Share News

రెండు చోట్ల పారిశ్రామిక పార్కులు

ABN , Publish Date - Sep 16 , 2025 | 01:09 AM

పరిశ్రమల సెక్టారులో మంచి స్థానం స్వచ్ఛాంధ్ర, వ్యవసాయ, సర్వీసు కలెక్టర్ల సదస్సులో ర్యాంకుల ప్రకటన

రెండు చోట్ల పారిశ్రామిక పార్కులు
కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతున్న సుమిత్‌ కుమార్‌

చిత్తూరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండు చోట్ల పారిశ్రామిక పార్కుల్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుండడంతో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.అయితే పలు సెక్టార్లలో జిల్లా వెనుకబడినట్లు తేలింది.సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లాలకు ర్యాంకులు ప్రకటించారు.

జీడీపీ లక్ష్యంలో వెనుకబాటు

ఈ ఏడాది జిల్లా జీడీపీ (గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌) లక్ష్యాన్ని రూ.60,013 కోట్లుగా నిర్ణయించారు. తొలి త్రైమాసికంలో 19.43 శాతం అంటే 11,658 కోట్ల లక్ష్యాన్ని, అధిగమించింది. వాస్తవానికి 25 శాతం అధిగమించాల్సి ఉండగా, సుమారు 5.5 శాతం వెనుకబడింది. మిగిలిన మూడు త్రైమాసికాల్లో రూ.48,355 కోట్లతో 80.57 శాతం లక్ష్యాన్ని అధిగమించాల్సి ఉంది. అన్నమయ్య జిల్లా 20.46 శాతంతో మన కంటే ముందుండగా, తిరుపతి జిల్లా 18.55 శాతంతో వెనుకబడింది.

విజయపురం, కుప్పం ప్రాంతాల్లో...

విజయపురం మండలం కోసలనగరం ప్రాంతాన్ని మల్టీ ప్రోడక్ట్‌ సెక్టార్‌గా, కుప్పం ప్రాంతాన్ని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెక్ల్టార్‌గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగానికి పంపించారు. ఈ పార్కులకు పెట్టుబడుల్ని ఆకర్షించగలిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

స్వచ్ఛాంధ్రలో 21వ స్థానం

స్వచ్ఛాంధ్ర విభాగంలో జిల్లాకు 61 స్కోర్‌తో బీ గ్రేడ్‌ దక్కింది. మన జిల్లా 21వ స్థానంలో నిలవగా.. తిరుపతి 60, అన్నమయ్య 59 స్కోరుతో 25, 26 స్థానాల్లో ఉన్నాయి. ఇదే విభాగంలో మండలాలకు కూడా ర్యాంకులిచ్చారు. టాప్‌ 10, బాటమ్‌ 10 మండలాల జాబితాను విడుదల చేయగా..పాలసముద్రం మండలం 54 స్కోర్‌తో కిందినుంచి 4వ స్థానంలో నిలిచింది.

వ్యవసాయ అనుబంధ విభాగాల్లో చివరి స్థానం

వ్యవసాయ అనుబంధ విభాగాల్లో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వరుసగా 24, 25, 26 ర్యాంకులు దక్కాయి. అన్నమయ్య 25, చిత్తూరు 22, తిరుపతి 21 స్కోరుతో సీ గ్రేడ్‌లో ఉన్నాయి.వ్యవసాయ అనుబంధ సెక్టారుకు ఈ ఏడాది రూ.22,050 కోట్ల జీవీఏ లక్ష్యం వుండగా, తొలి త్రైమాసికంలో రూ.3508 కోట్లతో 15.91 శాతం లక్ష్యాన్ని అధిగమించింది. మిగిలిన కాలంలో 84.09 శాతం లక్ష్యాన్ని అధిగమించాల్సి ఉంది. తిరుపతి 12.61ు, అన్నమయ్య 11.07ుతో వెనుకబడి ఉన్నాయి.

పరిశ్రమల్లో పురోగతి

పరిశ్రమల సెక్టారులో 70 స్కోరు, బీ గ్రేడుతో చిత్తూరు జిల్లా 11వ స్థానంలో ఉంది. అన్నమయ్య 80 స్కోరు, ఏ గ్రేడుతో 5వ స్థానంలో.. తిరుపతి జిల్లా 54 స్కోరు, బీ గ్రేడుతో 22వ స్థానంలో ఉంది. ఈ సెక్టారులో రూ.10191 కోట్ల జీవీఏ లక్ష్యం కాగా, తొలి క్వార్టర్‌లో రూ.2861 కోట్లతో 28.08 శాతం అధిగమించింది.

సర్వీసు సెక్టారులో చివరి స్థానం

సర్వీసు సెక్టారులో 74 స్కోరుతో చిత్తూరు జిల్లా 23వ స్థానంలో ఉండగా.. తిరుపతి 82 స్కోరుతో 13వ స్థానంలో, అన్నమయ్య 68 స్కోరుతో 26వ స్థానాల్లో ఉన్నాయి. ఈ సెక్టారు ద్వారా రూ.22854 కోట్ల జీవీఏ లక్ష్యంగా ఉండగా.. తొలి త్రైమాసికంలో రూ.4435 కోట్లతో 19.40 శాతం లక్ష్యాన్ని అధిగమించింది.

పాల ఉత్పత్తితో రూ.11,911 కోట్ల జీవీఏ

2024-25 ఏడాదికిగానూ పాల ఉత్పత్తి ద్వారా రూ.11,911 కోట్ల జీవీఏ (గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌) జిల్లాకు వచ్చింది.గతేడాది కేవలం పాల ఉత్పత్తి రంగం ఒక్కటే రూ.11,911 కోట్లు జిల్లా జీడీపీకి కాంట్రిబ్యూట్‌ చేసింది.

టమోటా విషయంలో అలర్ట్‌గా ఉండాలి

టమోటా పంట విషయంలో చిత్తూరు కలెక్టర్‌తో పాటు పంట అధికంగా ఉన్న అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, నంద్యాల, కర్నూలు, కడప జిల్లాల కలెక్టర్లకు సదస్సులో కొన్ని సూచనలు అందాయి. ‘మార్కెట్లలో ఇబ్బందికర పరిస్థితులుంటే వెంటనే గుర్తించి టమోటా పంటను ఇతర జిల్లాలకు తరలించాలి. మార్కెట్‌కు ఎంత ఉత్పత్తి వచ్చే అవకాశముందో రాబోయే 7-10 రోజుల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా అంచనా వేయాలి. జిల్లాలో ఉన్న ప్రాసెసింగ్‌ యూనిట్లను పూర్తి స్థాయిలో వినియోగించాలి. నాసిరకం పంటను చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రాసెసింగ్‌ యూనిట్లకు తరలించాలి. ఈ క్రాప్‌ నమోదును వంద శాతం పూర్తి చేయాలి’అని సూచించారు. సోమవారం నాటి సదస్సులో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పాల్గొనగా, మంగళవారం కూడా ఈ సదస్సు కొనసాగనుంది. ఎస్పీ తుషార్‌ కూడా హాజరుకానున్నారు.

Updated Date - Sep 16 , 2025 | 01:09 AM