వదలని వాన
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:36 AM
దిత్వా తుఫాను బలహీనపడినా.. దాని ప్రభావం మాత్రం వీడలేదు. వరుసగా ఐదో రోజూ తీర ప్రాంత, చేరువగా ఉన్న మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. గురువారం తూర్పు మండలాల్లో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దాదాపుగా చెరువులు, కుంటలు నిండాయి.
పొంగుతున్న నదులు, వాగులు
పలు మార్గాల్లో స్తంభించిన రాకపోకలు
వేలాది ఎకరాల్లో మునిగిన వరిపొలాలు
రూ.35 కోట్ల మేర నష్టం
తిరుపతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): దిత్వా తుఫాను బలహీనపడినా.. దాని ప్రభావం మాత్రం వీడలేదు. వరుసగా ఐదో రోజూ తీర ప్రాంత, చేరువగా ఉన్న మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. గురువారం తూర్పు మండలాల్లో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దాదాపుగా చెరువులు, కుంటలు నిండాయి. స్వర్ణముఖి బ్యారేజీ సహా కాళంగి, మల్లిమడుగు రిజర్వాయర్ల నుంచీ నీటిని దిగువకు వదులుతున్నారు. ఆయా మండలాల్లో పరిస్థితులను గురువారం కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు పాశిం సునీల్‌కుమార్, కురుగొండ రామకృష్ణ, విజయశ్రీ తదితరులు పరిశీలించారు.
గూడూరుపై తీవ్ర ప్రభావం
గూడూరులో బుధవారం రాత్రి నుంచీ వర్షం పడింది. పట్టణంలో పంబలేరు వాగు పొంగడంతో కాజ్‌వేపైకి నీరు చేరి వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. వేములపాడు, తిప్పవరప్పాడు వద్ద కాజ్‌వేలపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గూడూరు చవటపాలెం.. నెల్లటూరు.. చెన్నూరు రామలింగయ్య ఎస్టీ కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. చెన్నూరులో చేనేత మగ్గాల గుంతల్లోకి నీరు చేరడంతో 200 మంది కార్మికులు పనులు నిలిపివేశారు. 1700 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది.
ఫ చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం ఇంకా జలదిగ్బంధనంలోనే వుంది. వరగలి క్రాస్ వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో కిలోమీటరు వరకూ వాహనాలు నిలిచిపోయాయి.
ఫ చిట్టమూరు మండలం పుట్టివానిపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆరూరు చెరువు కట్ట ప్రమాదకర స్థితికి చేరింది.
ఫ కోట మండలం నెల్లూరుపల్లి ప్రాథమిక పాఠశాలలోకి, కొత్తపాలెం దళితవాడలో ఇళ్ళలోకి వర్షపు నీరు చేరింది. స్వర్ణముఖి ఉధ్రుత ప్రవాహంతో దైవాలదిబ్బ, పుచ్చలపల్లి, దొరువుకట్ట అల్లంపాడు గ్రామాల వద్ద స్వర్ణముఖి పొర్లుకట్టలు తెగిపోయే స్థితిలో ఉన్నాయి. గోవిందపల్లి వద్ద బకింగ్‌హామ్ కెనాల్ ప్రవాహంతో గోవిందపల్లిపాలెం మత్స్యకారులకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
వాకాడు ఎస్సీ కాలనీ, వెంకటరెడ్డిపాలెం, బూర్లవారిపాలెం, తూపిలిపాలెం ఎస్టీ కాలనీలను వరద చుట్టుముట్టింది. స్వర్ణముఖి బ్యారేజీలోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో 13 గేట్లు తెరిచి నీటిని వదిలారు
వెంకటగిరిలో వాగుల ఉధ్రుతి
వెంకటగిరి మండలంలో కైవల్య నది, గొడ్డేరు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. బంగారుపేటలో చేనేత మగ్గం గుంతల్లో నీరు చేరడంతో పనులు ఆగిపోయాయి.
ఫ డక్కిలి మండలం లింగసముద్రం వాగు ఉధ్రుతంగా ప్రవహిస్తోంది.
ఫ బాలాయపల్లి మండలంలో కైవల్య నది పొంగి రామాపురం బ్రిడ్జిపైకి చేరగా.. నేరేడు కాలువ పొంగడంతో వెంకటగిరి-గూడూరు మెయిన్ రోడ్డులో వెంకటరెడ్డిపల్లి వద్ద.. గొట్టికాడు వద్ద కాజ్‌వేపైనా వరద నీటి ప్రవాహంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
సూళ్లూరుపేటలోనూ అదే స్థితి
పెళ్ళకూరు మండలంలోని చెంబేడు చెరువు కట్ట కుంగి ప్రమాదకర స్థితికి చేరుకుంది. కలవకూరు వద్ద స్వర్ణముఖి డ్యామ్.. నాయుడుపేట వద్ద పండ్లూరు కాజ్‌వేపై వరదనీరు ప్రవహిస్తోంది.
