Share News

రోజంతా ముసురు వాన, స్తంభించిన జనజీవనం

ABN , Publish Date - Oct 28 , 2025 | 11:44 PM

రోజంతా ముసురు వాన కారణంగా జన జీవనం స్తంభించింది.

 రోజంతా ముసురు వాన,  స్తంభించిన జనజీవనం
నిండిపోయిన ఎన్టీయార్‌ జలాశయం

చిత్తూరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను ప్రభావం మంగళవారం చెప్పుకోదగ్గ స్థాయిలో లేకున్నా రోజంతా ముసురు వాన కారణంగా జన జీవనం స్తంభించింది. వాతావరణ శాఖ హెచ్చరికల కారణంగా ప్రజలు కూడా పెద్దగా బయటికి రాకుండా పనుల్ని వాయిదా వేసుకున్నారు. వాహనాలు పెద్దగా రోడ్లపై తిరగలేదు. ఆర్టీసీ బస్సులు తిరిగినా ప్రయాణికులు పెద్దగా కన్పించలేదు. చాలావరకు సినిమా హాళ్లు, దుకాణాలు, హోటళ్లు కూడా తెరుచుకోలేదు.

అంగన్వాడీలకు మాత్రమే సెలవు

తుఫాను ప్రభావ హెచ్చరికలతో సోమ, మంగళవారాలు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.మంగళవారంతో తుఫాను ప్రభావం తగ్గిన కారణంగా బుధవారం నుంచి విద్యాసంస్థలు యథావిధిగా పనిచేస్తాయని కలెక్టర్‌ ప్రకటించారు.అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రమే బుధవారం సెలవు ప్రకటించారు.

చిన్నపాటి నష్టం ఇలా..

వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో 10 పూరి గుడిసెలు దెబ్బతినగా, ప్రభుత్వం రూ.50 వేల చొప్పున మంజూరు చేసింది. ఇప్పటికే ఐదుగురు బాధితులకు పంపిణీ చేయగా, రెండు మూడు రోజుల్లో మిగిలినవారికీ అందించనున్నారు. జిల్లాలో 75 శాతం చెరువులు నిండిపోగా, సుమారు 50 చెరువులు డ్యామేజ్‌ అయ్యాయి. అక్కడక్కడ రోడ్లు, కల్వర్టులు కూడా చిధ్రమయ్యాయి. 300 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్తు శాఖకు చెప్పుకోదగ్గ నష్టం జరగలేదు. నగరి ప్రాంతంలో చలి కారణంగా ఓ పశువు మృతి చెందింది.జిల్లా కేంద్రమైన చిత్తూరులో మూడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినా నిర్వాసితుల్ని ఉంచాల్సిన అవసరం రాలేదు.నగరి మండలం వేలావడి ఎస్టీ కాలనీవాసులను సమీపంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు.ఎమ్మెల్యే భానుప్రకాష్‌ ఈ కేంద్రాన్ని సందర్శించి బాధితులను పలకరించారు.

సమృద్ధిగా భూగర్భజలాలు

వరుస వర్షాల కారణంగా జిల్లాలో భూగర్భజలాలు బాగా పెరిగాయి. 2021 చివర్లో నివర్‌ తుఫాను జిల్లాను అతలాకుతలం చేసింది. పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టాలను మిగిల్చింది. 2021-22లో జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున భూగర్భజలాలు పెరిగాయి.ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమైంది. అక్టోబరు నెలకు సంబంధించి జిల్లా సాధారణ వర్షపాతం 151.7 మి.మీ కాగా, మంగళవారం నాటికి 292.4 మి.మీలుగా ఉంది. అంటే దాదాపు రెట్టింపు వర్షపాతం నమోదైంది.

యంత్రాంగం అప్రమత్తం

ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారి పీఎస్‌ గిరీషా సోమవారం చిత్తూరు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జీడీనెల్లూరు ప్రాంతంలో పర్యటించారు. మంగళవారం కార్వేటినగరంలోని కృష్ణాపురం జలాశయంతో పాటు నగరి ప్రాంతంలో పర్యటించి తుఫాను పరిస్థితుల్ని పర్యవేక్షించారు. ఆర్డీవో తదితర అధికారులు వారి పరిధిలోని చెరువులు, రోడ్లు డ్యామేజీలను పరిశీలించారు.కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.గంటలకోసారి టెలీ, వీడియో కాన్ఫరెన్సులను నిర్వహించి మండలస్థాయి అధికారులను అప్రమత్తం చేస్తూ, తుపాను పరిస్థితిని పర్యవేక్షించారు.

నిధుల ఖర్చు

తుఫాను సహాయక చర్యల కోసం ప్రభుత్వం జిల్లాకు రెండు విడతల్లో రూ.2.50 కోట్లను విడుదల చేయగా, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆయా అవసరాలకు ఆ నిధుల్ని ఖర్చు చేస్తున్నారు.పడిపోయిన 5 ఇళ్లకు పరిహారంగా ఇప్పటికే రూ.50వేల చొప్పున అందించగా, మరో 5 ఇళ్లకు ఇవ్వనున్నారు. అలాగే ఈ నెల 13న చిత్తూరు రూరల్‌ మండలంలో పిడుగు పడి మరణించిన ఓ యువకుడి కుటుంబానికి రూ.5 లక్షల సాయం మంజూరు చేశారు. చెరువుల, రోడ్ల డ్యామేజీని అంచనా వేసి మరమ్మతు పనులు చేపట్టనున్నారు.

300 ఎకరాల్లో వరి పంటకు నష్టం

చిత్తూరు సెంట్రల్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): వర్షాల కారణంగా 300 ఎకరాల్లో వరి, వేరుశనగ పంటలు దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారులు లెక్కలు కట్టారు. 12 మండలాల పరిధిలోని 71 గ్రామాల్లో 247 మంది రైతులు 293 ఎకరాల్లో సాగు చేసిన వరి, ఏడు ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతింది. అత్యధికంగా గుడిపాల మండలంలో 12 గ్రామాల్లోని 55 ఎకరాల్లో వరి పైరు దెబ్బతింది. యాదమరి మండలంలో ఐదు గ్రామాల్లోని 12.25 ఎకరాల్లో వరిపైరు, తవణంపల్లెలో మూడు గ్రామాల్లోని 6.5 ఎకరాల్లో, పెనుమూరులో 10 గ్రామాల్లో 70 ఎకరాలు, బంగారుపాళ్యంలో నాలుగు గ్రామాల్లో 12.5 ఎకరాలు, పూతలపట్టులో 14 ఎకరాలు, ఐరాలలో 8 గ్రామాల్లో 28 ఎకరాలు, వెదురుకుప్పంలో 7 గ్రామాల్లో 34.75 ఎకరాలు, సోమలలో రెండు గ్రామాల్లో 3 ఎకరాలు, ఎస్‌ఆర్‌పురంలో ఐదు గ్రామాల్లో 11.25 ఎకరాలు, జీడీ నెల్లూరులోని ఆరు గ్రామాల్లో 39.75 ఎకరాలు, పాలసముద్రంలోని మూడు గ్రామాల్లో ఆరు ఎకరాల్లో వరిపైరు దెబ్బతింది. కాగా గుడిపాల మండలంలో 3 ఎకరాలు, పూతలపట్లులో 1.8 ఎకరాలు, జీడీ నెల్లూరులో 3 ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతింది.

Updated Date - Oct 28 , 2025 | 11:44 PM