Share News

భార్యను దూరం చేస్తోందని..అత్తను కడతేర్చాడు

ABN , Publish Date - Jul 24 , 2025 | 01:56 AM

భార్యను తన నుంచి దూరం చేస్తోందని భావించి అత్తను హత్య చేశాడా అల్లుడు. ఈ ఘటన నాయుడుపేటలో చోటు చేసుకుంది.

భార్యను దూరం చేస్తోందని..అత్తను కడతేర్చాడు
మృతదేహాన్ని పరిశీలిస్తున్న తహసీల్దారు, సీఐ

స్వర్ణముఖినదిలో మృతదేహం పూడ్చివేత

నాయుడుపేట టౌన్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): భార్యను తన నుంచి దూరం చేస్తోందని భావించి అత్తను హత్య చేశాడా అల్లుడు. ఈ ఘటన నాయుడుపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... నాయుడు పేట మండలం అయ్యప్పరెడ్డిపాళెంలోని సగుటూరు చెంగమ్మకు ముగ్గురు కుమార్తెలు. మూడో కుమార్తె స్వాతిని పండ్లూరు గ్రామానికి చెందిన వెంకయ్యకు ఇచ్చి వివాహం చేసింది. వీరిద్దరూ చెంగమ్మ ఇంటి వద్దే ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె. కొంతకాలంగా తన నుంచి భార్యను దూరం చేస్తోందని చెంగమ్మ మీద వెంకయ్య కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో నెల్లూరులో ఉన్న మరో కుమార్తె వద్దకు వెళ్లిన చెంగమ్మ మంగళవారం మధ్యాహ్నం తిరిగి నాయుడుపేటకు వచ్చింది. బస్టాండ్‌లో దిగిన ఆమెను వెంకయ్య తన ఆటోలో ఎక్కించుకొని షుగర్‌ ఫ్యాక్టరీ సమీపంలోని స్వర్ణముఖినది వద్ద ఉన్న నర్సరీ సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య చిన్నపాటి వివాదం జరిగింది. వెంకయ్య తన దగ్గర ఉన్న కత్తితో చెంగమ్మ(45) గొంతుకోసి హతమార్చాడు. మృతదేహాన్ని అక్కడే వదిలేసి ఆటో తీసుకొని వెళ్లిపోయాడు. రాత్రి 10 గంటల సమయంలో పార తీసుకెళ్లి గుంట తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఈ ప్రాంతానికి సమీపంలో బుధవారం ఉదయం వెంకయ్య సంచరిస్తుండగా చెంగమ్మ బంధువులకు అనుమానం వచ్చి ప్రశ్నించారు. దేహశుద్ధి చేసి గట్టిగా నిలదీయడంతో చెంగమ్మను హతమార్చిన విషయం వెల్లడించాడు. కుటుంబసభ్యులు, బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, అర్బన్‌ సీఐ బాబి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాయంత్రం తహసీల్దారు రాజేంద్ర సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు వెంకయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Updated Date - Jul 24 , 2025 | 01:56 AM