Share News

ట్యాంకరు ఎలా పేలింది?

ABN , Publish Date - Nov 27 , 2025 | 01:15 AM

సుధా సోమానీ’ పరిశ్రమలో నైట్రోజన్‌ ట్యాంకరు ఎలా పేలింది.. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. శ్రీకాళహస్తి మండలం వెల్లంపాడులోని ఈ కర్మాగారంలో బుధవారంనాటి ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్రయోజనిక్‌ ప్రొపైన్‌ ఖాళీ ట్యాంకులో నైట్రోజన్‌ నింపుతుంటామని పరిశ్రమ నిర్వాహకులు అధికారులకు వెల్లడించినట్లు తెలిసింది.

ట్యాంకరు ఎలా పేలింది?
పేలిన ట్యాంకు

శ్రీకాళహస్తి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): ‘సుధా సోమానీ’ పరిశ్రమలో నైట్రోజన్‌ ట్యాంకరు ఎలా పేలింది.. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. శ్రీకాళహస్తి మండలం వెల్లంపాడులోని ఈ కర్మాగారంలో బుధవారంనాటి ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్రయోజనిక్‌ ప్రొపైన్‌ ఖాళీ ట్యాంకులో నైట్రోజన్‌ నింపుతుంటామని పరిశ్రమ నిర్వాహకులు అధికారులకు వెల్లడించినట్లు తెలిసింది. బుధవారం ఖాళీ ట్యాంకర్‌ను టెస్టింగ్‌ చేస్తుండగా పేలుడు జరిగినట్లు అధికారులకు వివరించారు. ఖాళీ ట్యాంకర్‌ అంత అధిక పీడనంతో ఎందుకు పేలిందనే సందేహాన్ని అఽధికారులు వ్యక్తం చేస్తున్నారు. నైట్రోజన్‌ ట్యాంకులో నింపుతూ ప్రెజర్‌లో టెస్టింగ్‌ చేసే సమయంలో అధిక ఒత్తిడి కారణంగా ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేసి పేలుడు కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఏం జరిగింది?

శ్రీకాళహస్తి మండలం వెల్లంపాడులో సుధా సోమానీ సిరామిక్‌ కర్మాగారంలో టైల్స్‌, బాత్‌రూం పరికరాలను తయారు చేస్తుంటారు. 50 ఎకరాల విస్తీర్ణంలోని ఈ పరిశ్రమంలో సుమారు 500 మంది సిబ్బంది ఉదయం 7 గంటలు, సాయంత్రం 7గంటలకు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం 11.30గంటల సమయంలో క్రయోజనిక్‌ ప్రొపైన్‌ ట్యాంకు పేలడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంకటగిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా చీరాలకు చెందిన పోతురాజు(31), ఒడిశాకు చెందిన అరబింద పాండా(25) మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చంద్రగిరికి చెందిన బాలాజీ, ఒడిస్సాకు చెందిన సౌభాగ్య నాయక్‌ అలియాస్‌ రంజన్‌ నాయక్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు చొప్పున యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య డిమాండు చేశారు. ప్రమాదాలు జరగకుండా అధికారులు పటిష్టమైన చర్యలుచేపట్టాలని కోరారు.

ప్రమాద స్థలం పరిశీలన

ఈ ప్రమాదం తెలిసిన వెంటనే శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, సీఐ నాగార్జునరెడ్డి వెంకటగిరి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులతో మాట్లాడారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వాస్పత్రి మార్చూరీకి తరలించారు. అనంతరం డీఎస్పీ సిబ్బందితో కలిసి పరిశ్రమలో ఘటన సంభవించిన ప్రాంతానికి చేరుకుని విచారించారు. ఇంటెలిజెన్స్‌ స్పెషల్‌ బ్రాంచి సిబ్బంది పేలిన ట్యాంకర్‌ పరిసరాలను పరిశీలించారు. తిరుపతి నుంచి క్లూస్‌ టీం చేరుకుని పేలుడు ప్రదేశంలో మృతుల రక్తపు జాడలు, పలు నమూనాలను సేకరించారు.

Updated Date - Nov 27 , 2025 | 01:15 AM