ఎంత పని చేశావు తల్లీ..!
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:45 AM
భర్త మందలిస్తే ఉసురు తీసుకోవాలా? కుటుంబంలో కలహాలుంటే అభం శుభం తెలియని బిడ్డల ప్రాణాన్నీ బలిగొనాలా? ఆవేశంలో ఎంత చేశావు తల్లీ.. అంటూ రోదిస్తున్నారామె కుటుంబీకులు, బంధుమిత్రులు. ఇద్దరు చిన్నారుల సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వరలక్ష్మి జీవితం విషాదాంతమైంది.
ఉగ్గుమూడిలో విషాదం
సూళ్లూరుపేట, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): భర్త మందలిస్తే ఉసురు తీసుకోవాలా? కుటుంబంలో కలహాలుంటే అభం శుభం తెలియని బిడ్డల ప్రాణాన్నీ బలిగొనాలా? ఆవేశంలో ఎంత చేశావు తల్లీ.. అంటూ రోదిస్తున్నారామె కుటుంబీకులు, బంధుమిత్రులు. ఇద్దరు చిన్నారుల సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వరలక్ష్మి జీవితం విషాదాంతమైంది. ఈ ఘటన సూళ్లూరుపేట మండలం ఉగ్గుమూడిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఉగ్గుమూడి ఎగువ హరిజనవాడకు చెందిన వరలక్ష్మికి, దిగువ హరిజనవాడకు చెందిన ఉగ్గుముడి మాధవయ్యతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ప్రశాంత్(2), వర్షిత్(4) పిల్లలు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో వరలక్ష్మి(24)ని భర్త మందలించాడు. దీంతో కలత చెందిన ఆమె శనివారం ఇంట్లో భర్తలేని సమయంలో గ్రామ సమీపంలోని నేలబావి వద్దకు ఇద్దరు బిడ్డలతో వెళ్లింది. మొదట పిల్లలను బావిలో తోసి తానూ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం నుంచి తల్లీ బిడ్డలు కనిపించకపోవడంతో బంధువులు చుట్టుపక్కల వెదికారు. సాయంత్రం పొలాల్లోకి పనుల నిమిత్తం వెళ్లిన గ్రామస్తులకు నేలబావిలో వర్షిత్ మృతదేహం తేలిఉండటం కనిపించింది. వీరి సమాచారంతో గ్రామస్తులు, బంధువులు అక్కడకు చేరుకుని బావిలో నుంచి తల్లి, బిడ్డల మృతదేహాలను వెలికితీశారు. ఎంత పని చేశావమ్మా వరలక్ష్మీ.. చిన్న బిడ్డలనూ బావిలో తోసి ఆత్మహత్య చేసుకునేందుకు మనసు ఎలా వచ్చిందమ్మా అంటూ గుండెలవిసేలా రోదించారు. సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ బ్రహ్మనాయుడు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తల్లీబిడ్డల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.