బందార్లపల్లెలో చెక్కుచెదరని స్వాతంత్య్ర సిద్ధతా స్తూపం
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:40 AM
రామకుప్పం మండలం బందార్లపల్లెలో 78సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సిద్ధతా స్తూపం ఇప్పటికీ చెక్కుచెదరకుండా దేశ సార్వభౌమత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
రామకుప్పం మండలం బందార్లపల్లెలో 78సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సిద్ధతా స్తూపం ఇప్పటికీ చెక్కుచెదరకుండా దేశ సార్వభౌమత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి బ్రిటీష్ పాలకులు భారతదేశానికి స్వాతంత్య్రం ఇస్తున్నట్లు ప్రకటించారు. బందార్లపల్లెకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ సర్పంచు దొడ్డేగౌడు ఆధ్వర్యంలో అప్పట్లో స్థానికులు స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దొడ్డేగౌడు సొంత ఖర్చులతో గ్రామ ముఖద్వారంలో ఓ స్తూపాన్ని నిర్మించి దానిపై జాతీయ జెండాను ఎగురవేశారు. స్తూపం కింద నల్లరాతిపై జైహింద్, స్వాతంత్య్ర సిద్ధతా భారత మహాదేశము అని, 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి భారతీయులకు స్వాతంత్య్రం అప్పగించి బ్రిటీష్ వారు దేశం వదిలి వెళ్ళిపోయారని చెక్కబడి ఉంది. 78ఏళ్ళుగా ఈ స్తూపం చెక్కుచెదరకుండా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాన్ని గుర్తుకు తెస్తోంది. -రామకుప్పం, ఆంధ్రజ్యోతి