వేడుకగా గృహ ప్రవేశాలు
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:21 AM
నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రభుత్వ పక్కా ఇళ్ళకు బుధవారం గృహ ప్రవేశాలు జరిగాయి.
తిరుపతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రభుత్వ పక్కా ఇళ్ళకు బుధవారం ఘనంగా గృహ ప్రవేశాలు జరిగాయి. ఎనిమిది నియోజవర్గాల పరిధిలో గతేడాది జూన్ నుంచీ ఇప్పటి దాకా పీఎంఏవై 1.0 పథకం కింద బీఎల్‌సీ, గ్రామీణ్ కేటగిరీలలో 14,486 పక్కా ఇళ్ళ నిర్మాణం పూర్తయ్యాయి. వీటిలో లే అవుట్లకు సంబంధించి 9984 ఇళ్లుండగా లబ్ధిదారుల సొంత స్థలాల్లో 4502 ఇళ్లున్నాయి. పూర్తయిన ఇళ్ళకు జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా చంద్రగిరిలో 1020, గూడూరులో 1564, నగరిలో 469, సత్యవేడులో 781, శ్రీకాళహస్తిలో 2232, సూళ్ళూరుపేటలో 1487, తిరుపతిలో 6047, వెంకటగిరిలో 886 చొప్పున ఇళ్ల నిర్మాణం పూర్తయింది. బుధవారం జరిగిన గృహ ప్రవేశ కార్యక్రమాల్లో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, పుత్తూరులో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, సత్యవేడులో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణరెడ్డి, సూళ్ళూరుపేటలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందజేశారు. ఆయా చోట్ల స్థానిక హౌసింగ్ అధికారులు, ఉద్యోగులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. చంద్రగిరికి సంబంధించి ఎమ్మెల్యే పులివర్తి నానీ అందుబాటులో లేకపోవడంతో ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.