Share News

‘మాంగల్యపూజ’ అంటూ ముంచేస్తాడు

ABN , Publish Date - May 01 , 2025 | 01:43 AM

‘పుణ్య పుష్కరిణిలో మునిగి రండి. ఆలయం ముందు మాంగళ్య పూజ చేస్తాం. మీ భర్తకీ, కుటుంబానికీ మేలు జరుగుతుంది’ అని తిరుమలకు వచ్చిన భక్తులను నమ్మించి బంగారంతో ఉడాయించే ఒక ఘరానా మాయగాడిని తిరుమల పోలీసులు బుధవారం వలపన్ని పట్టుకున్నారు.

‘మాంగల్యపూజ’ అంటూ ముంచేస్తాడు
మురుగన్‌ నాగరాజు

తిరుమలలో మహిళల బంగారు కొట్టేసిన మాయగాడి అరెస్టు

తిరుమల, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ‘పుణ్య పుష్కరిణిలో మునిగి రండి. ఆలయం ముందు మాంగళ్య పూజ చేస్తాం. మీ భర్తకీ, కుటుంబానికీ మేలు జరుగుతుంది’ అని తిరుమలకు వచ్చిన భక్తులను నమ్మించి బంగారంతో ఉడాయించే ఒక ఘరానా మాయగాడిని తిరుమల పోలీసులు బుధవారం వలపన్ని పట్టుకున్నారు. టీటీడీ ఉద్యోగినని చెబుతూ ఇప్పటికే ఇతడు రూ.13 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కొట్టేసినట్లుగా గుర్తించారు. మదురైకి చెందిన మురుగన్‌ నాగరాజు అలియాస్‌ శంకర్‌రావు లీలలు తెలుసుకున్న పోలీసులు నివ్వెరపోయారు. తిరుమల ఆలయ పరిసరాల్లో భక్తిపారవశ్యంలో మునిగి కనిపించే వారిని మురుగన్‌ ఎంపిక చేసుకుంటాడు. టీటీడీలో పని చేస్తున్నానంటూ పరిచయం చేసుకుంటాడు. తిరుమల క్షేత్ర పవిత్రత గురించి గొప్పగా చెప్పి ఆలయం ముందు మాంగళ్యపూజ చేయించుకుంటే భార్యాభర్తల బంధం గట్టిగా ఉంటుందని నమ్మిస్తాడు. దుకాణాల వద్దకు తీసుకెళ్లి మట్టి గాజులు కొనిస్తాడు. ఒంటిమీదున్న బంగారు ఆభరణాలు తీసేసి.. పుష్కరిణిలో స్నానం చేసి ఆలయం ముందుకొస్తే మాంగళ్యపూజ చేస్తామని నమ్మిస్తాడు. అలా పుష్కరిణి స్నానానికి వెళ్లే భక్తుల నుంచి బంగారు ఆభరణాలు తీసుకుని, పూజకు ఏర్పాట్లు చేస్తానంటూ ఉడాయిస్తాడు. ఇలా మార్చి 29న 40 గ్రాముల బంగారు మాంగళసూత్రం, లక్ష్మీడాలర్‌ చైన్‌, సెల్‌ఫోన్లు కొట్టేశాడు. మార్చి14న తాను టీటీడీ విజిలెన్స్‌, అడ్మినిస్ర్టేషన్‌ ఆఫీ్‌సలో పనిచేస్తానని చెప్పి కోయంబత్తూరుకు చెందిన శరణ్యను నమ్మించాడు. 80 గ్రాముల బంగారు నగలు తీసుకుని ఆమెను పుష్కరిణిలో మునిగి రమ్మని పంపి పరారయ్యాడు. ఇదేనెల 18న తిరువళ్లూరుకు చెందిన లక్ష్మి నుంచి 12 గ్రాముల బంగారు గొలుసుతో మాయమైపోయాడు. భక్తుల ఫిర్యాదులతో తిరుమల వన్‌టౌన్‌ ఎస్‌ఐలు చలపతి, రమే్‌షబాబు ప్రత్యేక బృందంగా ఏర్పడి మురుగన్‌ కోసం గాలింపు ప్రారంభించారు. చెన్నై, మదురై, పుదుచ్చేరి నగరాల్లో క్రైం స్టేషన్లను సందర్శించి పాత రికార్డులను పరిశీలించగా ఇతడి వివరాలు వెలుగులోకి వచ్చాయి. మురుగన్‌ నాగరాజుపై ఏపీ, తమిళనాడుల్లో 20కిపైగా కేసులున్నట్టు వెల్లడైంది. సాకేంతిక పరిజ్ఞానం సాయంతో ఆ మాయగాడిని అరెస్ట్‌ చేసి, 132 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మురుగన్‌ నాగరాజు అలియాస్‌ శంకర్‌రావును తిరుపతి కోర్టులో హాజరు పరచగా రిమాండు విధించారు.

Updated Date - May 01 , 2025 | 01:43 AM