Share News

పాతపేట వద్ద 14 ఏనుగుల హల్‌చల్‌

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:22 AM

పులిచెర్ల మండలంలోని పాతపేట వద్ద గురువారం రాత్రి 14 ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేసింది.

పాతపేట వద్ద 14 ఏనుగుల హల్‌చల్‌
ఏనుగుల దాడిలో నేలకూలిన కొబ్బరిచెట్టు

కల్లూరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలంలోని పాతపేట వద్ద గురువారం రాత్రి 14 ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేసింది.ఘీంకారాలతో పొలాల్లో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేశాయి. గురువారం రాత్రి తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని గోగులమ్మ వంక నుంచి బయలుదేరిన ఏనుగుల గుంపు పాతపాళ్యం అడవిమీదుగా పాతపేట వద్దకు చేరుకున్నాయి. ఈశ్వర రెడ్డికి చెందిన ఎకరా వేరుశనగ, అరటిచెట్లు, మామిడిచెట్లు, బొప్పాయి, పనసచెట్టు, డ్రిప్‌ పైపులను ధ్వంసం చేశాయి. 25 ఏళ్ల కొబ్బరిచెట్టును నేలమట్టం చేసిన ఏనుగులు వ్యవసాయ మోటర్‌ను కదిలించాయి.శంకర్‌కు చెందిన అర్ధ ఎకరా అలసంద పంటను ధ్వంసం చేసి మామిడిచెట్ల కొమ్మలను విరిచేశాయి.సురేష్‌, నందగోపాల్‌, వెంకట్రమణ, శ్రీనివాసులు, సోమశేఖర్‌, నటరాజ, మునిరాజకు చెందిన కొబ్బరిచెట్లను కూకటివేళ్లతో పెకలించాయి.మామిడిచెట్లలో కొమ్మలను విరిచేశాయి.రంగన్న, దొరస్వామి, శ్రీనివాసులుకు చెందిన మామిడిచెట్లను ధ్వంసం చేసిన ఏనుగులు డ్రిప్‌ పైపులను ఇష్టారాజ్యంగా తొక్కేశాయి. అనంతరం వచ్చిన మార్గంలోనే ఏనుగుల గుంపు అడవిలోకి చేరుకుంది. శుక్రవారం పగలంతా తూర్పు పెద్దవంక వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసినట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు.

ఫధ్వంసమైన పంటలను పరిశీలించిన రేంజర్‌

పులిచెర్ల మండలం పాతపేట వద్ద ఏనుగుల గుంపు ధ్వంసం చేసిన పంటలను శుక్రవారం మధ్యాహ్నం రేంజర్‌ పట్టాభి, డీఆర్వో రాకే్‌షకుమార్‌ పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు.పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామన్నారు.ఏనుగుల దాడిలో ధ్వంసమైన పంటల వివరాలను ఎప్పటికప్పుడు సిబ్బంది పరిశీలించి నివేదికలు ఇవ్వాలన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 12:22 AM