Share News

పారిశ్రామిక పార్కులు వచ్చేస్తున్నాయ్‌..!

ABN , Publish Date - Jun 22 , 2025 | 01:51 AM

జిల్లా పారిశ్రామికరణపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఎంఎ్‌సఎంఈ పార్కులు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు శ్రీకారంచుట్టారు.

పారిశ్రామిక పార్కులు వచ్చేస్తున్నాయ్‌..!
మే ఒకటో తేదీన రాచగున్నేరిలో పరిశ్రమల పార్కుకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

రూ.వంద కోట్లతో ఎంఎ్‌సఎంఈలు

ఆరు ప్రాంతాల్లో 288 ఎకరాల కేటాయింపు

తిరుపతి(కలెక్టరేట్‌), జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): జిల్లా పారిశ్రామికరణపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఎంఎ్‌సఎంఈ పార్కులు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు శ్రీకారంచుట్టారు. తొలి విడతగా ఆరు నియోజకవర్గాల్లో ఏర్పాటుకు సమాయత్తమవుతోంది. చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేటలో 288 ఎకరాలు కేటాయించగా దాదాపు 283 ఎకరాల భూసేకరణ పూర్తయింది. చంద్రగిరిలో 65.29 ఎకరాలు, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని శిరసనంబేడులో 100 ఎకరాలు, వెంటకగిరి నియోజకవర్గంలోని మన్నూరు వద్ద 60 ఎకరాలు, గూడూరు నియోజకవర్గం కొమ్మనెత్తూరు వద్ద 40 ఎకరాలు, సత్యవేడు నియోజకవర్గం చిన్నపాండూరు వద్ద 17.20 ఎకరాలు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రాచగున్నేరి వద్ద మాత్రం 1.4 ఎకరాలు సేకరించారు. తిరుపతి అర్బన్‌ ప్రాంతంలో అనువుగా ఉండే భూమి కోసం ఏపీఐఐసీ అధికారులు పరిశీలిస్తున్నారు. తొలి విడతలో ఒక్క ఎంఎ్‌సఎంఈ పార్కుకు రూ.10కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరిలో 12.72కోట్లతో టెండర్లను కూడా ఆహ్వానించారు.

ఉపాధి కల్పనే లక్ష్యం

ఎంఎ్‌సఎంఈ పార్కుల నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. భూసేకరణ పూర్తి కావస్తోంది. వెనుకబడిన ప్రాంతాల్లో ఎంఎ్‌సఎంఈ పార్కులు నెలకొల్పి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు సదుపాయాలు, రాయితీలు అందిస్తోంది. తిరుపతి నియోజకవర్గంలో స్థలం కోసం పరిశీలన చేస్తున్నాం.

- విజయభరత్‌రెడ్డి ఏపీఐఐసీ జోనల్‌ మేనేజరు

ఎంఎ్‌సఎంఈ పార్కులు ఏర్పాటు చేసే ప్రాంతాలు

నియోజకవర్గం మండలం గ్రామం

--------------------------------------------------------------------------------

చంద్రగిరి చంద్రగిరి చంద్రగిరి

శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి రాచగున్నేరి

సత్యవేడు వరదయ్యపాళెం చిన్నపాండూరు

గూడూరు గూడూరు కొమ్మనెత్తూరు

వెంకటగిరి బాలాయపల్లి మన్నూరు

సూళ్లూరుపేట పెళ్లకూరు సిరసనంబేడు

Updated Date - Jun 22 , 2025 | 01:51 AM