మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:22 PM
అల్పపీడన ప్రభావంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది
చిత్తూరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. బుధవారం పగలంతా ముసురు వీడకపోవడంతో జనజీవనం స్తంబించిపోయింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. చిత్తూరు జిల్లాతో పాటు పొరుగు జిల్లాలు తిరుపతి, అన్నమయ్యలకు కూడా వాతావరణ శాఖ అధికారులు బుధవారం రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.26వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మూడు రోజుల పాటు అధికారులకు సెలవుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికార యంత్రాంగం జిల్లా కేంద్రాన్ని వదిలి వెళ్లకూడదని సూచించారు.
నిండిన చెరువులు
జిల్లాలో మొత్తం 4122 చెరువులుండగా, 595 చెరువులు వంద శాతం నిండాయి. 493 చెరువులు 75శాతం, 1326 చెరువులు 50 శాతం, 1163 చెరువులు 25 శాతం, 545 చెరువులు 25 కంటే తక్కువ శాతం నిండాయి. పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్, కార్వేటినగరంలోని కృష్ణాపురం జలాశయాలు నిండిపోయాయి. ఎన్టీఆర్ జలాశయంలోని 5 గేట్ల ద్వారా నీటిని కిందకు విడుదల చేశారు.
చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా డ్రైనేజీ సమస్యలు తలెత్తాయి. తేనెబండ వద్ద నీవా నది ఉధృతంగా ప్రవహించింది. చిత్తూరు - కాణిపాకం రోడ్డులో సంతపేట వద్ద కాలువలు బ్లాక్ అయిపోయి డ్రైనేజీ నీళ్లతో పాటు వర్షపు నీళ్లు కలిసి రోడ్డుపైకి వచ్చేయడంతో కమిషనర్ నరసింహ ప్రసాద్ అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించారు.
వెదురుకుప్పం - పెనుమూరు రహదారిలోని గుండుపల్లె, పాతగుంట వద్ద రోడ్డుపై వాగు ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. వెదురుకుప్పం - దేవళంపేట రహదారిలోని తంగేలిమిట్ట సమీపంలో రోడ్డుపై వంక ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఓ బైక్‌రైడర్ మధ్యలవంకను దాటడానికి ప్రయత్నించి కొట్టుకుపోతుండగా స్థానికులు చొరవ చూపి కాపాడారు. అలాగే ఓ ఆటోను కూడా గట్టుకు చేర్చారు.
సోమల, సదుం మండల్లాలోని గార్గేయ నది జోరుగా ప్రవహిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. సోమల మండలంలో పలు కల్వర్టులు కొట్టుకుపోయాయి. సోమల- నంజంపేట మార్గంలోని జీడిరేవుల వంకపై నిర్మించిన కల్వర్టు కొట్టుకుపోవడంతో ప్రజలే తాత్కాలికంగా ఇసుక బస్తాలతో పనులు చేసుకుని రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఐరాలలో గార్గేయ నది ప్రవాహ వుధృతి కారణంగా సుమారు రెండు గంటల పాటు రాకపోకలు ఆగిపోయాయి. పులిచెర్ల మండలం దేశిరెడ్డిపల్లె సమీపంలో హంద్రీనీవా కాలువకు గండి పడింది. హంద్రీనీవా పరివాహక ప్రాంతాల్లో చెరువులు నిండిపోయాయి. కర్ణాటకలో కురిసిన వర్షాలకు శాంతిపురం మండలంలోని పాలారు నది పరవళ్లు తొక్కుతోంది.
రొంపిచెర్ల జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో సుమారు 30 ఏళ్ల వృక్షం విరిగిపడింది. పాఠశాలకు శెలవు ప్రకటించడంతో పిల్లలు ఎవరూ లేరు.భవనంపై పడకండా పోవడంతో స్కూలుకు ప్రమాదం తప్పింది.