నేను సీబీఐ అధికారిని
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:52 AM
డిజిటల్ అరెస్టు పేరిట సైబర్ నేరగాళ్ల మోసం రూ.40 లక్షలు పోగొట్టుకున్న రిటైర్డు టీచరు బ్యాంకు అధికారుల అప్రమత్తతో నష్ట నివారణ
తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): సీబీఐ అధికారినంటూ సైబర్ నేరగాడు సీనియర్ సిటిజన్‌కు ఫోను చేశాడు. డిజిటల్ అరెస్టు పేరిట బెదిరించి రూ.40 లక్షలు లాక్కొన్నారు. మళ్లీ భారీగా నగదు పంపే క్రమంలో బ్యాంకు అధికారులు వాస్తవాలు తెలుసుకుని ఆపేశారు. దీనికి తిరుపతి సైబర్ క్రైం సీఐ వినోద్‌కుమార్, వర్సిటీ సీఐ రామయ్య తెలిపిన ప్రకారం.. ఎస్వీయూ పోలీసు స్టేషన్ పరిధిలో 66 ఏళ్ల విశ్రాంత టీచరుకు సీబీఐ అధికారినంటూ ఫోను వచ్చింది. ఈ నెంబరు నెంబరు ద్వారా బెంగళూరులోని మహిళలకు అనుచిత సందేశాలు పంపారంటూ కేసు నమోదైందని చెప్పాడు. వెంటనే బెంగళూరుకు రావాలంటూ ఒత్తిడి చేశాడు. ఆ తర్వాత వాట్సా్‌పకు వీడియో కాల్ చేసి.. గదిలోకి వెళ్లి ఒంటరిగా మాట్లాడాలని చెప్పాడు. ప్రతి రెండు గంటలకు ఒకసారి గుర్తింపు మెసేజ్ పంపాలని బెదిరించాడు. ప్రియారిటీ ఇన్వెస్టీగేషన్ పేరుతో బ్యాంకులోని డబ్బుల వివరాలు అడిగాడు. నిర్దోషి అని నిరూపించుకోవాలంటే వెంటనే రూ 40 లక్షలు జమచేయాలని పలు ఖాతా నెంబర్లు ఇచ్చాడు. దీనికి భయపడిన ఆయన పలు దఫాలుగా రూ.40 లక్షలు వారి ఖాతాలకు జమ చేశారు. మళ్లీ సైబర్ నేరగాళ్లు ఫోనుచేసి బెదిరించారు. దీంతో ఎస్‌బీఐ ఇస్కాన్ బ్రాంచ్‌ను సంప్రదించిన బాధితుడు.. మరోసారి పెద్దమొత్తంలో ఇతర రాష్ట్రాల ఖాతాలకు పంపే చర్యలు చేపట్టారు. దీనిపై బ్యాంకు అధికారులు లీలాకృష్ణ, కృష్ణా రెడ్డి అనుమానం వ్యక్తంచేస్తూ వాస్తవాలు అడిగి తెలుసుకున్నారు. సైబర్ మోసం కావచ్చంటూ ఫిర్యాదుదారుడికి నచ్చచెప్పి ఆ లావాదేవాలను ఆపేశారు. సైబర్ క్రైం పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా, బ్యాంకు అధికారులు, సిబ్బంది అప్రమత్తతతో లావాదేవాలు జరపకుండా సమయ స్ఫూర్తిగా వ్యవహరించడంతో మరిన్ని రూ.లక్షలు నష్టపోకుండా చూడగలిగారు. ఈ క్రమంలో బ్యాంకు మేనేజరును సీఐలు రామయ్య, వినోద్‌కుమార్ సన్మానించారు. బ్యాంకు అధికారులను సన్మానించి, అభినందించారు.