Share News

ఇండిస్ట్రియల్‌ హబ్‌ కేరాఫ్‌ కుప్పం

ABN , Publish Date - Oct 27 , 2025 | 02:18 AM

కుప్పం యువత కలలు పండనున్నాయి. సీఎం చంద్రబాబు సంకల్పంతో జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు ఇక్కడకు తరలి వస్తున్నాయి. ఏకంగా రూ.2,203 కోట్ల పెట్టుబడితో 7 పరిశ్రమలకు ఈనెల 28వ తేదీన సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిశ్రమలతో ఏకంగా 22వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కడా పీడీ వికాస్‌ మర్మత్‌ ఆధ్వర్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.

ఇండిస్ట్రియల్‌ హబ్‌ కేరాఫ్‌ కుప్పం

రూ.2,203 కోట్ల పెట్టుబడితో 7 పరిశ్రమల స్థాపన

రేపు సీఎం చంద్రబాబు వర్చువల్‌ శంకుస్థాపన

22వేల మందికి ఉపాధి అవకాశం

కుప్పం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కుప్పం యువత కలలు పండనున్నాయి. సీఎం చంద్రబాబు సంకల్పంతో జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు ఇక్కడకు తరలి వస్తున్నాయి. ఏకంగా రూ.2,203 కోట్ల పెట్టుబడితో 7 పరిశ్రమలకు ఈనెల 28వ తేదీన సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిశ్రమలతో ఏకంగా 22వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కడా పీడీ వికాస్‌ మర్మత్‌ ఆధ్వర్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.

ఎవరు ఎన్ని చెబుతున్నా కుప్పంలో ఇప్పటివరకు ఉపాధి అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. నిరుద్యోగ యువత ఉపాధిని వెదుక్కుంటూ వలసలు వెళ్తున్నారు. ప్రధానంగా వ్యవసాయాధార జీవనం కుప్పంలో సాగుతోంది. వైసీపీ హయాంలో శీతకన్ను వేసిన హంద్రీ-నీవా కుప్పం బ్రాంచి కాలువ టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు పరుగులు పెట్టాయి. ప్రస్తుతం హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు నియోజకవర్గంలోని నాలుగు మండలాల మీదుగా కుప్పం మండలం పరమసముద్రం చెరువులో కలుస్తున్నాయి. మధ్యలో ఉన్న చెరువులన్నీ ఈ నీటితో కళకళలాడుతున్నాయి. ఇంతకాలం వర్షాధార పంటలకు మాత్రమే పరిమితమైన రైతాంగం ఇప్పుడు వరి సాగుకు మళ్లుకుంది. నియోజకవర్గంలో ఎటుచూసినా పచ్చని పంటలతో భూములు కళకళలాడుతున్నాయి. భూముల ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు ఏకంగా 7 భారీ పరిశ్రమలు వస్తుండటంతో పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా జరుగనుంది.

