రూ.2వేల నోట్ల మార్పిడి ముసుగులో భారీ మోసం
ABN , Publish Date - Jun 27 , 2025 | 01:16 AM
రూ.రెండు వేల నోట్లు చెలామణిలో లేవు. తగు ఆధారాలు చూపి రిజర్వు బ్యాంకులో మార్చుకోవచ్చు. ఈ వెసులుబాటునే కొందరు తమ మోసానికి అస్త్రంగా వాడుకున్నారు. తమ వద్ద ఎక్కువ మొత్తంలో రూ.రెండు వేల నోట్లున్నాయని నమ్మించారు. తమకు రూ.500 నోట్లతో రూ.కోటి ఇస్తే.. రూ.రెండు వేల నోట్లు రూ.2.5 కోట్లకు ఇస్తామని మైండ్‌గేమ్ ఆడారు. అలా సూళ్లూరుపేటలో ఒకరిని నమ్మించి.. అతడికి రూ.2 వేల నోట్లు ఇవ్వకనే రూ.కోటి కొట్టేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
తిరుపతి(నేరవిభాగం), జూన్ 26(ఆంధ్రజ్యోతి): రూ.రెండు వేల నోట్లు చెలామణిలో లేవు. తగు ఆధారాలు చూపి రిజర్వు బ్యాంకులో మార్చుకోవచ్చు. ఈ వెసులుబాటునే కొందరు తమ మోసానికి అస్త్రంగా వాడుకున్నారు. తమ వద్ద ఎక్కువ మొత్తంలో రూ.రెండు వేల నోట్లున్నాయని నమ్మించారు. తమకు రూ.500 నోట్లతో రూ.కోటి ఇస్తే.. రూ.రెండు వేల నోట్లు రూ.2.5 కోట్లకు ఇస్తామని మైండ్‌గేమ్ ఆడారు. అలా సూళ్లూరుపేటలో ఒకరిని నమ్మించి.. అతడికి రూ.2 వేల నోట్లు ఇవ్వకనే రూ.కోటి కొట్టేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలను ఎస్పీ హర్షవర్ధనరాజు గురువారం తిరుపతిలో మీడియాకు వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గకు చెందిన అంబటి సంతోష్ అలియాస్ చిన్నస్వామి, ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన బర్రి రవితేజ, తిరుపతికి చెందిన కె.హేమకర్‌రావు, విశాఖపట్నంలోని కంచర్లపాల్లెంకు చెందిన మామిడి ఉమామహేష్ ముఠాగా ఏర్పడ్డారు. వీరు పలువురిని కలుస్తూ తమ వద్దనున్న రూ.రెండు వేల నోట్ల కట్టను చూపుతారు. రూ.లక్షకు రూ.500 నోట్లు ఇస్తే రూ.రెండు లక్షలకు సంబంధించి రెండువేల నోట్లు ఇస్తామని, మీకు రిజర్వు బ్యాంకులో ఎవరైనా తెలిసుంటే మార్చుకోవచ్చని చెబుతారు. ఎవరైనా వీరి మాయలో పడితే డబ్బు తీసుకుని, రూ.రెండు వేల నోట్లు ఇవ్వకుండా పారిపోతారు. ఇలా గత నెలలో సూళ్లూరుపేటలో పలువురిని కలిసి ‘డీల్’ మాట్లాడారు. ఈ క్రమంలో మినీ ఏటీఎం నిర్వాహకుడు జగదీష్ వీరి వలలో పడ్డారు. రూ.కోటి ఇస్తే తాము రూ.రెండున్నర కోట్లకు రూ.రెండు వేల నోట్లు ఇస్తామని అతడిని వీరు నమ్మించారు. దీంతో అతడు రూ.కోటి సిద్ధం చేసుకున్నారు. గతనెల 7వ తేది ఈ నిందితులు వాహనాల్లో సూళ్లూరుపేటకు చేరుకుని సమీపంలోని హైవే వద్దకు రమ్మని జగదీ్‌షకు చెప్పారు. అతడు రూ.కోటి బ్యాగుతో ఇద్దరు స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లారు. జగదీ్‌షతో ఉన్న ఇద్దరిని దగ్గరలో వున్న తమ గదికి వెళితే బాస్ (అంబటి సంతోష్) రూ.రెండువేల నోట్లు రూ.2.50 కోట్లు ఇస్తారని చెప్పి పంపారు. అనంతరం జగదీష్ వద్ద ఉన్న రూ.కోటి బ్యాగును అంబటి సంతోష్ పీఏనని చెప్పిన వ్యక్తి తీసుకుని కారులో పారిపోతుండగా, జగదీష్ అప్రమత్తమై ఆ కారు డోరును పట్టుకున్నారు. కారులోని నిందితులు అతడిని కిందకు నెట్టేసి పరారయ్యారు. మిగిలిన వారూ మరో రెండు వాహనాల్లో పలాయనం చిత్తగించారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు డీఎస్పీ చెంచుబాబుకు విషయం తెలిపి సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ కేసు నమోదు చేశారు. నిందితుల ఆచూకీ కోసం పలు కోణాల్లో దర్యాప్తు చేశారు.
వేలిముద్రలే పట్టిచ్చాయా?
ఎస్పీ హర్షవర్ధనరాజు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ రవిమనోహరాచ్చారి పర్యవేక్షణలో డీఎస్పీ చెంచుబాబు, సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ బ్రహ్మనాయుడు, డీవీ సత్రం ఎస్‌ఐ అజయ్‌బాబు, తడ ఎస్‌ఐ కొండమనాయుడు, ఏఎ్‌సఐలు, పోలీసులు బృందాలుగా విడిపోయారు. నిందితుల కదలికలు, గతంలో వారు ఎక్కడైనా నేరాలకు పాల్పడ్డారా? ఇలాంటి నేరాలు ఎక్కడ జరిగాయి? అనే కోణాల్లో సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేశారు. మొదట ఈ కేసులో కీలక నిందితుడు అంబటి సంతోష్ వేలిముద్రలు పరిశీలించారు. ఇవి సరిపోవడంతో అతడి కోసం గాలించారు. వారి కదలికలపై దృష్టి సారించిన పోలీసులు అంబటి సంతోష్, బర్రి రవితేజ, ఉమామహే్‌షను చిల్లకూరు మండలం బూదనం టోల్‌ప్లాజా వద్ద, కె.హేమకర్‌రావును తిరుపతిలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.73.20 లక్షల నగదు, రెండు వాహనాలు, ఆరు రూ.2000 నోట్ల డమ్మీ కట్టలు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో దొంతిరెడ్డి హరిబాబు రెడ్డి పరారీలో ఉన్నాడు. ఈ కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ చూపిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డులు అందచేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, రవిమనోహరాచ్చారి, డీఎస్పీ పాల్గొన్నారు.
అందరూ పాత నేరస్థులే
నాయుడుపేట పోలీసులు అరెస్టు చేసి నలుగురు నిందితులూ పాత నేరస్థులుగా గుర్తించారు. వీరిలో అంబటి సంతో్‌షపై కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో 32వ రౌడీషీటర్‌గా, అలిపిరి, అనకాపల్లి, మాల్కాపురం, కాశీబుగ్గ స్టేషన్‌లలో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. తిరుపతి మారుతీనగర్‌కు చెందిన హిమకర్‌పై కాణిపాకం స్టేషన్‌లోలో చీటింగ్ కేసు, బర్రి రవితేజ, మామిడి ఉమా మహే్‌షపై దాదాపు ఆరు కేసులున్నట్లు తెలిసింది.