బీపీఎస్‌పై ఆసక్తి చూపని అక్రమనిర్మాణ యజమానులు
ABN , Publish Date - Dec 20 , 2025 | 02:57 AM
కొన్ని భవన నిర్మాణాలకు అనుమతులు ఉంటాయి. కానీ తీసుకున్న ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలు ఉండవు. నిర్మాణాల్లో పది శాతం అతిక్రమణ జరగడం సాధారణమే. అయితే 50 శాతానికిపైగా ఇష్టారీతిన నిర్మాణాలు చేయడం తిరుపతిలో ఆనవాయితీగా మారింది. అక్రమ నిర్మాణాలను సక్రమం చేసుకునేందుకు బిల్డింగ్ పీనలైజ్జ్ స్కీమ్ (బీపీఎ్‌స)ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కానీ స్పందన అంతంతమాత్రంగానే ఉంది.
(తిరుపతి- ఆంధ్రజ్యోతి)
కొన్ని భవన నిర్మాణాలకు అనుమతులు ఉంటాయి. కానీ తీసుకున్న ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలు ఉండవు. నిర్మాణాల్లో పది శాతం అతిక్రమణ జరగడం సాధారణమే. అయితే 50 శాతానికిపైగా ఇష్టారీతిన నిర్మాణాలు చేయడం తిరుపతిలో ఆనవాయితీగా మారింది. అక్రమ నిర్మాణాలను సక్రమం చేసుకునేందుకు బిల్డింగ్ పీనలైజ్జ్ స్కీమ్ (బీపీఎ్‌స)ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కానీ స్పందన అంతంతమాత్రంగానే ఉంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతల అండతో కొందరు అక్రమ నిర్మాణాల పరంగా చెలరేగిపోయారు. అప్పట్లో అధికారులు అటువైపు చూసే పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా తిరుపతిలో అనధికారికంగా అంతస్తుల మీద అంతస్తులు కట్టేశారు. సాధారణంగా ఎలాంటి నిర్మాణం చేయాలన్నా ముందుగా నిబంధనల మేరకు ప్లాన్ తయారు చేసుకుని పట్టణ ప్రణాళిక విభాగం అనుమతి తీసుకోవాలి. కానీ తిరుపతిలో మాత్రం చాలా వరకు ముందస్తు అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేస్తున్నారు. ఎవరైనా సిబ్బంది వస్తే అధికారాన్ని చూపి భయపెట్టడం, లేదా చేతులు తడిపి పంపించేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అనధికారిక కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికోసం బీపీఎ్‌సను ప్రారంభించింది. గత నెల 12 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 120 రోజు లపాటు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. అయినా, ఆయా భవన యజమానులు స్పందించడం లేదు. తిరుపతిలో ఇప్పటివరకు కేవలం 120 దరఖాస్తులే రావడం గమనార్హం. భారీగా పెనాల్టీలు కట్టాల్సి వస్తుందనే భయంతోనే వారు కదలడం లేదని సమాచారం. అధికారులు కూడా అక్రమ నిర్మాణాలకు కేవలం నోటీసులిచ్చి సరిపెట్టుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. రాజకీయ అండదండలు ఉన్నవారివి, పెద్దమొత్తంలో చేతులు తడిపిన వారిని చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో బీపీఎస్ వస్తుంటుంది.. పోతుంటుంది. తమ భవనాలకేమీ కాదని వారంతా ధీమాతో ఉన్నట్టు కనిపిస్తోంది.
బీపీఎస్ తీసుకోకపోతే కఠిన చర్యలు
బీపీఎస్ చేసుకోవాలని మేళాలతో అవగాహన కల్పించాం. దరఖాస్తు చేసుకోని యజమానులకు నోటీసులిచ్చాం. గడువులోగా బీపీఎ్‌సకు దరఖాస్తు చేసుకోకపోతే భవనాన్ని సీజ్ చేస్తాం. అవసరమైతే నిర్మాణాన్ని కూల్చివేసే చర్యలు తీసుకుంటాం. ఇంటి పన్ను వందశాతం జరిమానా వేయాల్సి ఉంటుంది. బ్యాంకు రుణాలు, క్రయ విక్రయాలకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఏపీఎంసీ చట్టం 1955 ప్రకారం కోర్టులో కేసులు వేస్తాం. వీటన్నింటినుంచి తప్పించుకోవాలంటే బీపీఎస్ సౌకర్యాన్ని వినియోగించుకోండి.
- మహబూబ్ ఖాన్, డీసీపీ, టౌన్‌ప్లానింగ్, తిరుపతి నగరపాలక సంస్థ
ఇదీ లెక్క
తిరుపతిలోని టౌన్‌ప్లానింగ్ సెక్రటరీలు గుర్తించిన మేరకు ఇప్పటివరకు 1500 అక్రమ నిర్మాణాలకు బీపీఎస్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. వీటిలో ప్రస్తుతం 640 నిర్మాణాలను గుర్తించారు. ఆయా నిర్మాణాలకు బీపీఎస్ పెయింట్ వేశారు. ఇక, కనీస అనుమతులు లేకుండా, ప్లాన్‌కు విరుద్ధంగా కట్టినవి వెయ్యికిపైగానే ఉన్నట్టు తెలుస్తోంది.