పుంజుకున్న ‘రిజిస్ర్టేషన్’ రాబడి
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:18 AM
ప్రభుత్వం స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టడంతోపాటు మంచి ముహూర్తాల రోజులు కలిసి రావడంతో ఎక్కువ మంది రిజిస్ర్టేషన్లకు మొగ్గు చూపారు
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): స్టాంపులు, రిజిస్ర్టేషన్‌శాఖ రాబడి పుంజుకుంది. అక్టోబరు, నవంబరు నెలల్లో వృద్ధిశాతం సైతం పెరిగింది. ప్రభుత్వం స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టడంతోపాటు మంచి ముహూర్తాల రోజులు కలిసి రావడంతో ఎక్కువ మంది రిజిస్ర్టేషన్లకు మొగ్గు చూపారు. మరోవైపు కొత్త ప్రభుత్వంపై నమ్మకం పెరగడంతో స్థిరాస్తి వ్యాపారం క్రమంగా ఊపందుకుంది. భూములు, స్థలాలపై పెట్టుబడులు పెట్టేందుకు ఇటీవల కాలంలో మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ఎనిమిది సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో అక్టోబరు నెల రిజిస్ర్టేషన్ రాబడి లక్ష్యం రూ.13.96 కోట్లు కాగా, లక్ష్యాన్ని మించి రూ.15.89 కోట్లు వచ్చింది. అంటే సరాసరి 113.81శాతం అధికంగా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరింది. చిత్తూరు ఆర్వో తప్ప మిగిలిన ఏడు సబ్ రిజిస్ర్టార్(ఎ్‌సఆర్)లలో వందశాతం రాబడి సాధించింది. ఎస్‌ఆర్‌లవారీగా.. కుప్పంలో లక్ష్యానికి మించి 202.93 శాతం, నగరిలో 159, పలమనేరులో 126, కార్వేటినగరంలో 115, బంగారుపాళ్యంలో 114, పుంగనూరులో 101, చిత్తూరు రూరల్‌లో 109 శాతం అధిక ఆదాయం రాగా, చిత్తూరు ఆర్వోలో 79.68 శాతం మాత్రమే వచ్చింది. నవంబరు నెలలో రాబడి లక్ష్యం రూ. 11.17 కోట్లుగా ప్రభుత్వం నిర్ధేశించగా లక్ష్యానికి మించి రూ.11.28 కోట్లు ఆదాయం సమకూరింది. నవంబరు నెలలో లక్ష్యసాధనలో చిత్తూరు జిల్లా రిజిస్ర్టేషన్‌శాఖ 100.96 శాతం వృద్ధి సాధించింది. ఎస్‌ఆర్‌లవారీగా.. కుప్పంలో 143.25 శాతం, నగరిలో 132.56, చిత్తూరు రూరల్ 117.87, పలమనేరు 115.63 శాతం వృద్ధి సాధించగా.. మిగిలిన ఎస్‌ఆర్‌లలో అంతకంటే తక్కువ రాబడి వచ్చింది. గతంలో పోల్చుకుంటే రాబడి పుంజుకుందని జిల్లా రిజిస్ర్టార్ వెంకటరమణ మూర్తి తెలిపారు.