తడ మండలం ఇరకం దీవిలోని పొలాలను పులికాట్ ఉప్పు నీరు ముంచెత్తింది.
నాయుడుపేట మండలం పెరికిలాంపాటి కండ్రిగ ముంపునకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. వెంగమాంబపురం వద్ద మామిడికాలువ ప్రవాహంతో వాహనాల రాకపోకలు ఆగాయి.
దొరవారిసత్రం మండలం వేణుంబాక చెరువు కట్ట కుంగడంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు.
20 మండలాల్లో రికార్డు స్థాయి వర్షపాతం
ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 20 మండలాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. వాకాడు మండలంలో ఏకంగా 52 సెంటీమీటర్లకు పైగా.. మిగిలిన 19 మండలాల్లో 20 నుంచి 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత నెల 30వ తేది ఉదయం 8.30 నుంచి ఈనెల 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లాలో సగటున 215.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఐదు రోజుల వర్షపాతం ఇలా..
మండలం వర్షపాతం (మిల్లీమీటర్లలో)
------------------------------------------
వాకాడు 525.5
చిట్టమూరు 494.8
గూడూరు 446.6
కోట 423.2
చిల్లకూరు 405.8
బాలాయపల్లి 271.8
వెంకటగిరి 213.8
డక్కిలి 210.4
దొరవారిసత్రం 353.4
ఓజిలి 309.6
నాయుడుపేట 289.2
తొట్టంబేడు 274.4
సూళ్ళూరుపేట 270.4
పెళ్ళకూరు 269.4
ఏర్పేడు 244.0
సత్యవేడు 240.2
తడ 234.4
శ్రీకాళహస్తి 224.2
బీఎన్ కండ్రిగ 222.2
వరదయ్యపాలెం 217.0
-------------------------------------
వర్షాల నష్టం రూ.35 కోట్లు
వరుస వర్షాలకు రూ.35 కోట్లకు పైగా నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. 11 మండలాల్లోని 69 గ్రామాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. 1726 మంది కష్టనష్టాలకు లోనయ్యారు. దొరవారిసత్రం, సూళ్ళూరుపేట, వాకాడు, తడ, పెళ్ళకూరు మండలాల్లో 1821 హెక్టార్లలో వరి పంట నీటమునిగింది. అనధికారిక అంచనాల ప్రకారం 12 వేల ఎకరాలకు పైగా వరిపొలాలు దెబ్బతిన్నాయి.
దెబ్బతిన్న 41 ఇళ్ళు
వాకాడు మండలంలో 8 కచ్చా ఇళ్ళు పూర్తిగా కూలాయి. బాలాయపల్లిలో 4, వెంకటగిరిలో 3, చిట్టమూరులో ఒకటి చొప్పున 8 కచ్చా ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కోట మండలంలో 7, ఏర్పేడులో 15, బీఎన్ కండ్రిగ, శ్రీకాళహస్తి, తొట్టంబేడులో ఒక్కోటి చొప్పున 25 పూరి గుడిసెలు పడిపోయాయి. వీటి విలువ రూ.12.2 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. ఒక ఆవు, గొర్రె మృతి చెందాయి.
పాడైన రోడ్లు
జిల్లావ్యాప్తంగా 106 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు పాడయ్యాయి. చిట్టమూరులో ఒక రోడ్డు తెగిపోగా మరొకటి కోతకు గురైంది. వరద నీరు కాజ్‌వేలపై ప్రవహించడంతో మరో 30 రోడ్లు దెబ్బతిన్నాయి. ఆర్ అండ్ బీ రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు రూ. 16.34 కోట్లు, శాశ్వత పనులకు రూ.97 కోట్లు అవసరమని అంచనా వేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 70 రోడ్లు దెబ్బతినగా, మరమ్మతులకు రూ.82.76 లక్షలు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.
విద్యుత్ శాఖకు రూ. 17.43 కోట్లు
గాలులు, వర్షాలకు 33 కేవీ ఫీడర్లు ఏడు, 33-11 కేవీ ఫీడర్లు 62 దెబ్బతిన్నాయి. అలాగే 33-11 కేవీ సబ్ స్టేషన్లు ఏడు, 11 కేవీ స్తంభాలు ఎనిమిది, ఎల్‌టీ స్తంభాలు ఎనిమిది చొప్పున కూలిపోయాయి. దెబ్బతిన్న పరికరాలు, సామగ్రి విలువ రూ. 14.2 లక్షలని.. మొత్తం మీద రూ. 17.43 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.