Share News

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఏఐ టెక్నాలజీ ప్రవేశ పెట్టండి

ABN , Publish Date - Jun 26 , 2025 | 01:30 AM

తిరుమలకంటే ముందుగానే శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ తోట చందును ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి కోరారు.

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఏఐ టెక్నాలజీ ప్రవేశ పెట్టండి
తోట చందుకు ముక్కంటి జ్ఞాపిక అందజేస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి

గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ని కోరిన ఎమ్మెల్యే

రాహుకేతు పూజలు చేయించుకున్న తోట చందు

శ్రీకాళహస్తి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): తిరుమలకంటే ముందుగానే శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ తోట చందును ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి కోరారు. ముక్కంటి క్షేత్రంలో బుధవారం కుటుంబ సమేతంగా తోట చందు ప్రత్యేక రాహుకేతు సర్పదోష నివారణ పూజలను చేయించుకున్నారు. అనంతరం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీరికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్‌, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం చందుతో ఎమ్మెల్యే చర్చించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం త్వరగా అయ్యేలా ఏఐ టెక్నాలజీని వినియోగించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. క్యూలైన్లలోకి వచ్చే భక్తుల వివరాలను ఏఐ కెమెరాలు సేకరిస్తాయని తెలిపారు. సర్వదర్శనం, స్లాటెడ్‌ దర్శనం, ప్రత్యేక దర్శనం చేసుకునే భక్తుల వివరాలను లెక్కిస్తారన్నారు. దీంతో దర్శనానికయ్యే సమయం తెలుస్తుందని గంటకంటే తక్కువ సమయంలో దర్శనం పూర్తవుతుందన్నారు. తిరుమలకంటే ముందుగానే శ్రీకాళహస్తీవ్వరాలయంలో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని చందును కోరారు. దీనివ్ల ఆలయంలో రాహుకేతు సమయంలో రద్దీని నివారించడం, అధిక సంఖ్యలో భక్తులు వస్తే త్వరితగతిన దర్శనం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయకుమార్‌, నాయకులు రావిళ్ల మునిరాజానాయుడు, కాసరం రమేష్‌, తాటిపర్తి రవీంద్రనాథ్‌రెడ్డి, బుజ్జి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 01:30 AM