తిరుపతి మీదుగా హైదరాబాదు- చెన్నై హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:31 PM
దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదించిన హైదరాబాదు- చెన్నై హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ జిల్లా మీదుగా వెళ్లనుంది
తిరుపతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు మరో మహత్తర ప్రాజెక్టు రానుంది. దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదించిన హైదరాబాదు- చెన్నై హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ జిల్లా మీదుగా వెళ్లనుంది. ఈ రైల్వే మార్గం రేణిగుంట విమానాశ్రయానికి కనెక్ట్ కానుంది. జిల్లాలో గూడూరు, రేణిగుంట విమానాశ్రయం వద్ద రైల్వే స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర నివేదికను వచ్చే ఏడాది మార్చిలో రైల్వే బోర్డుకు అందజేయనుంది. బోర్డు ఆమోదం పొందితే వచ్చే ఏడాది బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరిగే అవకాశముంది. హైదరాబాదు నుంచీ దాచేపల్లి వద్ద ఏపీలో ప్రవేశించే రైల్వే కారిడార్ నుంచి నంబూరు, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట విమానాశ్రయం మీదుగా ఏపీలో 504 కిలోమీటర్లు ప్రయాణించి, చెన్నై ఔటర్ రింగ్‌రోడ్డుకు చేరుకుంటుంది. అక్కడ్నుంచి చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు కనెక్ట్ కానుంది. ప్రాథమిక డిజైన్‌లో రైల్వే కారిడార్ రేణిగుంట విమానాశ్రయాన్ని కనెక్ట్ చేస్తోంది. కాకపోతే ఎయిర్‌పోర్టు వద్దా లేదా రేణిగుంటకు వెలుపల స్టేషన్ నిర్మాణానికి కూడా రెండు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించింది. విమానాశ్రయంతో కనెక్ట్ చేస్తే విదేశాలు, దూర ప్రాంతాల నుంచీ వచ్చే యాత్రికులకు సౌకర్యంగా ఉంటుంది. దీంతో తిరుపతి ప్రాధాన్యం మరింత పెరగనుంది.
గంటకు 320 కిలోమీటర్ల వేగం
హైదరాబాదు-చెన్నై హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్‌లో భాగంగా నిర్మించే నూతన రైల్వే మార్గాన్ని గంటకు 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్లు ప్రయాణించేలా డిజైన్ చేశారు. అయితే ఆపరేషనల్ స్పీడు మాత్రం గంటకు 320 కిలోమీటర్లుగా నిర్ణయించారు. రైల్వే ట్రాక్ నుంచీ సిగ్నలింగ్ సిస్టమ్, స్టేషన్ల వరకూ అన్నీ అత్యాధునికంగా ఏర్పాటు కానున్నాయి. రైల్వే స్టేషన్లు కూడా కనీసం 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతాయని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో రెండు మూడేళ్లలో జిల్లా మీదుగా బుల్లెట్ ట్రైన్లు దూసుకుపోయే అవకాశముంది.