ఇకపై నిరంతరం ప్రజలకోసం
ABN , Publish Date - May 23 , 2025 | 01:54 AM
‘ఇప్పటికే పత్రికాపరంగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాం. అదే తరహాలో మరో అడుగు ముందుకు వేసి ‘అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి పునాది వేశాం. ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం.
‘అక్షరమే అండగా.. సమస్యల పరిష్కారమే అజెండాగా’ లక్ష్యమిదే
జీవకోన సభలో ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య
తిరుపతి, మే 22 (ఆంధ్రజ్యోతి): ‘ఇప్పటికే పత్రికాపరంగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాం. అదే తరహాలో మరో అడుగు ముందుకు వేసి ‘అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి పునాది వేశాం. ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. అందులో భాగంగా వంద రోజుల కిందట ఇదే జీవకోనలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలు వివరించిన అనేక సమస్యల్లో సగానికిపైగా పరిష్కారం లభించింది. మిగిలిన వాటినీ పూర్తిగా పరిష్కరించేందుకు మా వంతు కృషి చేస్తాం’ అని ‘ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ వేమూరి ఆదిత్య అన్నారు. తిరుపతి నగరం జీవకోనలోని శ్రీలలితా త్రిపుర సుందరి ఆలయంలోని ఫంక్షన్ హాలులో గురువారం జరిగిన ‘అక్షరమే అండగా సభలు’ కార్యక్రమంలో అధికార ప్రముఖుల ప్రసంగాలు, ప్రజల స్పందన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వేమూరి ఆదిత్య మాట్లాడుతూ.. ఇప్పటికే రూ.65 లక్షలతో అనేక సమస్యలకు పరిష్కారం చూపడంతోపాటు శాంతి భద్రతల రక్షణ కోసం పోలీసు అవుట్‌పోస్టు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఇది మొదటి అడుగేనని, ఇదే తరహాలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని చెప్పారు. ఇందుకు సహకరించిన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, జీవకోన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అన్నా సంధ్య, అన్నా అనిత, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ, ఆంధ్రజ్యోతి అసిస్టెంట్ ఎడిటర్ ఆర్‌ఎం ఉమామహేశ్వర రావు, బ్రాంచ్ మేనేజర్ వి.సురేష్‌రెడ్డి, ఎడిషన్ ఇన్‌చార్జి వి.సుధాకరబాబు, ఏడీవీటీ మేనేజరు ఈశ్వరనాయుడు, ప్రొడక్షన్ ఇన్‌చార్జి మోహన్‌రావు, సర్క్యులేషన్ ఇన్‌చార్జి ఉమాపతి, బ్యూరో ఇన్‌చార్జి శివప్రసాద్, స్టాఫ్ రిపోర్టర్ పి.నరేంద్ర, ఏబీఎన్ స్టాఫర్ దినేష్, నగరపాలక సంస్థ ఎస్‌ఈ శ్యామ్ సుందర్, ఎంఈ గౌతమి, డీఈ రమణ, హెల్త్ ఆఫీసర్ యువఅన్వేష్, జనసేన నాయకులు నరసింహులు నాయుడు, రాజా రెడ్డి, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
భూమిపూజ.. ప్రారంభోత్సవాలు
జీవకోనకు చేరుకున్న వేమూరి ఆదిత్యకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పుష్షగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. కమిషనర్ మౌర్య, కార్పొరేటర్లు అన్నా అనిత, అన్నా సంధ్యతో కలిసి సీసీ రోడ్డుకు భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సొంత నిధులతో ప్రారంభమైన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను పరిశీలించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్టును ప్రారంభించారు. జీవకోన పరిధిలో రూ.37.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును సభా కార్యక్రమం అనంతరం ప్రారంభించారు.
ఎమ్మెల్యే మాటతో ఎస్పీ చొరవ
జీవకోనలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటుచేస్తామన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇచ్చిన హామీతో ఎస్పీ హర్షవర్ధన్‌రాజు చొరవతో అవుట్ పోస్ట్ ఏర్పాటుచేశారు. దీని ప్రారంభోత్సవంలో అతిథులతో పాటు అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీ శ్రీలత, సీఐ రామకిషోర్, ఎస్‌ఐలు నాగార్జున రెడ్డి, లోకేశ్‌బాబు పాల్గొన్నారు.
‘ఆంధ్రజ్యోతి’కి అభినందనలు
‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..’ వంద రోజుల కిందట జీవకోనలో ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన సదస్సులో ప్రజలు పలు సమస్యలను ప్రస్తావించారు. ఇప్పటికే మున్సిపాలిటీ, తుడా నిధులతో సీసీ రోడ్లు, తాగునీటి సమస్యను పరిష్కరించాం. గంజాయి బ్యాచ్, ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేశాం. శ్మశాన వాటికకు ప్రహరీ, గేట్ల ఏర్పాటుకు రూ.10 లక్షలు మంజూరు చేశాం. శాశ్వత ఇంటి పట్టాల విషయమై రెవెన్యూ, ఫారెస్టు, టీటీడీ అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపుతాం. నా విజయానికి పునాది వేసిన జీవకోన అభివృద్ధికి తప్పక కృషి చేస్తా. సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చి.. పరిష్కారానికి కృషి చేసిన ఆంధ్రజ్యోతికి ప్రత్యేక అభినందనలు.
- ఆరణి శ్రీనివాసులు, తిరుపతి ఎమ్మెల్యే
‘ఆంధ్రజ్యోతి’ వేసిన పునాదిని కొనసాగిస్తాం
ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ఆంధ్రజ్యోతి వేసిన పునాదిని భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం. ఆంధ్రజ్యోతి చేపట్టిన అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమంలో ప్రజలు చెప్పిన సమస్యల్లో చాలావాటిని వంద రోజుల్లో పరిష్కరించాం. మిగిలిన వాటినీ పరిష్కరిస్తాం. కుక్కల బెడద ఎక్కువగా ఉందని కూడా స్థానికులు చెప్పారు. వాటికి వ్యాక్సిన్ వేయించి కట్టడి చేసేలా ఇప్పటికే చర్యలు చేపడుతున్నాం. లెప్రసీ కాలనీకి పేరు మార్చాలని కార్పొరేటర్‌తో పాటు కాలనీవాసులు కోరారు. ఆ విషయాన్ని కౌన్సిల్ మీటింగ్‌లో ప్రతిపాదించి జ్యోతి లెప్రసీ కాలనీకి జ్యోతి కాలనీగా పేరు మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.
- ఎన్.మౌర్య, కార్పొరేషన్ కమిషనర్