విశాఖ సదస్సులో శ్రీసిటీకి భారీ పెట్టుబడులు
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:16 AM
సీఎంచే వర్చువల్‌గా 5 పరిశ్రమలు ప్రారంభం
సత్యవేడు, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): విశాఖ భాగస్వామ్య సదస్సు-2025 రెండో రోజు శ్రీసిటీ భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్‌గా ఐదు కొత్త పరిశ్రమలను ప్రారంభించారు. 12 కొత్త కంపెనీలకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. డైకిన్, ప్రోటీరియల్(మెట్ గ్లాస్),శ్రీసిటీ ఫేజ్-2 విస్తరణ జీవోలను సంబంధిత సంస్థల సీనియర్ ప్రతినిధులకు సీఎం అందజేశారు. మొత్తంగా రూ.31,450 కోట్ల పెట్టుబడులు, 1.1. లక్షలకుపైగా(ప్రత్యక్షంగా 70,600, పరోక్షంగా 39,400) ఉద్యోగాల సృష్టికి అవకాశాలు లభించాయి. శ్రీసిటీని ఉత్తమ పారిశ్రామిక నమూనాగా చంద్రబాబు అభివర్ణించారు. 50 దేశాలు, 500 కపెంనీలు, 1.5 లక్షల ఉద్యోగాల టార్గెట్ దిశగా కృషి చేయాలని శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డికి నిర్దేశించారు. ఇందులో భాగంగానే అదనంగా 2,500 ఎకరాలను మంజూరు చేసిందని ప్రకటించారు. త్వరలో శ్రీసిటీ సమీపంలో ఎయిర్‌స్ట్రిప్ నిర్మిస్తామన్నారు. నెట్-జీరో, పునరుత్పాధక శక్తి, నీటి నిర్వహణతో భవిష్యత్-సిద్ధ పరిశ్రమ వ్యవస్థలను అభివృద్ధి చేయాలన్నారు. రాబోయే రెండేళ్ళలో శ్రీసిటీని 50 దేశాలకు నిలయంగా మార్చాలనే సీఎం లక్ష్యాన్ని సాధిస్తామని సన్నారెడ్డి చెప్పారు.