తిరుపతి జిల్లాకు హంద్రీ-నీవా జలాలు
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:10 AM
జిల్లాలోకి హంద్రీ-నీవా జలాలను మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.126.06 కోట్లు మంజూరు చేసింది. అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలం అడవిపల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరుకు ఏర్పాటు చేసిన నీవా బ్రాంచి కెనాల్ నుంచీ చంద్రగిరి, తిరుపతి, తిరుమల వరకూ నీటిని మళ్ళించేందుకు జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఫిబ్రవరి 8, మార్చి 5వ తేదీల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
రూ. 126 కోట్లు మంజూరుచేస్తూ జీవో జారీ
సీఎం, మంత్రులకు ఎమ్మెల్యే నానీ కృతజ్ఞతలు
తిరుపతి/చంద్రగిరి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోకి హంద్రీ-నీవా జలాలను మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.126.06 కోట్లు మంజూరు చేసింది. అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలం అడవిపల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరుకు ఏర్పాటు చేసిన నీవా బ్రాంచి కెనాల్ నుంచీ చంద్రగిరి, తిరుపతి, తిరుమల వరకూ నీటిని మళ్ళించేందుకు జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఫిబ్రవరి 8, మార్చి 5వ తేదీల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. రూ.127 కోట్ల అంచనా వ్యయంతో చంద్రగిరి మండలం నారావారిపల్లి సమీపంలోని మూలపల్లి చెరువుకు, అక్కడి నుంచీ మరో నాలుగు చెరువుల మీదుగా కళ్యాణి డ్యామ్‌కు మళ్ళించేలా డిజైన్ రూపొందించారు. మార్గమధ్యంలో 1154 ఎకరాలకు సాగునీరందించడానికి కూడా ప్రతిపాదించారు. దీనిపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడును పలుమార్లు కలిసి ఈ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు. దీంతో ఈ నెల 3న జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆమోదం లభించింది. తాజాగా జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్ సంబంధిత పనుల కోసం రూ.126.06 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ‘నా ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సాయం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడుకు కృతజ్ఞతలు చెబుతున్నా’ అని బుధవారం రాత్రి ఎమ్మెల్యే పులివర్తి నానీ ఆంధ్రజ్యోతితో అన్నారు. మిగిలిన హామీలను నెరవేర్చేందుకూ కృషి చేస్తానన్నారు.