సోమలలో ఎడతెరపిలేని వర్షం
ABN , Publish Date - Oct 12 , 2025 | 01:52 AM
సోమల మండలం పెద్దఉప్పరపల్లె, అన్నెమ్మగారిపల్లె, పేటూరు పంచాయతీల్లో శుక్రవారం రాత్రి ఎడతెరపి లేని వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. పెద్దఉప్పరపల్లె-పలమనేరు మార్గంలోని తాత్కాలిక కల్వర్టు గార్గేయ నది ప్రవాహంతో కొట్టుకుపోయింది.
ఉధృతంగా గార్గేయ నది ప్రవాహం
పెద్దఉప్పరపల్లెలో కొట్టుకుపోయిన కల్వర్టు
పలు గ్రామాలకు స్తంభించిన రాకపోకలు
సోమల, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): సోమల మండలం పెద్దఉప్పరపల్లె, అన్నెమ్మగారిపల్లె, పేటూరు పంచాయతీల్లో శుక్రవారం రాత్రి ఎడతెరపి లేని వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. పెద్దఉప్పరపల్లె-పలమనేరు మార్గంలోని తాత్కాలిక కల్వర్టు గార్గేయ నది ప్రవాహంతో కొట్టుకుపోయింది. దీంతో పేటూరు, బసవపల్లె, పొలికిమాకులపల్లె, ఎర్రగుంతలపల్లె, బోనమంద, చిన్నకమ్మపల్లె, దుర్గంకొండ గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. పలు ప్రాంతాల నుంచి వంకలు గార్గేయ నదిలో కలవడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈక్రమంలోనే పలు గ్రామాల ప్రజలు పెద్దఉప్పరపల్లెకు రాలేకపోతున్నారు. పెద్దఉప్పరపల్లె నుంచి పలమనేరుకు వెళ్లే ఆర్టీసీ సర్వీసును రద్దు చేశారు. అలాగే పెద్దఉప్పరపల్లె నుంచి చౌడేపల్లెకు వెళ్లు మార్గంలో దేవళకుప్పం వద్ద సీతమ్మ చెరువుకు వచ్చే వంక ఉధృతితో బయ్యారెడ్డిపల్లె, మేకలచిన్నేపల్లె, దేవళకుప్పం, చిన్నదేవళకుప్పం గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. పెద్దఉప్పరపల్లె నుంచి రెడ్డివారిపల్లె, దుర్గంకొండ మార్గంలోని గార్గేయనది ఉధృతితో ఈమార్గంలోనూ ప్రయాణాలు స్తంభిచాయి. సోమల-పెద్దఉప్పరపల్లె మార్గంలోని సీతమ్మచెరువు మొరవ వద్ద భారీ నీటి ప్రవాహం వేగం పుంజుకుంది. వర్షం నీటితో నిండిన వేరుశనగ పంట కుళ్లిపోతోంది. బొప్పాయి, టమోటా పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కోతలు చేయలేక మార్కెట్‌కు తరలించడానికి వీలులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.