తిరుమలలో నెయ్యి నిల్వల సామర్థ్యం పెంపు
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:11 AM
శ్రీవారి లడ్డూ ప్రసాదంతో పాటు ఇతర నైవేద్య అన్నప్రసాదాల్లో వినియోగించే నెయ్యిని అధిక మొత్తంలో నిల్వ చేసేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 2.24 లక్షల కిలోల నెయ్యిని ఒకేసారి నిల్వ చేసుకునేలా ప్రణాళికలు రూపొందించింది.
తిరుమల, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూ ప్రసాదంతో పాటు ఇతర నైవేద్య అన్నప్రసాదాల్లో వినియోగించే నెయ్యిని అధిక మొత్తంలో నిల్వ చేసేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 2.24 లక్షల కిలోల నెయ్యిని ఒకేసారి నిల్వ చేసుకునేలా ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం టీటీడీ రోజుకు 4 లక్షల నుంచి 4.50 లక్షల వరకు లడ్డూలు, నైవేద్య ప్రసాదాలు వంటి వాటికి 15 వేల నుంచి 17 వేల కేజీల నెయ్యిని వినియోగిస్తోంది. ప్రస్తుతం ఆలయం పక్కనే పుష్కరిణికి అనుకున్న ఉన్న ఘీ స్టోరేజ్ కేంద్రంలో కేవలం నాలుగు ట్యాంకులే ఉన్నాయి. వీటి ద్వారా 80 వేల కేజీలను మాత్రమే నిల్వ చేయగలరు. అంటే నాలుగైదు రోజులకు సరిపడా నెయ్యిని మాత్రమే నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. ఈక్రమంలో నెయ్యి నిల్వలు తగ్గుతున్న సందర్భాల్లో తిరిగి లారీల ద్వారా స్టోర్ చేసుకోవడానికి అధికారులు, సిబ్బంది కంగారుపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి చెక్ పెట్టేదిశగా టీటీడీ నెయ్యి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే నూతనంగా నాలుగు నూతన ట్యాంకర్లను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ నిల్వ సామర్థ్యం 36 వేల కేజీలు. అంటే 1.44 లక్షల కేజీల అదనపు నెయ్యి నిల్వ సామర్థ్యం టీటీడీకి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతమున్న ట్యాంకర్ల నిల్వను కూడా జత చేస్తే దాదాపు 2.24 లక్షల కేజీల నెయ్యిని నిల్వ చేయవచ్చు. వీటి ద్వారా దాదాపు 13 నుంచి 14 రోజులకు సరిపడా నెయ్యిని నిల్వ చేసుకునే వెసులుబాటు టీటీడీకి రానుంది. చెన్నై సూపర్ కింగ్(సీఎ్‌సకే) ఈ ట్యాంకర్ల ఏర్పాటుకు విరాళం ఇవ్వడం గమనార్హం.