45 రోజుల్లో పరిశ్రమల ప్రతిపాదనలు పూర్తికావాలి
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:49 AM
కలెక్టర్ వెంకటేశ్వర్‌కు సీఎం దిశానిర్దేశం
తిరుపతి(కలెక్టరేట్), డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): అమరావతిలో రెండు రోజుల కలెక్టర్ల సదస్సు బుధవారం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జిల్లా అభివృద్ధి, సంక్షేమం, లోటుపాటు, వివిధశాఖల పనితీరుపై కలెక్టర్ వెంకటేశ్వర్‌తో సమీక్షించారు. ఆ వివరాలిలా..
వైజాగ్ సీఐఐ సమ్మిట్‌లో జిల్లాకు రూ.1.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 67 పరిశ్రమలు, త్రీస్టార్ ప్రాజెక్టులు వచ్చాయి. వీటికి భూకేటాయింపులు, ఇతర మౌలిక వసతుల సహకారం అందించి, 45 రోజుల్లో వాటి ప్రతిపాదనలు పూర్తి చేయాలి
మన ప్రభుత్వంలో అర్బన్‌లో రెండు.. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలిస్తున్నాం. ఇంతకు ముందు ఇచ్చిన కాలనీల్లోకి వెళ్లమంటే రద్దు చేయండి. అక్కడే ఉంటామనే వారి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసివ్వండి. మేమే కట్టుకుంటామంటే ఇళ్ల స్థలమివ్వండి. అక్కడ వద్దంటే ఆ నియోజకవర్గంలో లబ్ధిదారులకు దగ్గరే భూమి దొరికితే కొనండి. లేదంటే అపార్టుమెంటు కట్టిద్దాం. గతంలో తిరుపతిలో చాలావరకు ఇలానే కట్టించాం. ఈ మూడున్నరేళ్లలో ప్రతి పేదవాడికీ ఇల్లు ఉండాలి. ఉగాది నాటికి 5లక్షల గృహప్రవేశాలను లక్ష్యంగా పెట్టుకోండి.
యూరియా కొరత రాకుండా చూడండి. విచ్చలవిడిగా యూరియా వాడటం వల్ల క్యాన్సర్ ప్రొడక్ట్‌ను మనం ప్రోత్సహించినట్లే. దీనిపై రైతులకు అవగాహన కల్పించండి.
ప్రభుత్వ వసతిగృహాల్లో సంక్షేమం, సంకల్పం కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేస్తుండటం అభినందనీయం. తిరుపతి జిల్లాను ఆదర్శంగా తీసుకుని మిగతా కలెక్టర్లూ అమలు చేయాలి.