Share News

పంట పోతే పోయింది!

ABN , Publish Date - Dec 15 , 2025 | 01:44 AM

‘ఎలాగూ నష్టపోయారు. పోయిన పంట తిరిగి రాదు. కాస్తో కూస్తో ఇస్తాం. సర్దుకోండి. కంపెనీ వాళ్లతో మాట్లాడి డబ్బులిస్తాం’ అంటూ నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు ఎర వేస్తున్నారు.

పంట పోతే పోయింది!
లైసెన్సు రద్దు చేసినా అమ్మకాలు కొనసాగిస్తున్న పూజిత ఆగ్రో సర్వీసు సెంటర్‌

కాస్తో కూస్తో ఇస్తాం.. సర్దుకోండి

నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు ఎర

రేపటి కమిటీ సమావేశానికి రాకుండా చర్యలు

సూళ్లూరుపేట, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘ఎలాగూ నష్టపోయారు. పోయిన పంట తిరిగి రాదు. కాస్తో కూస్తో ఇస్తాం. సర్దుకోండి. కంపెనీ వాళ్లతో మాట్లాడి డబ్బులిస్తాం’ అంటూ నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు ఎర వేస్తున్నారు. చిన్నకారు రైతులకు రూ.రెండు వేలు ఇచ్చి పంపుతున్నట్లు సమాచారం. జిలకర మసూరి 2782 రకం పేరుతో సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం, వదరయ్యపాలెం మండలాల్లో రబీలో వరిపంటను సాగు చేసే రైతులకు సూళ్లూరుపేటలో పూజిత ఆగ్రో సర్వీసు సెంటర్‌ డీలర్లు నకిలీ విత్తనాలు ఇవ్వడంతో నిండా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో దాదాపు 200 మందికి పైగా రైతులు నకిలీ విత్తనాలతో మోసపోయారు. దాదాపు 2 వేల ఎకరాలకు పైగా ఆ రకం విత్తనాలతో నాటిన వరిపైరు 20 రోజులకే వెన్నుతీసి అపార నష్టం జరగడంతో వీరంతా లబోదిబోమంటూ డీలర్‌ వద్దకు క్యూ కట్టారు. దీనిపై కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశాలతో వ్యవసాయ శాస్త్రవేత్తలు వరి పంటను పరిశీలించి నకిలీ విత్తనాలని తేల్చారు. సంబంధిత కంపెనీ, డీలర్లపై చర్యలకు ఆదేశించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిటీని నియమించారు. సూళ్లూరుపేటలో మంగళవారం ఆ కమిటీ బాధిత రైతులతో సమావేశం ఏర్పాటు చేసింది. దీంతో ఈ సమావేశానికి బాధిత రైతులు వెళ్లకుండా చేసేందుకు.. రెండు రోజులుగా వారిని పిలిపించి ఎంతో కొంత ఇస్తామని చెబుతున్నారు. కొందరు రైతులేమో వచ్చింది చాలులే అన్న రీతిలో తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక, సంబంధిత డీలరుకు లైసెన్సు రద్దు చేసిన యథావిధిగా ఎరువుల అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

బాధిత రైతులకు పరిహారం చెల్లించాలి

నేను పూజిత ఆగ్రో సర్వీసు సెంటర్‌ వద్ద 13 ఎకరాలకు 14 సంచుల విత్తనాలు కొన్నా. 2782 రకమని చెప్పి ఇచ్చారు. నాటిన 15 రోజులకే వెన్నుతీసింది. దాదాపు 13 ఎకరాలకు రూ.3 లక్షలకు పైగా ఖర్చయింది. కంపెనీ, డీలరు కలిసి నకిలీ విత్తనాలు ఇచ్చారు. ఇదంతా డీలరుకు ముందే తెలిసి రైతులను మోసం చేవారు. వారిపై చర్యలు తీసుకుని, నష్టపోయిన మాకు పరిహారం చెల్లించాలి.

- ఈశ్వరవాక హర్షవర్ధన్‌ రెడ్డి, పిండిపాలెం, సూళ్లూరుపేట మండలం

మూడు ఎకరాలు నాటి నష్టపోయా

నాకున్న మూడు ఎకరాల్లో ఈ నకిలీ విత్తనాలు తీసుకుని నాటా. 20 రోజులకే వెన్నుతీయడంతో రూ.లక్షకు పైగా అప్పు చేసి పెట్టిన పెట్టుబడి పోయింది. ఇక అప్పు పుట్టదు. పెట్టుబడి రాదు. ఆత్మహత్య చేసుకోవాల్సిందే. డీలరేమో కంపెనీవారితో కలిసి రూ.2 వేలు ఇస్తానని చెబుతున్నారు. అధికారులే మాకు న్యాయం చేయాలి.

- దెయ్యాల దాస్‌

Updated Date - Dec 15 , 2025 | 01:44 AM