోగ్య పరిస్థితులను ఈ కేంద్రంలో గుర్తించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారుల్లోని 4డీస్‌(డిఫెక్ట్‌, డీసీజెస్‌, డిఫార్మాటీస్‌, డెవల్‌పమెంట్‌) గమనించి... వాటి ఆధారంగా వైద్య సేవలందించడం ఈ కేంద్రం ప్రత్యేకత.

ఇలా గుర్తిస్తారు

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న వైద్య సిబ్బంది ఇంటింటికీ, అంగన్‌వాడీ కేంద్రాలకు, పాఠశాలలకు వెళ్తారు. జన్యులోపాలు, నూరల్‌ ట్యూబ్‌ లోపం, డౌన్‌ సిండ్రోమ్‌, గ్రహణ మొర్రి, వంకర పాదాలు, గుండె జబ్బులు, నడుము మీద కాయలు, వినికిడిలోపం, కంటి సమస్యలు, దంత సమస్యలు, గాయిటర్‌, ఆటిజమ్‌, అంధత్వం, మానసిక వైకల్యం తదితర సమస్యలతో బాధపడుతున్న పిల్లల్సి గుర్తిస్తారు. వారిని డీఈఐసీ కేంద్రానికి ప్రత్యేక వాహనం ద్వారా పంపుతారు. అక్కడ నిపుణులైన వైద్యులతో పరీక్షలు చేయించి చికిత్స అందిస్తారు. ఆరు నెలలకోసారి సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి... ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నవారిని గుర్తించి తగిన వైద్యసేవలందేలా చూస్తారు.

సిబ్బంది ఇలా....

ఈ కేంద్రంలో మొత్తం 14 మంది సిబ్బంది ఉంటారు. అందులో వైద్యాధికారి, చిన్నపిల్లల వైద్య నిపుణుడు, దంత వైద్య నిపుణుడు, ఫిజియోఽథెరపిస్టు, క్లినికల్‌ సైకాలజిస్ట్‌, ఆడియాలజిస్ట్‌, స్పీచ్‌ థెరపిస్ట్‌, ఆప్టో మెట్రీషియన్‌, ఇద్దరు స్టాఫ్‌నర్సులు, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, సోషల్‌ వర్కర్‌, డేటాఎంట్రీ ఆపరేటర్‌, మేనేజర్‌ ఉంటారు. అయితే 14 మందిలో డేటాఎంట్రీ ఆపరేటర్‌ తిరుపతికి డిప్యుటేషన్‌పై, ఒక స్టాఫ్‌నర్సు మెటర్నిటీ లీవ్‌లో వెళ్లారు మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టు ఖాళీగా ఉంది. ఉన్నవారు సైతం సక్రమంగా రావడం లేదని ఆరోపణలున్నాయి.

అందించే సేవలు ఇవీ.....

జన్యులోపం, గ్రహణ మొర్రి, పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, వినికిడి, దంత సమస్యలు, చర్మ, మూర్ఛ వ్యాధులు, బుద్ధిమాంద్యం, మాటలు నేర్చుకోవడంలో ఆలస్యం తదితర రుగ్మతలకు సంబంధించి 18 ఏళ్లలోపు వారికి జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రంలో సేవలందిస్తారు.

లోపించిన ప్రచారం

జిల్లాలో ఏకైక బాలల సత్వర చికిత్స కేంద్రంపై ప్రచారం లోపించడం ప్రత్యేక అవసరాల పిల్లలకు శాపంగా మారింది. వైద్య నిపుణులు, పరికరాలు అందుబాటులో ఉన్నా... కేంద్రం ఉందనే విషయం చాలామందికి తెలియక వినియోగించుకోవడం లేదు.ఇప్పటికైనా పోగ్రామ్‌ ఆఫీసర్‌ శ్రద్ధ తీసుకుని కేంద్రంపై ప్రచారం నిర్వహించి పిల్లలకు వైద్య సేవలు అందేలా చేయాల్సి వుంది.

Updated Date - Nov 16 , 2025 | 12:20 AM