నేటి నుంచి స్విమ్స్ ఫ్యాకల్టీకి ఇంటర్వ్యూలు
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:25 AM
డెంటిస్ట్రీ పోస్టుకు బ్రేక్ తర్వాత నోటిఫికేషన్‌లో నాన్ మెడికల్ నియామకాలు
తిరుపతి, అక్టోబరు14 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని స్విమ్స్‌లో ఫ్యాకల్టీ నియామక ప్రక్రియకు కసరత్తు పూర్తయింది. బుధవారం నుంచి మూడు రోజులపాటు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల మేరకు డెంటిస్ట్రీ పోస్టుకు ఇంటర్వ్యూలు నిర్వహించడంలేదని స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీ కుమార్ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి చెప్పారు. వైసీపీ నేతకు అనుకూలంగా ‘ఓరల్ మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జరీ’గా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారన్న ఆరోపణలపై ‘నేను చెప్పిన అభ్యర్థికే పోస్టు దక్కాలి’ శీర్షికన గత నెలలో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. అదేవిధంగా స్విమ్స్ వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ చేసిన నాన్ క్లినికల్ అభ్యర్థులను నోటిఫికేషన్‌కు దూరం పెట్టిందని ‘చదువు చెప్పిన చోటే వద్దంటోంది’ శీర్షికన మరో కథనం ప్రచురించింది. ఈనేపథ్యంలో స్విమ్స్, టీటీడీ పెద్దలు పునరాలోచించారు. డెంటిస్ట్రీ పోస్టును పక్కన పెట్టి తక్కిన పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. నోటిఫికేషన్‌లోని 104 పోస్టులకుగాను 315 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించగా సుమారు 208 మందికి కాల్ లెటర్లు పంపారు. రోజుకు 70 మంది చొప్పున మూడు రోజులపాటు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
నిష్పక్షపాతంగా ఇంటర్వ్యూలు
శ్రీపద్మావతి మహిళా మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) గుర్తింపు రద్దుకాకుండా ఉండేందుకు ఫ్యాకల్టీ నియామక ప్రక్రియను వేగవంతం చేశాం. ఫ్యాకల్టీ భర్తీ చేయకపోతే 700 మంది మెడికోల జీవితాలను అయోమయంలో పడతాయి. ఐవీ సుబ్బారావు కమిటీ, స్విమ్స్ కమిటీ, టీటీడీ ఎక్స్‌టెర్నల్ కమిటీ పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. ఎక్స్‌టర్నల్ నిపుణులుగా బర్డ్ డైరెక్టర్, మధురై డైరెక్టర్‌కూడా హాజరుకానున్నారు. నాన్ మెడికల్ అభ్యర్థులకు కూడా ఎలాంటి అన్యాయం జరగదు. తర్వాత నోటిఫికేషన్‌లో వారికి ప్రాధాన్యమిస్తాం.
- ఆర్వీ కుమార్, స్విమ్స్ డైరెక్టర్