విద్యుత్ శాఖకు రూ.76లక్షల ఆదాయం
ABN , Publish Date - Jul 05 , 2025 | 02:00 AM
గృహ విద్యుత్ కనెక్షన్ ఉన్నవారు అదనపు లోడు క్రమబద్ధీకరణ చేసుకోవడానికి డెవల్‌పమెంట్ చార్జీలో ప్రభుత్వం 50 శాతం రాయితీని ఇచ్చింది.

- ‘అదనపు లోడు’ క్రమబద్ధీకరణతో వచ్చిందన్న అధికారులు
- సద్వినియోగం చేసుకున్న 3,780 మంది వినియోగదారులు
చిత్తూరు రూరల్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): గృహ విద్యుత్ కనెక్షన్ ఉన్నవారు అదనపు లోడు క్రమబద్ధీకరణ చేసుకోవడానికి డెవల్‌పమెంట్ చార్జీలో ప్రభుత్వం 50 శాతం రాయితీని ఇచ్చింది. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి జూన్ 30వ తేదీవరకు అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని 3,780 మంది వినియోగదారులు సద్వినియోగం చేసుకున్నారు. దీంతో విద్యుత్‌శాఖకు రూ.76,63,650 ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
రాయితీ ఇచ్చిందిలా..
ఉదాహరణకు ఒక కిలోవాట్ లోడుతో కనెక్షన్ తీసుకుంటే సెక్యూరిటీ డిపాజిట్ రూ.200, డెవల్‌పమెంట్ చార్జీ రూ.2వేలు, దరఖాస్తుకు రూ.50 కలిపి రూ.2250 చెల్లించాలి. ప్రభుత్వం డెవల్‌పమెంట్ చార్జీలో రాయితీ ఇవ్వడంతో రూ.2వేలకు బదులు రూ.వెయ్యి మాత్రమే వసూలు చేశారు.
అదనపు లోడ్ క్రమబద్ధీకరణ వివరాలు
-------------------------------------------------------------
డివిజన్ సర్వీసులు వచ్చిన ఆదాయం
చిత్తూరు 2245 44,11,150
చిత్తూరు రూరల్ 551 11,57,400
పుంగనూరు 984 16,95,100
-------------------------------------------------------------
మొత్తం 3780 72,63,650
-------------------------------------------------------------
అదనపు లోడు ఎందుకంటే..
గృహాలకు విద్యుత్ కనెక్షన్ తీసుకునేటప్పుడు గృహోపకరణాల వినియోగాన్ని అంచనా వేసి లోడును కిలోవాట్లలో లెక్కించి సెక్యూరిటీ డిపాజిట్, డెవల్‌పమెంట్ చార్జీలు చెల్లిస్తారు. అధిక శాతం మంది రెండు లేదా మూడు కిలోవాట్లకు అనుమతి తీసుకుంటారు. ఈ లెక్క ప్రకారమే అధికారులు ఆ ప్రాంతంలో ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తారు. తర్వాత గృహ యజమానులు ఏసీ, ఫ్రిజ్, వాషింగ్‌మిషన్, గీజర్లు వంటివి ఏర్పాటు చేసుకున్నా.. అందుకు అనుగుణంగా అదనపు లోడు పడుతుంది. అయితే అందుకు చార్జీలను చెల్లించరు. దీనివల్ల ట్రాన్స్‌ఫార్మర్‌పై లోడు ఎక్కువై తరచూ ట్రిప్ కావడంతోపాటు లోఓల్టేజీ సమస్యలు వస్తున్నాయి.
జరిమానా తప్పదు
లోఓల్టేజీ సమస్య ఉన్న ప్రాంతాల్లోని ఇంటింటినీ విద్యుత్ శాఖ అధికారులు తనిఖీ చేస్తారు. వారు తీసుకున్న లోడు ఆధారంగా గృహోపకరణాలు వినియోగిస్తున్నారా? లేదా? అని పరిశీలిస్తారు. అదనపు లోడు వినియోగిస్తున్నట్లు తేలితే లోడుకు అనుగుణంగా జరిమానా విఽధిస్తారు.