Share News

టీడీపీ ‘అధ్యక్ష’ పదవికి భారీ పోటీ

ABN , Publish Date - Aug 24 , 2025 | 01:56 AM

చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్ష పదవికి భారీ పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే టీడీపీ అధిష్ఠానం నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పోస్టుతోపాటు కార్యవర్గాన్ని ఎంపిక చేయడానికి త్రీమెన్‌ కమిటీని నియమించింది.

టీడీపీ ‘అధ్యక్ష’ పదవికి భారీ పోటీ

రేపు చిత్తూరు రానున్న త్రిసభ్య కమిటీ

ఎమ్మెల్యేలు, చైర్మన్ల నుంచి అభిప్రాయాల సేకరణ

తీవ్ర ప్రయత్నాల్లో ఆశావహులు

చిత్తూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్ష పదవికి భారీ పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే టీడీపీ అధిష్ఠానం నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పోస్టుతోపాటు కార్యవర్గాన్ని ఎంపిక చేయడానికి త్రీమెన్‌ కమిటీని నియమించింది. ఇందులో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి (నంద్యాల), గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ (గుంటూరు), లిడ్‌ క్యాప్‌ చైర్మన్‌ పిల్లి మాణిక్యాలరావు (గుంటూరు) ఉన్నారు. వీరు సోమవారం చిత్తూరుకు వచ్చి.. ఎమ్మెల్యే, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. శనివారం సాయంత్రం సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల త్రీమెన్‌ కమిటీ నాయకులతో ఉండవల్లిలోకి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎంపిక ఎలా అన్నదానిపై సూచనలిచ్చారు. ఈ సమాచారం జిల్లాలోని ఎమ్మెల్యేలతోపాటు వన్నియకుల క్షత్రియ ఫైనాన్స్‌, మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్లు సీఆర్‌ రాజన్‌, త్యాగరాజన్‌, చుడా చైర్‌పర్సన్‌ కటారి హేమలతకు సమాచారం అందింది.

పోటీ ఇలా..

ఎన్నికలకు ముందు చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన సీఆర్‌ రాజన్‌ను చిత్తూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. అంతకుముందు పులివర్తి నాని అధ్యక్షుడిగా ఉండేవారు. ప్రధాన కార్యదర్శిగా బంగారుపాళ్యానికి చెందిన కోదండయాదవ్‌ కొనసాగుతున్నారు. పార్లమెంటు కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్న నేపథ్యంలో అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీ నెలకొంది. వీరిలో కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే అధికంగా ఉండడం విశేషం.

పాలసముద్రం మండలానికి చెందిన భీమినేని చిట్టిబాబు గతంలో జీడీనెల్లూరు నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా పనిచేసి ప్రస్తుతం రాజంపేట అసెంబ్లీ పరిశీలకుడిగా ఉన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న ఇతను రాజంపేట అసెంబ్లీలోని ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలో కీలకపాత్ర పోషించి, గెలిచిన జడ్పీటీసీతో సీఎం చంద్రబాబును కలిశారు. ఈయన అధ్యక్ష పదవి తనకే అన్న నమ్మకంలో ఉన్నారు.

చిత్తూరులోని భాస్కరా హోటల్‌ యజమాని, బంగారుపాళ్యం మండలానికి చెందిన జయప్రకాష్‌ నాయుడు కూడా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. డీసీసీబీ చైర్మన్‌ పదవి కోరి భంగపడిన ఈయన, అధ్యక్ష పదవి కచ్చితంగా కావాల్సిందేనని కోరుతున్నారు.

నగరి నియోజకవర్గానికి చెందిన పోతుల విజయ్‌బాబు కూడా అధ్యక్ష పదవి కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మద్దతుకోసం మంత్రి అచ్చెన్నాయుడితో జిల్లా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయించుకున్నట్లు తెలుస్తోంది.

చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వీరపల్లి హేమంబరధరావు టీటీడీ బోర్డు మెంబర్‌ ఆశించి భంగపడి, ఇప్పుడు అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఈయన తిరుపతిలో పారిశ్రామికవేత్తగా రాణించి ఆర్థికంగా బలపడ్డారు.

పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన మహదేవ సందీప్‌, చిత్తూరు రూరల్‌ మండలానికి చెందిన చంద్రప్రకాష్‌, చిత్తూరు నగరానికి చెందిన వసంత్‌కుమార్‌, ఐరాలకు చెందిన గిరి, తవణంపల్లెకు చెందిన వెంకటేష్‌.. ఆశిస్తున్నారు. మహదేవ సందీప్‌ తండ్రి మహదేవనాయుడు గతంలో జిల్లా అధ్యక్షుడిగా, టీటీడీ బోర్డు మెంబర్‌గా చేశారు. వీరంతా కమ్మ సామాజికవర్గానికి చెందినవారే కావడంతో పోటీ తీవ్రంగా ఉంది.

మహిళా కోటాలో జీడీ నెల్లూరు నియోజకవర్గానికి చెందిన కార్జాల అరుణ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. ఈమె ప్రస్తుతం మహిళా విభాగం పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. యువగళం పాదయాత్రలో అక్రమ కేసుల కారణంగా జైలుకు కూడా వెళ్లారు.

బలిజ కోటా తెరమీదకి..

చిత్తూరు నగరానికి చెందిన కాజూరు బాలాజి.. బలిజ కోటాలో తనకు అధ్యక్ష పదవి కావాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు.. చిత్తూరు ఎమ్మెల్యే టికెట్‌ ఆశావహులు ఆరుగురిని బృందంగా చేసి ప్రచారం చేయించిన విషయం తెలిసిందే. అప్పటి ఆశావహుల్లో బాలాజి ఉన్నారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో చిత్తూరు ప్రజలకు నిత్యావసరాలు, మెడికల్‌ అవసరాలను పంపిణీ చేసి దగ్గరైన ఈయన బలిజ కోటా తెర ముందు పెట్టి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.

సీనియర్ల కోటాలో..

మాజీ ఎమ్మెల్సీలు దొరబాబు, గౌనివారి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్‌ మనోహర్‌ ఉన్నారు. వీరు ప్రయత్నాలు చేయడం లేదు కానీ, సీనియర్లు అని గౌరవించి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.

సీఆర్‌ రాజన్‌ను కొనసాగిస్తే...?

అధ్యక్ష పదవి కోసం పోటీ తీవ్రంగా ఉండడంతో అర్హుల్ని ఎంపిక చేస్తారా.. లేదా ఇప్పటికే ఉన్న సీఆర్‌ రాజన్‌ను కొనసాగిస్తారా.. అనే ఆలోచన కూడా పార్టీ నాయకుల్లో ఉంది. ఒకే సామాజికవర్గానికి చెందినవారు ఎక్కువ మంది ఉండడంతో వారందరినీ పక్కనపెట్టి వన్నియకుల క్షత్రియ వర్గానికి చెందిన రాజన్‌ను కొనసాగించే అవకాశాలున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన్ను కొనసాగించి ప్రధాన కార్యదర్శిని మారుస్తారని చెప్పుకుంటున్నారు. రాజన్‌కు ఇప్పటికే కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు, మరో పదవి ఇవ్వరని చెప్పే సీనియర్లూ ఉన్నారు. ఏదైనా సోమవారం ఓ కొలిక్కి రానుంది. త్రీమెన్‌ కమిటీ అభిప్రాయలను తీసుకుని సీఎం చంద్రబాబుకు అందిస్తారు.

Updated Date - Aug 24 , 2025 | 01:56 AM