వ్యవసాయాధారిత పరిశ్రమలే అధికం

కొత్తగా రానున్న ఏడు పరిశ్రమల్లో వ్యవసాయ, పాడి ఆధారిత పరిశ్రమలే అధికంగా ఉన్నాయి. శాంతిపురం మండలం తమ్మిగానిపల్లెలో స్థాపించనున్న మదర్‌ డెయిరీ ఫ్రూట్‌ పల్ప్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, గుడుపల్లె మండలం పొగురుపల్లెలో ఏర్పాటు చేయనున్న శ్రీజ మిల్క్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌, ఇక్కడే స్థాపించనున్న ఎస్వీఎఫ్‌ సోయా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన ఎడిబుల్‌ ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, ఏస్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన ఫుడ్‌ అండ్‌ డెయిరీ ఇంగ్రెడియంట్స్‌ యూనిట్లు వ్యవసాయ, పాడి ఆధారిత పరిశ్రమలే. మదర్‌ డెయిరీ ఫ్రూట్‌పల్ప్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు 41.22 ఎకరాలు, శ్రీజ మిల్క్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన డెయిరీ రిలేటెడ్‌ ప్రొడక్ట్స్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ అనిమిల్‌ ఫీడ్‌ 47.49 ఎకరాలు, ఎస్వీఎఫ్‌ సోయా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 18.68 ఎకరాలు, ఫుడ్‌ అండ్‌ డెయిరీ ఇంగ్రెడియంటడ్స్‌కు 73.63 ఎకరాల భూమిని కేటాయించారు. అలాగే కుప్పం పురపాలక సంఘం పల్లారపల్లె వద్ద ఏర్పాటు కానున్న అలీప్‌ పరిశ్రమకు చెందిన ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ ఉమెన్‌ గ్రీన్‌ అండ్‌ సస్టైనబుల్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ (మహిళా శక్తి భవన్‌)కోసం 18.7 ఎకరాలు, రామకుప్పం మండలం విజలాపురం వద్ద ఏర్పాటు కానున్న ఈ-రాయిస్‌ మోటార్స్‌ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌కు 25 ఎకరాలు, హిండాల్కర్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన ఇంటిగ్రేటెడ్‌ అల్యూమినియం ఎక్స్‌ట్రక్షన్‌ ఫ్యాక్టరీకి 16.3 ఎకరాల కేటాయింపు జరిగింది. ఈ మొత్తం పరిశ్రమల స్థాపన వల్ల ప్రత్యక్షంగా 7,093 మందికి, పరోక్షంగా 15,237 మందికి ఉద్యోగ, ఉపాధి కల్పన సాధ్యమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రేపు సీఎంచే వర్చువల్‌ శంకుస్థాపన

కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు కానున్న పరిశ్రమలకు సీఎం చంద్రబాబు మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 3 నుంచి 4.30 గంటల మధ్యలో జరుగనున్న ఈ కార్యక్రమంలో కుప్పం నుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌.మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్‌ డాక్టర్‌ సురేశ్‌బాబులతోపాటు ఆయా కంపెనీల సీఈవోలు, ఇతర ముఖ్య ప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికార కూటమి పార్టీలకు చెందిన నాయకులు పాల్గొననున్నారు. సాయంత్రం 4.26-4.30 గంటల మఽఽధ్యం ఏడు కంపెనీల సివిల్‌ నిర్మాణాలకు సీఎం అమరావతి నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు.

కంపెనీ యూనిట్‌ పెట్టుబడి ఉపాధి కల్పన

(రూ.కోట్లలో) డైరెక్ట్‌ ఇన్‌డైరెక్ట్‌ -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

1. అలీప్‌ ఫ్లాటెడ్‌- ఫ్యాక్టరీ ఉమెన్‌ గ్రీన్‌ అండ్‌ సస్టైనబుల్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ 26.7 1,000 2,500

2. మదర్‌ డెయిరీ - ఫ్రూట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ 260 850 3,150

3. ఏస్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌- ఫుడ్‌ అండ్‌ డెయిరీ ఇండ్రేడియంట్స్‌ 525 2,000 5,000

4. ఈ-రాయిస్‌ మోటార్స్‌- ఎలక్రిక్‌ వెహికల్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ 200 280 130

5. శ్రీజ మిల్క్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌- డెయిరీ రిలేటెడ్‌ ప్రొడక్ట్స్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ అనిమిల్‌ ఫీడ్‌ 233 850 3,150

6. హిండాల్కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌- ఇంటిగ్రేటెడ్‌ అల్యూమినియం ఎక్స్‌ట్రక్షన్‌ ఫ్యాక్టరీ 586 613 307

7. ఎస్వీఎఫ్‌ సోయా ప్రైవేట్‌ లిమిటెడ్‌- దిన ఎడిబుల్‌ ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ 372.8 1,5000 1000

Updated Date - Oct 27 , 2025 | 02:18 AM