Share News

విద్యార్థులపట్ల వ్యక్తిగతంగా శ్రద్ధ చూపాలి

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:17 AM

వృత్తిపరంగానే ఆలోచించకుండా విద్యార్థులపట్ల వ్యక్తిగతంగానూ ఉపాధ్యాయులు శ్రద్ధ చూపండి. అప్పుడే విద్యార్థులు వారి ఇబ్బందులన్నీ మీకు చెబుతారు

విద్యార్థులపట్ల వ్యక్తిగతంగా శ్రద్ధ చూపాలి
పురస్కార గ్రహీతలతో కలెక్టర్‌, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు

తిరుపతి(విద్య), సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘వృత్తిపరంగానే ఆలోచించకుండా విద్యార్థులపట్ల వ్యక్తిగతంగానూ ఉపాధ్యాయులు శ్రద్ధ చూపండి. అప్పుడే విద్యార్థులు వారి ఇబ్బందులన్నీ మీకు చెబుతారు. వాటి పరిష్కారానికి మీరు తోడ్పడినప్పుడు విద్యార్థులకు చదువుపట్ల ఆసక్తి పెరుగుతుంది. వారి ప్రవర్తన, ఫలితాల్లోనూ పురోగతి కనబడుతుంది’ అని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా శుక్రవారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో జరిగిన గురుపూజోత్సవంలో ఆయన మాట్లాడారు. ఎప్పటికప్పుడు విన్నూతంగా కొత్త బోధనా పద్ధతులు అవలంబించాలన్నారు. ప్రతి తరగతికి ఒక టీచరు ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పాఠశాలలను వర్గీకరించిందని వివరించారు. ఈ వర్గీకరణ ఫలితాలు ఇప్పుడు కనబడవని, ఐదేళ్లలో ఆవిష్కృతమవుతాయని తెలిపారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. అందుకనే ఏడాదిలోనే మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుందన్నారు. సమాజాన్ని జాగృతి చేయడంలో ఉపాధ్యాయులదే కీలక భూమిక అని నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్‌ అన్నారు. ప్రభుత్వ విద్యలో లోటుపాట్లు లేకుండా ఉపాధ్యాయ నియామకాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలను మంత్రి నారా లోకేశ్‌ తీసుకొచ్చారని శాప్‌ చైర్మన్‌ రవినాయుడు వివరించారు. గరువులు చూపిన బాటలో నడిచేవారందరూ ఆయా రంగాల్లో అభివృద్ది చెందుతారని యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరసింహయాదవ్‌ తెలిపారు. సమాజంలో మనలను మంచి పౌరులుగా తీర్చిదిద్దేవారు గురువులేనంటూ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ రుద్రకోటి సదాశివం అన్నారు. విద్యాభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విద్యాశాఖలో విప్లవాత్మక మార్పుల గురించి జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్‌ కుమార్‌ వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా జిల్లాలోని 62 మంది ఉపాధ్యాయులు, ఆరుగురు ఎంఈవోలకు కలిపి మొత్తం 68 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో సమగ్ర శిక్ష అడిషనల్‌ కోఆర్డినేటర్‌ గౌరీశంకర్‌రావు, సమగ్ర శిక్ష సీఎంవో సురేష్‌, గ్రీన్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సుగుణమ్మ, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. గురుపూజోత్సవాన్ని డీఈవో కుమార్‌, ఇతర అధికారులు శ్రమకోర్చి విజయవంతంగా నిర్వహించారని కలెక్టర్‌ అభినందించారు. ఈ సందర్భంగా డీఈవోను సన్మానించారు. తొలుత రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కార్యక్రమం చేపట్టారు.

Updated Date - Sep 06 , 2025 | 12:17 AM