పంటలపై ఆగని గజదాడులు
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:09 AM
పంటలపై ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి
కల్లూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): పంటలపై ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పులిచెర్ల మండలంలో అయితే రాత్రయితే పొలాల్లోకి చేరుకుంటున్న ఏనుగుల గుంపు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం రాత్రి కూడా తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని బోడబండ నుంచి బయల్దేరిన 16 ఏనుగుల గుంపు దేవళంపేట పంచాయతీ గెండేవారిపల్లె చెరువు వద్దకు చేరుకున్నాయి. చెరువులో మునిగిన ఏనుగుల గుంపు మిట్టమీదరాచపల్లెలోని బసవయ్యకు చెందిన వరి, భాస్కర్‌కు చెందిన టమోటా పంటను ధ్వంసం చేశాయి. పురుషోత్తంరెడ్డికి చెందిన సుమారు వంద కొబ్బరిచెట్లు, వేరుశనగ పంటను నాశనం చేశాయి. మురళికి చెందిన అలసంద పంటను ధ్వంసం చేసి, మామిడిచెట్ల కొమ్మలను విరిచేశాయి. హేమసుందర్‌రెడ్డికి చెందిన మామిడిచెట్ల కొమ్మలను విరిచేసి, పెనుబాలవారిపల్లెలోని నారాయణకు చెందిన కొబ్బరిచెట్లను ధ్వంసం చేశాయి. కురవపల్లెలోని కేశవులు, రాజమ్మకు చెందిన మామిడిచెట్లను ధ్వంసం చేశాక వచ్చిన దారిలోనే అడవిలోకి వెళ్లిపోయాయి. ఏళ్ల కిందటి కొబ్బరి చెట్లు ధ్వంసం చేయడంతో బాధిత రైతులు కంటతడి పెడుతున్నారు. మరోవైపు ఎప్పుడేమి జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపు ఆదివారం పగలంతా అడవిలోని సూరప్పచెరువు వద్ద తిష్ఠ వేసినట్లు ఎఫ్‌బీవో మధు తెలిపారు.
కలెక్టర్ సారూ.. చర్యలు తీసుకోండి
పులిచెర్లలో సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎ్‌సకు హాజరవుతున్న కలెక్టర్ సుమిత్‌కుమార్ మండలంలో కొనసాగుతున్న ఏనుగుల దాడులపై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఏనుగుల దాడులతో ఎక్కువగా నష్టపోతోంది తామేనని, నష్టపరిహారం కూడా తూతూమంత్రంగా అందుతోందని, విచారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.