అరచేతిలో ఆరోగ్య వివరాలు సంజీవని ప్రాజెక్టు
ABN , Publish Date - Nov 30 , 2025 | 01:26 AM
ఆస్పత్రికి వెళ్లిన ప్రతిసారీ అన్నిరకాల పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు. వైద్యులు మారినప్పుడల్లా మన ఆరోగ్య వివరాలన్నీ మళ్లీ మళ్లీ చెప్పాల్సిన పని లేదు.మనకు చేసిన పరీక్షలు, వాడిన మందులు, ఆరోగ్య సమస్యలు, చికిత్స చేసిన వైద్యుడి పేరు.. తదితర వివరాలన్నీ ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో నమోదు చేస్తారు.
ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో పూర్తి
జిల్లావ్యాప్త సమాచార సేకరణ ప్రారంభం
ఆస్పత్రికి వెళ్లిన ప్రతిసారీ అన్నిరకాల పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు. వైద్యులు మారినప్పుడల్లా మన ఆరోగ్య వివరాలన్నీ మళ్లీ మళ్లీ చెప్పాల్సిన పని లేదు.మనకు చేసిన పరీక్షలు, వాడిన మందులు, ఆరోగ్య సమస్యలు, చికిత్స చేసిన వైద్యుడి పేరు.. తదితర వివరాలన్నీ ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో నమోదు చేస్తారు. దానికో ఐడీ, పాస్‌వర్డ్ కేటాయిస్తారు. భవిష్యత్తులో వేరే ఆస్పత్రికి వెళ్లినా పేషెంట్ ఐడీ వైద్యుడికి చెబితే చాలు. వైద్యుడు ఆ హెల్త్ హిస్టరీ తెలుసుకుని చికిత్స అందిస్తారు.ఇలా ఆరోగ్య సమాచారాన్ని క్రోడీకరించే కేంద్రాన్ని డిజిటల్ నెర్వ్ సెంటర్ అంటారు.ఆరోగ్యాంధ్ర కల సాకారంలో భాగంగా టాటా సంస్థ సహకారంతో దీన్ని కుప్పం ఏరియా ఆస్పత్రిలో సీఎం చంద్రబాబు జూలై 3వ తేదీన ప్రారంభించారు. సంజీవని ప్రాజెక్టు అని ఈ పథకానికి పేరు పెట్టారు.తొలి విడతగా కుప్పం నియోజకవర్గం, రెండో దఫాలో చిత్తూరు జిల్లా, మూడో దఫాలో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతానికి కుప్పం నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సమాచార సేకరణ పూర్తయింది.జిల్లావ్యాప్త ప్రజల ఆరోగ్య సమాచార సేకరణ ఇటీవలే మొదలైంది.
-చిత్తూరు, ఆంధ్రజ్యోతి
3.2లక్షలమందికి డిజిటల్ హెల్త్ కార్డులు
కుప్పం నియోజకవర్గంలోని 11 పీహెచ్‌సీలు, 2 యూపీహెచ్‌సీలు, 92 విలేజ్ హెల్త్ సెంటర్లను అనుసంధానిస్తూ కుప్పం ఏరియా ఆస్పత్రిలో డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.నియోజకవర్గంలోని 3.20 లక్షల మందికి వైద్య పరీక్షలు చేసి వ్యాధుల ప్రొఫైల్‌తో కూడిన డిజిటల్ హెల్త్ కార్డులు సిద్ధం చేశారు. ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించి డిజిటలైజ్ చేశారు. దీని కోసం మొత్తం రూ.5.20 కోట్లను కేటాయించగా, రూ.2.50 కోట్లతో అన్ని ఆస్పత్రుల్లో కంప్యూటర్లు, ఫర్నిచర్ వంటి సదుపాయాల్ని ఏర్పాటు చేశారు.
జిల్లావాసులకు రెండో విడత పరీక్షలు
కుప్పం నియోజకవర్గంలోని 3.20 లక్షల మంది ప్రజల హెల్త్ హిస్టరీ నమోదు పూర్తవ్వగా, ఇప్పుడు మిగిలిన జిల్లాలోని 17 లక్షల మంది వివరాలను డిజిటలైజ్ చేస్తున్నారు.కుప్పం తరహాలోనే జిల్లాలోని అన్ని పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక డెస్క్‌ను ఏర్పాటు చేసి వివరాలను నమోదు చేయనున్నారు. జనవరి నెలాఖరులోగా జిల్లా వివరాల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.తరువాత మూడో విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
వీడియోకాల్‌తోనూ వైద్య సేవలు
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30.90 లక్షల మంది డిజిటల్ నెర్వ్ సెంటర్ సాయం పొందారు. రోగి మారుమూల ప్రాంతంలో ఉన్నా వీడియోకాల్ ద్వారా వైద్యులతో మాట్లాడుతున్నారు. 1.17 లక్షల మంది వర్చువల్ పద్ధతిలో వైద్యుల సూచనలు తీసుకున్నారు. నెర్వ్ సెంటర్‌కు కాల్ చేసి నేరుగా పేషెంట్ తన ఐడీ చెప్పగానే వైద్యులు వివరాలను పరిశీలించి, సమస్య తెలుసుకుని సూచనలు అందిస్తున్నారు. కర్ణాటకలోని కోలారు జిల్లా, హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పురంతో పాటు చెన్నై, కోల్‌కతా, గువాహటిలోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. మంత్రులు లోకేశ్, సత్యకుమార్ గతేడాది కోలార్ వెళ్లి డిజిటల్ నెర్వ్ సెంటర్లను పరిశీలించి వచ్చిన సంగతి తెలిసిందే.